- ముఖ్యమంత్రి సభలో బుద్దిగా కూర్చోండి
- డ్వాక్రా మహిళలకు అధికారుల హెచ్చరిక
యలమంచిలి, నాతవరం : ముఖ్యమంత్రి చంద్రబాబు చె ప్పేది వినండి.. సభలో గొడవ చేశారో? మీ గ్రూపులకు డ్వాక్రా రుణాల రద్దు వర్తించదు. డ్వాక్రా మహిళలకు అధికారుల హెచ్చరికలివి. గతంలో ఏ ముఖ్యమంత్రికి లేని విధంగా జిల్లాలో చంద్రబాబు పర్యటన సభ నిర్వహణకు అధికారులు పోటీ పడుతున్నారు. సభ విజయానికి కొన్ని రోజులుగా రేయింబవళ్లూ శ్రమిస్తున్న అధికారులు సభలో మహిళలు మౌనంగా ఉండాలని హుకుం జారీ చేసినట్టు తెలుస్తోంది.
నక్కపల్లి సభకు దాదాపు 30 వేల మంది మహిళలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామని అధికారం చేపట్టిన చంద్రబాబు గ్రూపుకు రూ.లక్ష మాఫీ హామీ మహిళలను ఏమాత్రం సంతృప్తిపరచడం లేదు. మహిళల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో జిల్లా పర్యటనకు వస్తున్న చంద్రబాబు వద్ద తమ గోడును వినిపించేందుకు సన్నద్ధమవుతున్నారు. సభలో మహిళలు ఆందోళనకు దిగితే చంద్రబాబు ఆగ్రహానికి గురి కావలసి వస్తుందన్న భయంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యగా వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు ఎంత వారించినా మహిళలు మాత్రం డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేయాలన్న డిమాండ్‌తోనే సభలకు హాజరవుతున్నారని తెలిసింది.
తాళం వేసే వారినే తరలించండి
ముఖ్యమంత్రి సభల్లో మహిళల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఎదురవకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన పర్యటనకు అధికంగా రైతులు, డ్వాక్రా మహిళలను అధిక సంఖ్యలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం అన్ని మండలాలకు జిల్లాస్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. నాతవరం మండలానికి ప్రత్యేకాధికారిగా నియమితులైన డీఆర్‌డీఏ ఏపీఎం కనక దుర్గ గురువారం ఐకేపీ కార్యాలయంలో మండలంలోని ముఖ్య డ్వాక్రా సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఆ సమావేశానికి ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉన్న మహిళలను మాత్రమే తరలించాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై నిలదీసే వారిని సమావేశాలకు తీసుకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మండలం నుంచి ఈనెల 9న నక్కపల్లి ప్రాంతంలో జరిగే ముఖ్యమంత్రి సభకు 25 బస్సుల్లో సుమారుగా వెయ్యి మందిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఐకేపీ ఏపీఎం శివ ప్రసాద్‌ను అదేశించారు.