గుంటూరు: ప్రజాసమస్యల పరిష్కారంలో వైఫల్యం చెందిన టీడీపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జూన్ 3, 4 తేదీలలో మంగళగిరిలో తలపెట్టిన సమరదీక్షను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు పలు హామీలిచ్చి..తీరా అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో వెనుకంజ వేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని పేరుతో భూములు లాక్కొని రైతులను భయపెడుతున్నారని విమర్శించారు.
టీడీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిస్థాయిలో విస్మరించిందన్నారు. అన్ని వర్గాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి ప్రజల పక్షాన నిలబడేందుకే జగన్‌మోహన్‌రెడ్డి సమరదీక్షను చేపట్టినట్లు వెల్లడించారు.