నిమజ్జనానికెళ్లి.. నీటమునిగి..
Published Sun, Sep 15 2013 4:23 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
ధర్మారం, న్యూస్‌లైన్ : విద్యార్థులు, ప్రిన్సిపాల్ కథనం ప్రకారం.. నంది మేడారం ఎస్సీ బాలుర గురుకుల విద్యాలయంలో ఐదు రోజుల క్రితం రెండు వినాయక ప్రతిమలు నెలకొల్పారు. శనివారం నిమజ్జనం చేసేందుకు 50 మంది విద్యార్థులు, సిబ్బంది చెరువుకు వెళ్లారు. ముందుగా మట్టి విగ్రహాన్ని చెరువులో వేసేందుకు ఉపాధ్యాయుడు జయప్రకాశ్ ఆరుగురు విద్యార్థులను వెళ్లాలని సూచించారు. కానీ ఆరుగురితోపాటు 17 మంది విద్యార్థులు చెరువులోకి దిగారు. లోపలికి వెళ్తున్న క్రమంలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఇటికాల సాయికుమార్, జీడి నవీన్, ఎన్.రాజు చెరువులో మునిగిపోయారు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇటికాల సాయికుమార్, జీడి నవీన్‌ను వాచ్‌మన్ నర్సయ్య చెరువులోంచి బయటకు తీసుకువచ్చారు. పీఈటీ ప్రథమచికిత్స చేయడంతో వారు స్పృహలోకి వచ్చారు. ఆ తర్వాత అందరూ కలిసి హాస్టల్‌కు వెళ్లారు. రాజు గల్లంతైన విషయం మరిచారు. అక్కడికి వెళ్లాక విషయం తెలిసి సిబ్బంది చెరువు దగ్గరకు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ప్రిన్సిపాల్ వేణుగోపాల్‌రెడ్డి జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ, రాత్రి ఏడు గంటల సమయంలో గజ ఈతగాళ్ల కోసం గ్రామస్తులను సంప్రదించగా బయటకు తెలిసింది. సమాచారం అందుకున్న ఎస్సై ప్రవీణ్‌కుమార్ వెం టనే సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. రా త్రి వరకు రాజు ఆచూకీ దొరకలేదు. పెద్దపల్లి ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి, తహశీల్దార్ భాస్కర్‌రావు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాజు నీటిలో గల్లంతయ్యాడా? భయంతో ఎక్కడికైనా పారిపోయాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్‌తోపాటు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు సంతోష్, మహేందర్ డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement