బొగాబెణి(కంచిలి), న్యూస్‌లైన్: మండలంలో తుపాను నష్టాల నమోదు తీరు, అధికారుల నిర్లక్ష్య వైఖరిపై జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.వి.కృష్ణారావు చెప్పారు. ఆయన తన అనుచరులతో బొగాబెణి, సామంతబొనమాళి, బొనమాళి, జెన్నాగాయి, దాకరాపల్లి తదితర గ్రామాల్లో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తుపాను కారణంగా వాటిల్లిన నష్టం, జరిగిన అన్యాయంపై ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వరి, ఉద్యానపంటలైన కొబ్బరి, జీడి, మామిడి తదితర పంటలు తీవ్రంగా నష్టపోయినప్పటికీ అధికారులు వీటిని నమోదు చేయటంలేదని వాపోయారు. దీనికి కృష్ణారావు స్పందిస్తూ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. పర్యటనలో ఆయన వెంట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పలికల భాస్కరరావు, మండల పార్టీ కన్వీనర్ డి. రాఘవరావు, ట్రేడ్ యూనియన్ కన్వీనర్ జి.ఆదినారాయణ, ఇచ్చాపురం పట్టణ పార్టీ కన్వీనర్ పి.కోటిరెడ్డి, బొగాబెణి సర్పంచ్ జి. మాధయ్య, జి.చంద్రయ్య ఉన్నారు.