- ప్రజా సమాచార అధికారులకు తప్పని అవస్థలు
- ‘యునెటైడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్’ సర్వేలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: వివిధ శాఖల్లో సమాచార హక్కు చట్టం విభాగం కింద పనిచేస్తున్న ప్రజా సమాచార అధికారులు (పీఐఓ) అధిక సమయాన్ని ఆర్‌టీఐ దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని వెతికి కనిపెట్టడానికే సరిపోతోంది. ప్రభుత్వ విభాగాల్లో రికార్డుల నిర్వహణ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. సమాచార హక్కు చట్టం అమలు తీరుపై ‘యునెటైడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్’ క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సహ చట్టం పదో సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో క్షేత్రస్థాయి సర్వే ప్రాధాన్యత సంతరించుకొంది.
సర్వే వివరాలను సంస్థ ఇటీవల వెల్లడించింది. ముఖ్యాంశాలివీ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు ఆదిలాబాద్, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో సర్వే నిర్వహించారు. ఆర్‌టీఐ కింద అడిగిన సమాచారాన్ని వెతకడానికే అధిక సమయం వెచ్చించాల్సి వస్తోందని 73 శాతం మంది పీఐఓలు చెప్పారు. రికార్డు నిర్వహణ వ్యవస్థ సక్రమంగా లేకపోవడమే దానికి కారణం. 26 శాతం మంది పీఐఓల వద్ద ఆర్‌టీఐ చట్టం ప్రతి కూడా లేదు.
కేవలం ఉన్నతాధికారుల ఆదేశానుసారమే పీఐఓలుగా ఉన్నామని 90 శాతం మంది చెప్పారు. 63 శాతం మంది పీఐఓలు ఎలాంటి శిక్షణా కార్యక్రమాలకు హాజరు కాలేదు. విభాగానికి సంబంధించిన సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించడం లేదని దాదాపు పీఐఓలు అంతా చెప్పారు. అలాంటి నిబంధన ఉన్నట్లు తమకు తెలియదన్నారు. స్వచ్ఛందంగా సమాచారాన్ని వెల్లడిస్తే ఆర్‌టీఐ దరఖాస్తులు తగ్గుతాయని సగం మంది పీఐఓలు అభిప్రాయపడ్డారు.
మీడియా, పౌర సంఘాలు విస్తృతంగా ప్రచారం చేయడం, అక్షరాస్యత పెరగడం వల్ల ప్రజల్లో ఆర్‌టీఐ చట్టం మీద అవగాహన పెరిగిందని పీఐఓలు అభిప్రాయపడ్డారు. ఆర్‌టీఐ చట్టం వచ్చిన తర్వాత పాలనా తీరు, నిర్ణయాలు తీసుకొనే ధోరణి, సమాచార నిర్వహణలో మార్పులు వచ్చాయని 55 శాతం మంది పీఐఓలు చెప్పారు. ఈ చట్టం వల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరిగి..అవినీతి తగ్గిందని సర్వేలో వెల్లడైంది. సామాన్యులకూ ప్రభుత్వ పనితీరు పరిశీలించే అవకాశం కలిగింది.
సమర్థ అమలుకు ఏం చేయాలంటే...
ఆర్‌టీఐ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ‘యునెటైడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్’ సూచనలివీ...అధికారులు, సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వడానికి, చట్టం గురించి ప్రచారం చేయడానికి ప్రత్యేక బడ్జెట్ ఉండాలి. ఆర్థికాంశాలు సహా ఆయా శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించడం, తాజా సమాచారాన్ని జోడించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.