డాక్టర్ పట్టా అందేనా ! | students are not able to study in this college | Sakshi
Sakshi News home page

డాక్టర్ పట్టా అందేనా !

Published Wed, Jul 30 2014 4:36 AM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM

డాక్టర్ పట్టా అందేనా !

డాక్టర్ పట్టా అందేనా !

ఒంగోలు సెంట్రల్:   స్థానిక రిమ్స్ వైద్య కళాశాలలో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. కళాశాలకు ప్రారంభ అనుమతులు మొదలైన నాటి నుంచి ఎన్నో రకాల ఆటంకాలతో విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపలేకపోతున్నారు. ముఖ్యంగా రిమ్స్ నిర్మాణాల వ్యవహారం వారి భవితకు గుదిబండగా మారింది. ప్రస్తుతం రిమ్స్ వైద్య విద్యార్థులు నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టారు.
 
చివరి ఏడాది అనుమతులపై నీలిమేఘాలు అలముకున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కోర్సు కాలం పూర్తి కావడానికి ఎలాగో ఎంసీఐ అనుమతులు సాధించారు. అయితే ఆ సంస్థ కొన్ని ప్రామాణికాలను కచ్చితంగా అమలు చేయాలని చెప్పింది. దానిలో భాగంగా  రిమ్స్‌లో ఆడిటోరియం, క్యాంటీన్, సిబ్బంది క్వార్టర్లు, నర్సింగ్ సూపరింటెండెంట్ కార్యాలయం, 250 మంది విద్యార్థులకు లెక్చర్ హాల్, ఎంబీబీఎస్ విద్యార్థుల వసతి గృహాల్లో అదనపు గదులు, నర్సింగ్ వసతి గృహంలో అదనపు గదులు పూర్తి చేయాలని నిర్దేశించింది.
 
మళ్లీ ఎంసీఐ బృందం వచ్చే మార్చిలో తనిఖీలు చేయనుంది. ఈలోపు ఈ వసతులు పూర్తికాకపోతే విద్యార్థుల డిగ్రీలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నమోదు చేసుకోదు. దీంతో రిమ్స్‌లో చదివిన ఎంబీబీఎస్ విద్యార్థులు తీవ్రం గా నష్టపోతారు. ఇన్ని అనర్ధాలున్నా..రిమ్స్ నిర్మాణాలను వేగవంతం చేసేం దుకు ఏ ఒక్కరూ శ్రద్ధ చూపడం లేదు.  
 
చేయాల్సిన పనులివీ...
సిబ్బంది క్వార్టర్లు మినహా దాదాపు అన్ని పనులు పునాది దశలోనే ఉన్నాయి. అదనపు వార్డుల కోసం మూడో ఫ్లోర్ నిర్మాణాలను ఇంత వరకు మొదలు పెట్టలేదు. ఈ ఫ్లోర్‌లో గతంలో నిర్మించిన తాగునీటి ట్యాంకులనే ప్రస్తుతానికి తీసివేసే పనిలో ఉన్నారు. దాదాపు 750 మంది పట్టేందుకు వీలుగా నిర్మించాల్సిన ఆడిటోరియం పనులు నత్తనడకన సాగుతున్నాయి.  క్యాంటిన్ ఏర్పాటు చేయాలని దాదాపు 8 నెలల క్రితం జరిగిన హెచ్‌డీఎస్ సమావేశంలో కలెక్టర్, రిమ్స్ అధికారులు తీర్మానించారు.
 
బిల్డ్ అండ్ ఆపరేట్ పద్ధతిపై క్యాంటీన్ నిర్మాణాన్ని వేగవంతం చేయవచ్చని సూచించారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. మార్చి నెలాఖరు వరకు మంజూరైన బడ్జెట్‌తోనే పనులు నత్తనడకన సాగుతున్నాయి. మార్చి అనంతరం ప్రభుత్వం రిమ్స్‌కు బడ్జెట్ కేటాయించలేదు. దీంతో నిధులు అందుబాటులో లేకపోవడం కూడా రిమ్స్ నిర్మాణాలు వేగవంతంగా సాగకపోవడానికి కారణం.  
 
నేడు రిమ్స్‌కు రానున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి:
రాష్ర్ట వైద్యారోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాస్ నేడు రిమ్స్‌ను సందర్శించనున్నారు. రిమ్స్ నిర్మాణాలను, వసతులు, సదుపాయాలను పరిశీలించి దాని ప్రకారం నిధులు మంజూరు చేయనున్నట్లు సమాచారం.
 
అభ్యంతరాలను పరిష్కరిస్తాం..డాక్టర్ అంజయ్య రిమ్స్ డైరక్టర్
ఎంసీఐ లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు రిమ్స్ డైరక్టర్ డాక్టర్ అంజయ్య తెలి పారు. నిర్మాణాలను వేగవంతం చేసేం దుకు ఏపీహెచ్‌ఎండీసీ ఇంజినీరింగ్ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
 
రిమ్స్ ఉద్యోగులకు వేతనాల్లేవ్
రిమ్స్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, సెమీ అటానమస్, అవుట్ సోర్సింగ్, ఒప్పంద ఉద్యోగులు  వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. గత ఏప్రిల్ నుంచి రిమ్స్ ఉద్యోగులకు వేతనాల్లేవు. ఇదేమని అడిగితే ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదని అంటున్నారు. మూడు నెలలకు సంబంధించి రూ.2 కోట్ల వరకు నిధులు రావాల్సి ఉంది.
 
రిమ్స్ ఆస్పత్రి, వైద్య కళాశాలలో సుమారు 275 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరికీ నెలనెలా సుమా రు రూ.65 లక్షలకుపైగా వేతనాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. నిధు లు లేకపోవడం ఒక కారణమైతే..కొన్ని విభాగాల్లో ఉద్యోగులు సకాలంలో బిల్లులు చేయరు. చేసినా..వాటిలో అనేక తప్పులుంటాయి. దీంతో గజిటెడ్ హోదా ఉద్యోగులు తప్పిస్తే ఇతర విభాగాల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
ఎనిమిది నెలల నుంచి ట్రామాకేర్ సిబ్బందికి జీతాల్లేవ్:
రిమ్స్ ట్రామాకేర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న దాదాపు 30 మంది సిబ్బందికి 8 నెలలుగా జీతాలివ్వడం లేదు. దీంతో ఈ విభాగంలో పనిచేస్తున్న వారంతా ఆందోళనబాట పట్టా రు. 28 రోజులుగా కలెక్టరేట్ వద్ద జీతాలివ్వాలని రిలే నిరాహార దీక్షలు చేస్తు న్నా.. ఏ అధికారిగానీ, ప్రజాప్రతినిధిగానీ పట్టించుకున్న పాపానపోలేదు.
 
సిబ్బంది ఇచ్చిన వినతిపత్రాలు తీసుకుని కేవలం కంటితుడుపు చర్యగా వేతనాలు అందుతాయని చెబుతున్నారే తప్ప సమస్య పరిష్కారం కాలేదు. అత్యవసర విభాగంలో సిబ్బందితో వెట్టిచాకిరీ చేయించుకుని జీతాల విషయంలో ప్రభుత్వం జాలి తలచడం లేదని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement