బాన్సువాడ రూరల్, న్యూస్‌లైన్ : ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది గ్రామీణ ప్రాంత విద్యార్థులే తప్ప కార్పొరేట్ కళాశాల విద్యార్థులు కాదని ప్రముఖ కవి, రచయిత దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం బాన్సువాడ మండలంలోని ఎస్‌ఆర్‌ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళననానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంతో ప్రవర్తించడం వల్ల కార్పొరేట్ కళాశాలు పెరిగిపోయి విద్య వ్యాపారంగా మారిపోయిందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఉన్నత విద్య అందించడానికి శ్రీసేఠ్‌రాం నారాయణ ఖేడియా ఎంతో కృషిచేశారని, ఆ రోజుల్లో ఆయన స్థలం దానం చేయడం వల్లే ఈ విద్యాలయం ఏర్పాటై ఎంతోమంది ఉన్నత చదువులు చదివి ఉన్నతస్థానాల్లో స్థిరపడ్డారని కొనియాడారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచారన్నారు. దేశ భవిష్యత్తును మార్చగలిగే శక్తి సామర్థ్యా లు, చైతన్యం గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లోనే ఎక్కువ గా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఖాయమన్నారు.
మనం అమెరికా వైపు చూడకుండా అమెరికానే మనవైపు చూసేలా ప్రతి ఒక్కరు ఉన్నత విద్యాభ్యాసం చేసి ఆదర్శంగా నిలవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేజీనుంచి పీజీ వరకు ఉచితవిద్య అం దిస్తామని కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తాను స్థాపించిన కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ప్రయోజకులు కావడం సం తోషంగా ఉందన్నారు. తన తండ్రి స్థలం దానం చేయడంతో ఏర్పాటైన ఈ విద్యాలయంలో వేలాది మంది విద్యార్థులు పట్టభద్రులై ఉన్నతస్థానాల్లో స్థిరపడడం గర్వంగా ఉందని కళాశాల స్థలదాత శ్రీసేఠ్‌రాం నారాయణ ఖేడియా కుమారుడు శ్రీసేఠ్ రతన్‌లాల్ ఖేడి యా అన్నారు. తాము కళాశాలను ఎప్పటికీ మర్చిపోమని, తన తండ్రిగారి విగ్రహం కళాశాలలో నెలకొల్ప టం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.కళాశాల అభివృద్ధికి సహకరిస్తానన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఒకరికొకరు పలకరించుకొని జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
తెలంగాణ ఉద్యమంలో గ్రామీణ విద్యార్థులదే కీలకపాత్ర
Published Mon, Dec 30 2013 7:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
Advertisement
Advertisement