నందలూరు, న్యూస్‌లైన్ : డెంగీ కాటుకు ఓ విద్యార్థి బలయ్యాడు. నందలూరు ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న దుర్గాపురానికి చెందిన యాకసిరి శివకుమార్(14) డెంగీ వ్యాధితో ఆదివారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత మరణించాడు. నాలుగు రోజుల కిందట జ్వరం సోకగా, కడపలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందేవాడు. అయితే ఎంతకూ జ్వరం తగ్గలేదు. దీనికి తోడు ప్లేట్‌లెట్స్ సంఖ్య బాగా తగ్గిపోవడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించాలని డాక్టర్లు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు శివకుమార్‌ను తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూసినట్లు వారు కన్నీటిపర్యంతమయ్యారు.
పెరోల్‌పై వచ్చి.. అంత్యక్రియల్లో పాల్గొన్న తండ్రి
విద్యార్థి శివకుమార్ తండ్రి మునెయ్య ఓ కేసులో కడప సబ్‌జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కొడుకు అకాల మరణ సమాచారం అందిన వెంటనే ఆయన ఆవేదనకు గురయ్యారు. తన కొడుకు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అనుమతించాలని ఆయన సబ్‌జైలు అధికారులను కోరగా.. వారు పెరోల్‌పై విడుదల చేశారు. కొడుకు మృతదేహాన్ని చూడగానే ఆయన గుండెలపై పడి రోదించారు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరి హృదయం బరువెక్కింది.
ఎమ్మెల్యే ఆకేపాటి పరామర్శ
విద్యార్థి శివకుమార్ డెంగీతో మరణించినట్లు తెలియగానే రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, ఆ పార్టీ నాయకులు సోమవారం గ్రామానికి చేరుకున్నారు. మృతదేహంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. ఎంతో భ విష్యత్తు ఉన్న విద్యార్థిని డెంగీతో అకాల మరణం చెందడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. అనంతరం అంత్యక్రియల కోసం తనవంతు నగదు సాయం అందించారు.
విద్యార్థులు, ఉపాధ్యాయుల నివాళులు
చదువులో చురుగ్గా ఉండడంతో పాటు తమతో ఎప్పుడూ చలాకీగా ఉండే శివకుమార్ అకాల మరణంతో తోటి విద్యార్థులు ఆవేదనకు గురయ్యారు. తాము మంచి తెలివైన విద్యార్థిని కోల్పోయామని ప్రధానోపాధ్యాయుడు కృష్ణయ్య, ఫిజికల్ డెరైక్టర్ కృష్ణ, ఉపాధ్యాయులు అన్నారు. అతని అకాల మృతికి సంతాపంగా రెండు నిమిషాల పాటు పాఠశాలలో ప్రార్థన సమయంలో మౌనం పాటించారు.
విద్యార్థిని కాటేసిన డెంగీ
Published Tue, Jan 7 2014 4:21 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
Advertisement
Advertisement