రాష్ట్రవిభజన నేపథ్యంలో ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించనుంది. పలు ప్రభుత్వశాఖలకు సంబంధించిన కార్యాకలాపాలను నేడు, రేపు తాత్కాలికంగా నిలిపేయనున్నారు. జూన్ రెండు అపాయింటెడ్ రోజున కూడా పూర్తిస్థాయిలో పాలన దారికొచ్చే పరిస్థితులు కన్పించడం లేదు. దీంతో జూన్ 3వ తేదీ నుంచే ప్రభుత్వశాఖల్లో మళ్లీ పాలన యథాస్థితికి రానుంది.
ఇప్పటికే ఉద్యోగులకు వేతనాలు అందజేశారు. దీంతో రెండురోజుల్లో అత్యవసర కార్యకలాపాలు కూడా లేవు. తెలంగాణ కొత్తగా ఏర్పడటం... రాష్ట్రానికి సంబంధించిన అన్ని అధికారిక కార్యకలాపాలు, తదితర అంశాలు పాత రాష్ట్రం స్థానే దాదాపుగా ఉండటంతో జూన్ 3 నుంచే పాలన సజావుగా సాగే అవకాశం ఉంది.
సాక్షి, కడప: రాష్ట్ర విభజన జిల్లా పరిపాలనపై పెద్దగా ప్రభావం చూపనప్పటికీ శని, ఆది, వారాలు రెండు రోజులు పాటు సేవలు నిలిచిపోనున్నాయి. సోమవారం జూన్ 2 నుంచి మళ్లీ పాలన యథావిధిగా జరగనుంది. రెండో శనివారం వచ్చిందని ప్రజలు భావించినట్లు మినహా పాలనకు సంబంధించి పెద్దగా ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశం లేదు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం నుంచి కార్యకలాపాలు యథావిధిగా జరగాలని ప్రభుత్వం ఆదేశించినా, ఆ రోజు కూడా పాలన పూర్తిగా దారికొచ్చే పరిస్థితులు లేవు. జూన్ 2న తెలంగాణలో రాష్ట్రపతి పాలన ఎత్తేయనున్నారు.
అక్కడ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అయితే రాష్ట్రంలో 8వ తేదీ వరకూ రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. అదే రోజు ఇక్కడా కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. తెలంగాణ అపాయింటెడ్ డేగా నిర్ణయించిన జూన్ 2 తర్వాత రెండు రాష్ట్రాలు అధికారంగా ఏర్పాటు అవుతాయి. పాలన కూడా వేర్వేరుగా సాగనుంది. ఈ క్రమంలో రెండు ప్రాంతాల ఉద్యోగుల విభజనతో పాటు అన్నిశాఖల్లో శాఖాపరమైన కార్యక్రమాలు పూర్తి కావాలి. ఈ క్రమంలో భాగంగానే మే 30 వరకూ ఉమ్మడి రాష్ట్రంలో కార్యక లాపాలు సాగాయి. మే 31, జూన్ 1 తేదీల్లో పూర్తిస్థాయిలో పాలనకు సంబంధించి విభజన ప్రక్రియ పూర్తి చేసి ఆపై కొత్త పాలన నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
ఆన్‌లైన్‌లో ప్రభుత్వ వెబ్‌సైట్లు నిలిపివేత
జిల్లాల వారీగా అన్ని ప్రభుత్వశాఖలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేశారు. ఆయా శాఖల్లోని ఉద్యోగుల వివరాలు, పనితీరుతో పాటు అన్ని రకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తారు. ఈ ప్రక్రియకు నేడు, రేపు బ్రేక్ పడనుంది. అలాగే పూర్తిగా వెబ్‌సైట్లు బ్లాక్ కానున్నాయి.
ట్రెజరీలో కూడా ఎలాంటి లావాదేవీలు జరగవు. ఇప్పటికే జిల్లాలోని దాదాపు 35 వేల మంది ఉద్యోగులకు వేతనాల చెల్లింపు ప్రక్రియ కూడా పూర్తయింది.
పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కూడా చెందాల్సిన లబ్ధిఅందేలా ట్రెజరీ అధికారులు చర్యలు తీసుకున్నారు. జూన్ 2 వరకూ ఎలాంటి లావాదేవీలు జరగవు. దీంతో పాటు రవాణశాఖకు సంబంధించి వాహనాల రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లెసైన్స్‌ల జారీ కూడా నిలిపేశారు. ఈ ప్రభావంతో కొత్త వాహనాల కొనుగోళ్లకు కూడా బ్రేక్ పడనుంది. జూన్ 2 నుంచే తిరిగి కార్యకలాపాలు మొదలెడతారు. వీటితో పాటు మీసేవ, ఈ సేవ ద్వారా అందే సేవలను కూడా తాత్కాలికంగా నిలిపేశారు.
మద్యం సరఫరా నిలిపివేత:
ఎక్సైజ్‌శాఖలో కూడా విభజన ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. ఈనెల 27 నుంచి మద్యం దుకాణాలకు సరఫరా నిలిపివేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ మద్యం సరఫరా చేసేందుకు వీల్లేదు. దీంతో కొన్ని మద్యం దుకాణాలు స్టాకు లేక మూతపడ్డాయి. ఎప్పటి నుంచి మద్యం సరఫరా చేయాలనేది అధికారులకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.
సేవలు బంద్
Published Sat, May 31 2014 2:14 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement