ఇక బాదుడే!
కడప అగ్రికల్చర్: మరో నెలన్నర రోజుల్లో కరెంటు చార్జీలు మోత మోగనున్నాయి. కొత్త ప్రభుత్వంలో బడ్జెట్ లోటును భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విభజన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్‌శాఖ నూతనంగా రూపొందించిన టారీఫ్ ప్రకారం కరెంటు బిల్లులు దాదాపు రెట్టింపు చేయనున్నారు. దీంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడనున్నాయి. కొత్త టారీఫ్ బిల్లును చూసి వినియోగదారుని గుండె గుభేల్‌మనడం ఖాయం. వినియోగదారుడి నడ్డి విరిచేలా ఉన్న ఈ తాజా ప్రతిపాదనలు అమలైతే జిల్లాలోని వినియోగదారులపై ఏడాదికి రూ. 185 కోట్ల భారం పడనుంది.
జూన్ నెల రెండో తేదీ విభజన నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌నెల నుంచి విద్యుత్ చార్జీలు పెంచాలని డిస్కం ఈఆర్‌సీకి ప్రతిపాదనలు గతంలోనే సమర్పించింది. అయితే సార్వత్రిక ఎన్నికలు, ట్రాన్స్‌కో విభజన తదితర అంశాలతో కరెంటు చార్జీలను పెంచలేకపోయారు. రాష్ట్ర విభజన అనంతరం యూనిట్ కరెంటు చార్జీ శ్లాబ్ దాటితే ముక్కుపిండి రూ. 300లకుపైగా వసూలు చేయనున్నారు. కొత్త రాష్ట్రంలో వినియోగదారులకు దిమ్మతిరిగేలా డిస్కం షాక్ ఇవ్వనుంది. చార్జీల పెంపు, కొత్త టారీఫ్‌లపై విద్యుత్‌శాఖ అధికారులు ప్రక్రియలు పూర్తి చేశారు.
జిల్లాలో అన్నీ కలిపి 8 లక్షల విద్యుత్ సర్వీసులున్నాయి.
ఇందులో గృహాల సర్వీసులు 1.96 లక్షలు, వ్యవసాయ సర్వీసులు 1.20 లక్షలు, పెద్ద పరిశ్రమల సర్వీసులు 350, ఎల్‌టీ సర్వీసులు 2500 ఉన్నాయి. ప్రస్తుతం 150 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే కరెంటు బిల్లు రూ. 382.50 వస్తోంది. పెరగనున్న విద్యుత్ చార్జీల ప్రకారం అదే 150 యూనిట్లకుగాను ఇకపై రూ. 611.50 చెల్లించాల్సి ఉంటుంది. పొరబాటున ఒక యూనిట్ అదనంగా వాడితే అంటే 151 యూనిట్లు వాడితే బిల్లు రూ. 927లు రానుంది. అంటే ఒక్క యూనిట్ పెరిగితే అదనంగా రూ. 316 బిల్లు వస్తుంది. 50 యూనిట్ల శ్లాబ్ పరిధిలోకి యూనిట్ రేటు పెంచి వినియోగదారుడి నుంచి వసూలు చేయనున్నారు.
పస్తుతం 0-50, 51-100, 101-150 శ్లాబ్ పరిధిలో రూ. 1.45, 2.60, 3.60 చొప్పున లెక్క కట్టి బిల్లులు వసూలు చేస్తున్నారు. పెరిగే చార్జీల ప్రకారం యూనిట్ ఈ శ్లాబ్‌ల పరిధిలోనే రేటు రూ 3.10, 3.75, 5.38ల వంతున బిల్లులు పెంచనున్నారు. 150 యూనిట్లు దాటి ఒక్క యూనిట్ పెరిగినా, 151-200 శ్లాబ్‌లోని యూనిట్ రేటు రూ. 6.32 ల వంతున ఆ శ్లాబ్ మొత్తం వసూలు చేస్తా రు. ఇప్పటికే డిస్కం విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ)కి ప్రతిపాదనలు సమర్పించగా ఆ మండలి ఆమోదం తెలపడం తో వినియోగదారులకు ఇక కరెంటు బిల్లుల మోత మోగనుంది. గృహ విని యోగదారులకు 100 యూనిట్లకు ఉన్న శ్లాబ్‌ను 50 యూనిట్లకు కుదించనున్నా రు. ఈ బాదుడు మొదలైతే జిల్లాలో విని యోగదారులపై ఏడాదికి రూ.185 కోట్ల భారం పడుతుందని అంచనా. ప్రస్తుతం కడప సర్కిల్ నుంచి ఏటా డిమాండ్ రూ.396 కోట్ల వరకు ఉంది. పెరగనున్న చార్జీలతో ఈ డిమాండ్ రూ.581 కోట్లు కానుంది. రాష్ట్ర విభజనతో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్‌కు అదనంగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్‌లో ఉన్న కర్నూలు, అనంతపురం జిల్లాలు కలిశాయి. దీంతో వ్యవసాయ కనెక్షన్లకు అందిస్తున్న సబ్సిడీ పెరుగుతుందా? లే దా? అనే అంశంపై చర్చ జరుగుతోంది.