వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
Published Thu, Sep 19 2013 4:28 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
దర్శి, న్యూస్‌లైన్ : వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థి కాలువలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మండలంలోని బొట్లపాలెంలో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన చిన్నపురెడ్డి బ్రహ్మారెడ్డి కుమారుడు సుబ్బారెడ్డి (19) ఒంగోలు క్విస్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. స్వగ్రామంలో జరుగుతున్న వినాయక నిమజ్జన ఉత్సవంలో పాల్గొనేందుకు మంగళవారం ఇంటికి వచ్చాడు. రాత్రి గ్రామంలో వినాయక విగ్రహాన్ని ఊరేగించారు. బుధవారం ఉదయం నిమజ్జనం చేసేందుకు గ్రామానికి చెందిన యువకులు, విద్యార్థులు, మహిళలు 8 ట్రాక్టర్లలో ఎన్‌ఎస్పీ కాలువకు వెళ్లారు.
నిమజ్జనం అనంతరం స్నానాలు చేసేందుకు యువకులంతా కాలువలో దిగారు. వారిలో సుబ్బారెడ్డి నీళ్లలో మునిగిపోవడాన్ని కొందరు గమనించి బయటకు తీసే ప్రయత్నం చేశారు. అప్పటికే సుబ్బారెడ్డి ప్రాణాలు విడిచాడు. చదువులో ప్రతిభ చూపుతూ ఉన్నత విద్యకు వెళ్లడంతో తల్లిదండ్రులు బ్రహ్మారెడ్డి, వెంకటరత్నం సంతోషించారు. ఇంతలో ఏకైక కుమారుడు అకాల మరణం చెందడంతో వారి ఆవేదనకు అంతులేకుండా పోయింది. సుబ్బారెడ్డి మృతదేహంపై పడి ఇక తమకు దిక్కెవరంటూ తల్లి వెంకటరత్నం భోరున విలపించడం చూపరులను కంటితడి పెట్టించింది. నిమజ్జనోత్సవంలో ప్రమాదం చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
చండ్రపాలెంలో మరొకరు
సంతనూతలపాడు, న్యూస్‌లైన్ : వినాయక నిమజ్జనం సందర్భంగా సుడిగుండంలో చిక్కుకున్న యువకుడిని రక్షించబోయిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన చండ్రపాలెం ఎన్‌ఎస్పీ కెనాల్ వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఎనికపాడు శివాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం నిమజ్జనం చేసేందుకు యువకులంతా చండ్రపాలెం ఎన్‌ఎస్పీ కెనాల్ వద్దకు వెళ్లారు. యువకులు నీటిలో దూకి ఈదుతున్నారు. ఈ క్రమంలో గుళ్లాపల్లి కోటేశ్వరరావు (బుల్లబ్బాయి) అనే వ్యక్తి సుడి గుండంలో చిక్కుకున్నాడు. కోటేశ్వరరావును రక్షించేందుకు ఏనుగంటి రమణయ్య, బొమ్మినేని శ్రీనివాసరావు (37)లు నీటిలో దూకారు. కోటేశ్వరరావు, రమణయ్యలు సుడిగుండం నుంచి బయట పడగా రక్షించేందుకు వెళ్లిన దిగిన బొమ్మినేని శ్రీనివాసరావు మరణించాడు. నీటి నుంచి బయట పడిన ఇద్దరిని ఒంగోలు ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement