నెల్లూరు (సెంట్రల్) : ప్రభుత్వ పాలనలో తెలుగు తమ్ముళ్ల జోక్యం మితిమీరుతోంది. ప్రతి పథకంలో లబ్ధి తమకే కలగాలని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. ప్రభుత్వ పెద్దలు, అధికారుల సహకారం కూడా తోడవడంతో పథకాల లబ్ధిదారుల కమిటీల్లో టీడీపీ నేతలే సభ్యులవుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వారిని వారు లబ్ధిదారులకు ఎంపిక చేస్తుండటంతో అర్హులకు అన్యాయం జరుగుతోంది.
ఇప్పటికే పలు పథకాలకు సంబంధించి ఇలాగే జరగ్గా ప్రస్తుతం సబ్సిడీ రుణాల వంతు వచ్చింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్, ఐటీడీఏ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీపై రుణాలు పంపిణీ చేస్తోంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2,717 మందికి రూ.37.12 కోట్లు, 2,200 మంది ఎస్టీలకు రూ.16 కోట్లు రుణాలు మంజూరు కానున్నాయి. వీటి మంజూరుకు సంబంధించి గత నెల 30వ తేదీ వరకు దరకాస్తులు స్వీకరించారు. ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించిన రుణాలకు సుమారు 10 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఎస్టీలకు సంబంధించి అదే స్థాయిలో దరఖాస్తులు దాఖలయ్యాయి. గడువు ముగిసిన తర్వాత వచ్చిన మరో 800 దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. మరోవైపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సన్నాహాలు జరుగుతున్నాయి. అసలు కథ ఇక్కడే మొదలవుతోంది. లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన కమిటీల్లో సభ్యులుగా టీడీపీ నేతలే ఉన్నారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులకే రుణాలు మంజూరు చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన పలువురు ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు కూడా నకిలీ కులధ్రువీకరణ పత్రాలు సమర్పించి సబ్సిడీ రుణాలు పొందే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది.
విచారణ లేకుండానే..
లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ప్రతి మండలంలో ముగ్గురు సభ్యులతో కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో ఏ పార్టీకి సంబంధం లేని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులైన వారు సభ్యులుగా ఉంటారు. వారు అధికారులతో కలిసి దరఖాస్తు చేసుకున్న వారిని ఇంటర్వ్యూ చేసి రుణాలు మంజూరు చేస్తారు.
అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక కమిటీల స్వరూపం మార్చేశారు. టీడీపీ నేతలను అందులో సభ్యులుగా చేర్చారు. ఇప్పుడు వారు సిఫార్సు చేసిన వారికే రుణాలు మంజూరు చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. కొందరు నాయకులు కూడా బినామీ పేర్లతో నిధులను స్వాహా చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా నిబంధనల ప్రకారం రుణాలు మంజూరు చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
అధికార పార్టీ వాళ్లు చెప్పినోళ్లకేనంట: శివ , నెల్లూరు
రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్నాం. అధికార పార్టీ వాళ్లు చెప్పిన వారికే రుణాలు మంజూరు చేస్తారని కొందరు చెబుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని రుణాల కోసం దరఖాస్తులు చేసుకుంటే లోను వస్తుందో రాదో అర్ధం కావడంలేదు. అధికారులు న్యాయం చేయాలి.
రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంది:
సాగర్, నెల్లూరు
ఈ రుణాల కోసం ఎంతో ఆశగా దరఖాస్తు చేసుకుంటే వీటిలో అధికార పార్టీ వారి జోక్యం ఎక్కువగా ఉంది. దీని వలన అర్హులైన వారికి అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ జోక్యం లేకుండా రుణాలు మంజూరు చేయాలి.
మంత్రి ఆదేశాల ప్రకారమే కమిటీ:
వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జి ఈడీ, ఎస్సీ కార్పొరేషన్
మంత్రి ఆదేశాల ప్రకారం గత నెల 11వ తేదీనే కమిటీల సభ్యుల పేర్లు ఖరారయ్యాయి. వాటికి అనుగుణంగానే కమిటీలో ఉన్న వారు పనిచేస్తారు.
సబ్సిడీ రుణాలపై తమ్ముళ్ల కన్ను
Published Sat, Dec 6 2014 2:07 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement