మంచి పనులు చేస్తూ ప్రజలకు మార్గదర్శకులుగా నిలవాల్సిన టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు స్వలాభం కోసం తప్పుడు పనులకు దర్శకత్వం వహిస్తున్నారు. బాధ్యత గల ఎంపీ.. స్థలం విషయంలో ఓ వ్యక్తిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మరో ఎమ్మెల్యే ఏకంగా తన స్థానంలో మరొకరితో పరీక్షలు రాయిస్తున్నారు. ఈ రెండు ఘటనలు ఒకేరోజు వెలుగులోకి రావడంతో కలకలం రేగింది.
పార్కింగ్ పేరుతో దురాక్రమణ
సాక్షి, విజయవాడ : విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) తన కార్యాలయం పక్కనే ఉన్న స్థలాన్ని ఆక్రమించుకుని, ఖాళీ చేయకపోవడం వివాదాస్పదమైంది. సోమవారం స్థల యజమాని తన వర్గీయులతో కలిసి స్థలం స్వాధీనం చేసుకోవడానికి యత్నించగా నాని వర్గీయులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి...
నగరానికి చెందిన లిక్కర్ వ్యాపారి బొమ్మదేవర సుబ్బారావుకు బందరురోడ్డులోని పాత బస్టాండ్ సమీపంలో 346 గజాల ఖాళీ స్థలం ఉంది. దీని పక్కనే ఎంపీ కేశినేని నాని తన స్థలంలో కార్యాలయం ఏర్పాటుచేసుకున్నారు. సుబ్బారావు గత ఏడాది తన స్థలాన్ని మెరక చేయించారు. ఇందులో భవనం నిర్మించుకోవాలనుకుంటుండగా.. ‘ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. తన కార్యాలయానికి వచ్చే వాహనాలు పార్కింగ్‌కు చాలినంత స్థలం లేనందున కొద్ది రోజులు పక్కనే తమకు స్థలం ఇవ్వాలని నాని కోరగా సుబ్బారావు అందుకు అంగీకరించారు. దీనికి ఫణికుమార్ అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించారు. వాహనాల పార్కింగ్ కోసమే స్థలాన్ని ఉచితంగా తీసుకున్న నాని, అక్కడ పెద్దపెద్ద ఫ్లెక్సీలు పెట్టడమే కాకుండా తన కార్యాలయానికి కావాల్సిన పెద్ద జనరేటర్‌ను ఏర్పాటుచేశారు. కాగా.. గత ఆగస్టులో ఇక్కడ భవన నిర్మాణం కోసం సుబ్బారావు శంకుస్థాపన చేశారు. అయినప్పటికీ ఎంపీ కేశినేని నాని ఈ స్థలం ఖాళీ చేయకుండా తన స్వాధీనంలోనే ఉంచుకున్నారు. అక్కడ తన వాహనాలను పార్కింగ్ చేయడమేకాక చుట్టూ ప్రహరీ ఏర్పాటుచేసి తాళాలు వేయించారు. దీంతో సోమవారం ఈ స్థలంలోకి సుబ్బారావు వర్గీయులు ప్రవేశించి జనరేటర్‌ను తొలగించారు. అదే సమయంలో కేశినేని వర్గీయులు అడ్డుకోవడంతో ఇరువర్గాలు మధ్య తోపులాట జరిగింది. ఆ తర్వాత వైఎస్సార్ సీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను అక్కడకు రావడంతో కేశినేని వర్గీయులు మరింత రెచ్చిపోయి స్థలంలోకి చొచ్చుకువచ్చారు.
నా స్థలాన్ని ఎవరికీ అద్దెకివ్వలేదు : సుబ్బారావు
ఈ అంశంపై స్థల యజమాని బొమ్మదేవర సుబ్బారావు మాట్లాడుతూ.. ఆ స్థలం తాను కొనుగోలు చేసుకున్నానని, కేశినేని నానికి కాని మరెవ్వరికీ అద్దెకు ఇవ్వలేదని ఎన్నికల ముందు కేవలం వాహనాలు పార్కింగ్ చేసుకుంటానంటే చంద్రబాబుపై అభిమానంతో ఉచితంగా ఇచ్చానని తెలిపారు. కేశినేని నాని స్థలాన్ని ఖాళీ చేయకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా కలిసి వివరించానని, పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశానని తెలిపారు. కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చానని వివరించారు. భవన నిర్మాణానికి గత ఆగస్టులో తాను శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు నాని వర్గీయులు అడ్డుకున్నారని, తాను శంకుస్థాపన చేసిన గోతులను కూడా పూడ్చివేశారని తెలిపారు. ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌లు చేసి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ స్థలంలో తాను కమర్షియల్ కాంప్లెక్స్ మాత్రమే నిర్మించాలని అనుకుంటున్నానని, అయితే వైఎస్సార్ సీపీ కార్యాలయానికి ఇస్తావా.. అంటూ కేశినేని అడ్డుకుంటున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా తమ కార్యాలయం పక్కనే నూతనంగా నిర్మించే భవనంలో వైఎస్సార్ సీపీ కార్యాలయం పెడతారని అందువల్లనే కేశినేని నాని అడ్డుకుంటున్నారని ఆయన వ ర్గీయులు చెబుతున్నారు. నాని లేని సమయంలో జనరేటర్ తొలగించినందున తాము అడ్డుకుంటే సుబ్బారావు వర్గీయులు దాడిచేశారని ఆరోపించారు.
బుక్కయిన ‘బోడే’
పెనమలూరు : పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు బోడె ప్రసాద్ రాస్తున్న ఇంటర్ వన్ సిట్టింగ్ పరీక్ష వివాదస్పదంగా మారింది. ఆయన సింగపూర్‌లో ఉండగా మరో వ్యక్తి ఆయనకు బదులుగా పరీక్షకు హాజరుకావడం, ఈ విషయం పరీక్షా కేంద్రమంతా తెలిసిపోవడం పెద్ద కలకలం సృష్టించింది. ఇది ఆ నోటా ఈ నోటా మీడియాకు తెలియడంతో ఎమ్మెల్యే స్థానంలో పరీక్ష రాస్తున్న వ్యక్తిని అధికారులు తప్పించారు. అయితే స్క్వాడ్, పరీక్షా కేంద్ర నిర్వహకులు మాత్రం ఆరోపణల్లో నిజంలేదని అన్నారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
బోడె ప్రసాద్ ఇంటర్ వన్ సిట్టింగ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (దూరవిద్య) పరీక్షకు గంగూరు మహితా కాలేజీ నుంచి ఫీజు కట్టారు. ఆయనకు పోరంకి తాతినేని గోపయ్య అకాడమీకి చెందిన ఎస్‌కెవీఎస్ జూనియర్ కాలేజీలో పరీక్ష రాయటానికి సెంటర్ ఇచ్చారు. ఈ పరీక్షలు సెప్టెంబర్ 27 నుంచి నవంబర్ పది వరకు జరగనున్నాయి. ఇప్పటికి జరిగిన మూడు పరీక్షల్లో ఎమ్మెల్యే రెండు పరీక్షలకు హాజరైనట్లు ఉంది. ఒక పరీక్షకు గైర్హాజరయ్యారు. వాస్తవానికి ఎమ్మెల్యే ఆదివారం సింగపూర్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో సోమవారం ఫిజిక్స్ పరీక్ష జరిగింది. ఎమ్మెల్యే స్థానంలో బోడె ప్రసాద్ హాల్‌టికెట్‌తో మరో వ్యక్తి వచ్చి పరీక్షకు హాజరయ్యాడని పలువురు మీడియాకు ఉప్పందించారు.
పరీక్షా కేంద్రం వద్దకు మీడియా ప్రతినిధులు వెళ్లి అక్కడ ఉన్న స్క్వాడ్ ఎండి. రషీద్‌ను ఈ విషయమై ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు కేటాయించిన గదిని (4/4లో) చూడటానికి ఆయన అనుమతించలేదు. పావు గంట తరువాత మీడియాను లోపలికి అనుమతించారు. పరీక్ష జరుగుతున్న గదిలోకి వెళ్లి చూడగా ఎమ్మెల్యేకు కేటాయించిన హాల్ టిక్కెట్-బి 1614301455 స్థానంలో ఎవ్వరు కనిపించలేదు. అయితే పరీక్ష ప్రారంభమై అరగంటకు పైగా గడిచినా రికార్డులో అటెండెన్స్ చూపలేదు.ఈ విషయమై స్క్వాడ్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు.
సాక్ష్యం అందచేసిన విద్యార్థులు
ఇదిలా ఉంటే... ఎమ్మెల్యే స్థానంలో మరో వ్యక్తి పరీక్ష రాయటానికి వచ్చి, హడావుడి జరగటంతో తప్పించారని నూతక్కి నాగేశ్వరరావు అనే విద్యార్థి నాయకుడు ఆరోపించాడు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాము పరీక్ష రాసిన వ్యక్తి ఫొటో తీశామని, అలాగే బోడె ప్రసాద్ సంతకం చేసిన ఆన్సర్ షీట్ (నెంబర్ 112782) ఫోటో తీసి మీడియాకు అందజేశారు. ఎమ్మెల్యే అధికార దుర్వినియోగంతో ఈ పని చేశారని, కష్టపడి చదివిన విద్యార్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దొంగ దీక్షతో అభాసుపాలు..
గతంలో కూడా సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో బోడె ప్రసాద్ ఆమరణ దీక్షకు దిగి అభాసుపాలయ్యారు. ఈయన దీక్షను భగ్నం చేసేందుకు 2013 ఆగస్టు 30వ తేదీ రాత్రి శిబిరం వద్దకు పోలీసులు వెళ్లగా బోడె స్థానంలో ఆయన సోదరుడు కనిపించాడు. విషయం తెలుసుకున్న బోడె ప్రసాద్ దొంగచాటుగా శిబిరం వద్దకు చేరుకునే ప్రయత్నం చేస్తూ పోలీసులకు దొరికిపోయారు. పగటిపూట దీక్షా శిబిరంలో ఉంటూ రాత్రి సమయంలో తన సన్నిహితుడి ఇంట్లో ఏసీ గదిలో నిద్రించి ఉదయానికల్లా తిరిగి శిబిరంలో ప్రత్యక్షమవుతూ ప్రజలను నమ్మించేయత్నం చేయడంతో అప్పట్లో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
బరితెగింపు
Published Tue, Oct 21 2014 1:00 PM | Last Updated on Fri, Aug 10 2018 7:07 PM
Advertisement