'కసి’నేని
ఎంపీ కేశినేని శ్రీనివాస్ అత్యుత్సాహం
అడ్డగోలుగా దేవాలయాలు కూల్చివేత
ప్రశ్నించే వారిపై ఎదురుదాడి, బెదిరింపులు
క్షమాపణ చెప్పాలని హిందూ సంఘాలు డిమాండ్
పుష్కర పనులను పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు సూచిస్తే.. యాక్షన్‌లోకి దిగాల్సిన ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) ఓవరాక్షన్ చేశారు. అంతా సవ్యంగా నిర్వహిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. భక్తుల మనోభావాలను కాలరాస్తూ అభివృద్ధి ముసుగులో ఆలయాల కూల్చివేతతో ఆయన చెలరేగిపోయారు. అడ్డుకున్న వారిని కేసుల పేరిట బెదిరించారు.
అరే ఎవర్రా... ఒరేయ్ సీఐ వీళందర్నీ లాగేయండి.. మీ ఓట్లు మాకు అక్కర్లేదు.. నేను ఇలాగే చేస్తాను.. ఎవరు అడ్డువస్తారో చూస్తాను... ఎక్కువ మాట్లాడితే జైలులో పెట్టిస్తాను... గోశాలను అడ్డు పెట్టుకుని సంపాదించుకోవాలనుకుంటారా...! లల్లూ ప్రసాద్ యాదవ్‌లాగా గడ్డి తినాలనుకుంటుంటే కుదరదు... గోశాలను తొలగించి తీరతాం....
సాక్షి, విజయవాడ : ఆలయాలను కూల్చివేయొద్దని కోరడానికి వెళ్లిన నగర ప్రముఖులు, గోశాల ప్రతినిధులను ఉద్దేశించి విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ హుందా మరిచి మాట్లాడిన మాటలు ఇవీ... గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో పుష్కరాల పేరుతో 40 ఆలయాలను కూల్చివేసి, మరో 10 ఆలయాలను విజయవాడ కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు కూల్చివేయడం వెనుక ఎంపీ కేశినేని నాని, కలెక్టర్ బాబు.ఎ చూపిన అత్యుత్సాహంపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అభివృద్ధి పేరుతో అడ్డగోలుగా ఆలయాలను అర్ధరాత్రి వేళ పడగొట్టించమే కాకుండా.. కూల్చవద్దని కోరడానికి వెళ్లిన వారిని చులకన చేస్తూ గడ్డి తినడానికి ప్రయత్నిస్తున్నారంటూ కేశినేని నాని ఎద్దేవా చేయడంపై పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ముఖ్యమంత్రి పెత్తనం ఇచ్చారని...
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంద్రకీలాద్రిని సందర్శించిన సమయంలో దుర్గగుడి ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించాలని ఎంపీ కేశినేనికి సూచించారు. దీంతో ఆయన అత్యుత్సాహం ప్రదర్శిస్తూ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించే బాధ్యత భుజాలకు ఎత్తుకున్నారు. ఈ నేపథ్యంలో ఘాట్లు, రోడ్లు విస్తరణకు అడ్డుగా ఉన్నాయంటూ ఎంపీ కేశినేని సూచనలతో కలెక్టర్ బాబు.ఎ దగ్గరుండి ఆలయాలను కూల్చివేయించారు. ముఖ్యంగా నదీతీరంలోని సీతమ్మవారిపాదాలు, శనీశ్వరాలయం, భూగర్భ వినాయకుడి గుడి, ఆంజనేయస్వామి ఆలయం, సాయిబాబా గుడిని ధ్వంసం చేయించారు.
అర్ధరాత్రి వేళ గోశాల్లోకి పొక్లెయిన్లను పంపించి అక్కడి కృష్ణమందిరాన్ని, గోశాల భవనాలను ధ్వంసం చేయించారు. తొలుత ఒకటి రెండు చిన్నచిన్న ఆలయాలను కూల్చివేసినప్పుడు ప్రజల నుంచి అంతగా ప్రతిఘటన ఎదురవకపోవడంతో ఎంపీ కేశినేని మరింత రెచ్చిపోయి ముఖ్య ఆలయాలను కూల్చివేయించారని టీడీడీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గోశాలను కూల్చిన తరువాత వినాయకుడు గుడి కూల్చివేద్దామని భావించేసమయంలో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తంకావడంతో వెనక్కు తగ్గారు. చివరికి వినాయకుడి గుడిని కూల్చబోమంటూ కలెక్టర్ చేత వివరణ ఇప్పించారని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
తొలి నుంచీ వివాదాస్పదుడే!
ఎంపీ కేశినేని నానిది తొలి నుంచి దుందుడుకు స్వభావమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. తన కార్యాలయం పక్కనే ఉన్న స్థలాన్ని ఆక్రమించుకుని, ఖాళీ చేయమని కోరిన దాని యజమానితో విభేదించి పోలీసుల సహాయంతో స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. చివరకు ఇది వివాదాస్పదం కావడంతో వెనక్కు తగ్గారు. ఇప్పుడు ఏకంగా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఆలయాలను కూల్చివేయడం... అడిగిన వారిపై కేసులు పెట్టిస్తామని బెదిరించడాన్ని హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
పర్యవసానంగా ఇప్పుడు ఎంపీ కేశినేని, కలెక్టర్ బాబు.ఎ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ నగర వాసులు ముక్త కంఠంతో కోరుతున్నారు. వీరి తీరును గర్హిస్తూ ముద్రించిన కరపత్రాలను నగరంలో జోరుగా పంపిణీచేస్తున్నారు. రాబోయే రోజల్లో ఆయనకు వ్యతిరేకంగా పనిచేయాలని పలు హిందూ సంఘాలు నిర్ణయించుకున్నాయని సమాచారం.
మార్వాడీలపైన అసహనం
దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయం కూల్చివేత విషయమై మాట్లాడటానికి ఎంపీ కార్యాలయానికి వెళ్లిన మార్వాడీ వ్యాపారులకు కేశినేని నాని నుంచి చేదు అనుభవమే ఎదురైంది. ‘ఎంపీ గోకరాజు గంగరాజు వద్దకు వెళ్తున్నారు.. ఆయన మీకు న్యాయం చేస్తారా?’ అంటూ నాని ఎదురు దాడి చేయడంతో ఏమి చేయాలో తెలియక మార్వాడీ ముఖ్యులంతా మౌనంగా వెనుదిరిగారు. కనీసం కూర్చోమని కూడా చెప్పకుండా ఎంపీ అసహనం ప్రదర్శించడం మార్వాడీ ల్లో చర్చనీయాశమైంది.