
సాక్షి, అమరావతి: కొత్త రాష్ట్రం కాబట్టి కంపెనీలకు రాయితీలు ఇవ్వడం సహజం. వాటిని రప్పించే కన్సల్టెన్సీకి కూడా ఫీజులు చెల్లించటం మామూలే. కానీ ఏ కంపెనీలు వస్తాయో తెలియదు... ఎప్పుడొస్తాయో అంతకన్నా తెలియదు. అయినా సరే వచ్చేస్తున్నాయంటే ముందే రాయితీలు ఇస్తారా? కార్యాలయాల కోసం రూ. కోట్లలో అద్దెలు చెల్లిస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడదే చేస్తోంది. గ్లోబల్ ఇన్‌హౌస్ (ఏపీజీఐసీ) పాలసీ కింద బెంగళూరుకు చెందిన ఏఎన్‌ఎస్‌ఆర్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రూ. కోట్లలో ప్రయోజనం చేకూరుస్తూ గురువారం జీవో జారీ చేసింది.
వివిధ దేశాలకు చెందిన ఐటీ కంపెనీలను ఏపీకి రప్పించి వందల మందికి ఉపాధి కల్పిస్తామని ఈ కన్సల్టెన్సీ పేర్కొంది. ఉద్యోగులను తామే నియమిం చుకుని, ఏవైనా కంపెనీలు వచ్చాక ఆ ఉద్యోగులను వారికి బదలాయిస్తామంది. అప్పటివరకూ వారు కన్సల్టెన్సీ ఆధ్వర్యంలోనే పనిచేస్తారు. ఈ సంస్థలో 200 మంది ఉద్యోగులు పనిచేయడానికి వీలుగా విశాఖలో అవసరమైన భవనాన్ని ప్రభుత్వమే అద్దె చెల్లించి సమకూరుస్తుంది.
ఏడాదిన్నర అద్దె ప్రభుత్వమే చెల్లిస్తుంది
ఎప్పుడో వచ్చే ఐటీ కంపెనీల కోసం ప్రైవేట్ వ్యక్తులు భవనాలు నిర్మిస్తారు. కంపెనీలు వచ్చే వరకూ వాటికి ప్రభుత్వమే అద్దె చెల్లిస్తుంది. దీనికోసం డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ (డీటీపీ) అనే మరో పాలసీని ప్రవేశపెట్టారు. ఏఎన్‌ఎస్‌ఆర్ కన్సల్టెన్సీ ఆఫీస్‌కు అడుగు రూ. 80 చొప్పున 15,000 అడుగులకు అద్దె చెల్లిస్తారు. ఇలా ఊరూ పేరు లేని కంపెనీల కోసం నెలకు రూ.12 లక్షల చొప్పున 18 నెలల పాటు రూ. 2.16 కోట్లు అద్దెగా కన్సల్టెన్సీకి చెల్లించనున్నారు.
అంతేకాదు వెయ్యి మంది ఉద్యోగుల కోసం అద్దెకోసం మరో రూ. 11 కోట్ల వరకూ అవుతుంది. అంతా కలిపి ఏడాదిన్నరలో రూ. 13 కోట్లకుపైగా కన్సల్టెన్సీకి చెల్లించనున్నారు. ఒకవేళ ఐటీ కంపెనీలను రప్పించటంలో కన్సల్టెన్సీ విఫలమైతే 18 నెలల తర్వాత ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. అసలు ఐటీ కంపెనీలు వచ్చేవరకు వీరికి ఎలాంటి విధులు కేటాయిస్తారు? వేతనాలు ఎలా చెల్లిస్తారు? అనే అంశాలపై భరోసా ఇవ్వటం లేదు.
Comments
Please login to add a commentAdd a comment