సాక్షి, కడప : రాష్ట్ర విభజన నేపధ్యంలో ట్రెజరీ కార్యాలయంలో జూన్ 2వ తేదీ వరకు కార్యకలాపాలు స్తంభించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్ల ఆఖరి వేతనం వారం రోజుల ముందే అందింది.ట్రెజరీలో బిల్లులు మంజూరు చేసేందుకు గడువు శనివారంతో ముగిసింది. ఆ బిల్లులను సోమవారం లోపు క్లియర్ చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. జూన్ 2వ తేదీన రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోనుండటంతో జిల్లాలోని 30 వేల మందికి పైగా ఉద్యోగులు, 27 వేల మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన జీతభత్యాలు, పింఛన్ల చెల్లింపులు, డీఏ బకాయిలు, ఆఫీసు నిర్వహణ ఖర్చులు, ఎన్నికల ఖర్చులు, సమైక్యాంధ్ర సమ్మెకాలంలో ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవుల బిల్లుల చెల్లింపులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ ఆదేశించింది. ఆ మేరకు జిల్లాలో దాదాపు రూ. 100 కోట్ల మేర బిల్లులను ఖజానా శాఖ పాస్ చేసింది. బిల్లుల చెల్లింపు గడువు శనివారంతో ముగిసింది.
జిల్లాలోని ట్రెజరీ కార్యాలయంతోపాటు 13 సబ్ ట్రెజరీలకు వచ్చిన అన్ని బిల్లుల చెల్లింపులను పూర్తి చేశారు. ఏవైనా మిగిలిపోయిన బిల్లులు కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తదుపరి ఆదేశాల మేరకే చెల్లింపులు జరగనున్నాయి. అపాయింట్‌డే వరకు పరిపాలనకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థల రోజువారీ ఆర్థిక లావాదేవీలు క్షేత్ర స్థాయిలో స్తంభించనున్నాయి. తిరిగి కొత్త రాష్ట్రంలో నూతన మార్గదర్శకాలు వెలువడిన తర్వాతే లావాదేవీలు ప్రారంభం కానున్నాయి.
శాఖల కుదింపు
కొత్త రాష్ట్రాలు ఏర్పడనున్న నేపధ్యంలో హెడ్‌అకౌంట్లతోపాటు కొన్ని శాఖల పద్దులను కుదించే అవకాశం ఉందని ట్రెజరీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో మంజూరై ప్రస్తుతం జరుగుతున్న పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులుకూడా రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాతే పునః ప్రారంభయ్యే అవకాశం ఉందని అధికారులు స్పష్టంచేస్తున్నారు. ఇందులో భాగంగా ట్రెజరీ శాఖకు సంబంధించిన సర్వర్‌లను కూడా పూర్తిగా లాక్ చేస్తున్నట్లు సమాచారం.
చెల్లింపులు పూర్తి
జిల్లాలో ఉద్యోగుల జీతభత్యాలు, అన్ని రకాల బిల్లులకు సంబంధించి దాదాపు రూ. 100 కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయి. మొత్తం చెల్లింపులకు సంబంధించి గడువు శనివారంతో ముగిసింది. బ్యాంకర్ల చెల్లింపులకు మాత్రం 26వ తేదీ వరకు గడువు ఉంది.మొత్తం పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేశాం. జూన్ 3వ తేదీన తిరిగి ఆర్థిక సేవలు ప్రారంభం కానున్నాయి. అంతవరకు ఎటువంటి లావాదేవీలు జరగవు.
- రంగప్ప, ట్రెజరీ డీడీ
ఆగిన ఆర్థిక సేవలు
Published Mon, May 26 2014 1:56 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement