విజయనగరం ఆరోగ్యం: ఆమె ఓ ప్రజాప్రతినిధి. మహిళలకు రక్షణగా నిలవాల్సిన ఆమె..ఓ నర్సింగ్ విద్యార్థినిని కాటేయాలని చూసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి తిరిగి ఉద్యోగం ఇవ్వాలని కేంద్రాస్పత్రి ఉన్నతాధికారికి సిఫారసు చేయడం విడ్డూరం. ఈ విషయం కేంద్రాస్పత్రిలో సర్వత్రా చర్చనీయాంశమైంది. గత ఏడాది ఆక్టోబర్‌లో శిక్షణ కోసం వచ్చిన నర్సింగ్ విద్యార్థినిపై ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి లైంగికదాడికి యత్నించాడు. దీంతో ఆమె నర్సింగ్ సిబ్బంది ద్వారా ఆస్పత్రి సూపరింటెండెంట్ సీతారామరాజుకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విచారణ చేపట్టిన అధికారులు సదరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని విధుల నుంచి తప్పించారు. విధుల నుంచి తప్పించినప్పటికీ ఉద్యోగి మాత్రం తన ప్రయత్నాలు మానలేదు. అప్పట్లో కాంగ్రెస్ పెద్దలతో ప్రయత్నాలు ప్రారంభించిన ఆ ఉద్యోగి, ఇప్పుడు టీడీపీ పెద్దలతో ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. తాజాగా అధికార పార్టీకి చెందిన ఓ మహిళా ప్రజాప్రతినిధి సదరు ఉద్యోగికి రీ పోస్టింగ్ ఇవ్వమని హుకుం జారీచేసినట్టు తెలుస్తోంది. మహిళా నేత సిఫారసుకు అధికారులు కూడా తలాడించినట్లు సమాచారం. ఆరోపణలు ఉన్న ఓ వ్యక్తికి మహిళా ప్రజాప్రతినిధి అయి ఉండి పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వమనడంపై సర్వత్రా విస్తుపోతున్నారు. ఇదే విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ సీతారామరాజు వద్ద సాక్షి ప్రస్తావంచగా తనకు ఎటువంటి సిఫారసూ రాలేదని చెప్పారు.