మార్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
రాజకీయ ఒత్తిళ్లకు అనుకూలంగా విద్యాశాఖ పనిచేస్తోందా అన్న సందేహం తలెత్తుతోంది. ఓ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీల విషయంపై అధికారపార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తెరవెనుక పావులు కదుపుతుండమే దీనికి కారణం. వేసవి సెలవుల్లో జరగాల్సిన సాధారణ బదిలీలు పాఠశాలలు ప్రారంభమయ్యాక జరగడమే వివాదానికి అసలు కారణం. ఉపాధ్యాయులను బదిలీ చేయాలంటూ ఒకరు, ఇప్పుడు బదిలీ చేస్తే మా ప్రాంత పాఠశాలల అభివృద్ధి కుంటుపడుతుందని మిగతా ఇద్దరు శాసనసభ్యులు అంటున్నట్లు సమాచారం. ఎవరి ప్రాంత అభివృద్ధిని వారు కాంక్షిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, అసలు కారణం ఏమై ఉంటుందా అని, అధికార పార్టీలో ఈ పట్టు విడుపులు ఎటుదారితీస్తాయో.. అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఉన్నతాధికారి ఆదేశాలు అమలు చేయకుండా ఉండలేక.. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు బేఖాతరు చేయలేక మధ్యలో హెచ్‌ఎంలు నలిగిపోతున్నారు.
మార్టూరు: చీరాల పట్టణం వేటపాలెం మండల పరిధిలోని కొత్తపేట ఐఎల్‌టీడీ కాలనీ సమీపంలో ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా మోడల్ పాఠశాలను ప్రారంభించింది. స్థాయికి మించి అర్జీలు వచ్చినప్పటికీ 1200 మందికి పైగా విద్యార్థుల ప్రవేశాలు మెదటి సంవత్సరమే పూర్తయ్యాయి. సాక్షాత్తూ చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తన కుమారుడిని సైతం ఇక్కడ చేర్పించటంతో ఈ పాఠశాల వార్తల్లో నిలిచింది. గతవారం చీరాలలో పర్యటించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేతుల మీదగా అధికారికంగా ఈ స్కూల్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో పాఠశాలను ప్రారంభించకుండానే మంత్రి లోకేష్ వెనుతిరిగిన సంఘటన తెలిసిందే.
ఈ పాఠశాలకు అవసరమైన ప్రభుత్వ ఉపాధ్యాయులు సాధారణంగా బదిలీపై రావాల్సి ఉండగా ఈ వేసవిలో ప్రభుత్వం సాధారణ బదిలీలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు పాఠశాలల్లో పనిచేస్తున్న, చీరాల పరిసర ప్రాంతాలకు చెందిన ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై చీరాల మోడల్‌స్కూల్‌కు వెళ్లవల్సిందిగా డీఈఓ కార్యాలయం నుంచి అనధికార ఉత్తర్వులు వెలువడినట్లు తెలిసింది. సహజంగానే తమ ప్రాంతమైన చీరాల వైపు వెళ్లటానికి ఆసక్తి చూపుతున్న ఉపాధ్యాయులు డిప్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవటం వారిని రిలీవ్ చేయమని సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈఓ కార్యాలయం నుంచి అధికార ఉత్తర్వులు జారీ కావటం వెంటవెంటనే జరిగిపోయాయి.
ఇక్కడ నుంచే అసలు కథ ప్రారంభం..
తమకు ఏలాంటి సమాచారం లేకుండా తమ నియోజకవర్గంలోని పాఠశాలల నుంచి డిప్యూటేషన్‌పై ఉపాధ్యాయులను పంపించటానికి పర్చూరు, అద్దంకి నియోజకవర్గ శాసనసభ్యులు అంగికరించడం లేదనేది విశ్వసనీయ సమాచారం. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో పాటు, పర్చూరు, అద్దంకి ఎమ్మెల్యేలు కూడా అధికారపార్టీకి చెందిన వారే. ఆధిపత్య పోరో లేక మరొకటో తెలియదు కానీ తమకు తెలిమకుండా తమ నియోజవర్గ ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై పంపవద్దని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. డిప్యూటేషన్ బదిలీల కోసం పర్చూరు నియోజవర్గంలోని మార్టూరు, పర్చూరు, ఇంకొల్లు మండలాల నుంచి అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ, సంతమాగులూరు మండలాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుంచి దరఖాస్తులు రాగా వారిని రిలీవ్ చేయాల్సిందిగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈఓ సుబ్బారావు ఆదేశాలు జారీ చేశారు.
మార్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు డిప్యూటేషన్ కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఒకరు విరమించుకున్నట్లు సమాచారం. మరొక ఉపాధ్యాయురాలిని ప్రధానోపాధ్యాయుడు దుడ్డు డేవిడ్ రిలీవ్ చేయకపోవటం గమనార్హం. ఇది ఇలా ఉండగా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్‌తో వచ్చే ఎన్నికల్లో చీరాలతో పాటు పర్చూరు, సంతనూతలపాడు నియోజవర్గాల్లో కూడా పార్టీ గెలుపుకోసం కృషి చేయవల్సిందిగా సూచించిన నేపథ్యంలో బదిలీలు ఆగి ఉండవచ్చనే కోణంలో రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా ప్రధానోపాధ్యాయులు డీఈఓ ఉత్తర్వులను బేఖాతరు చేసే పరిస్థితి ఉండదు. కానీ ఇప్పుడు మాత్రం డీఈఓ ఆదేశాలను ఉల్లంఘీస్తూ రిలీవ్ చేయకుండా ఉండటాన్ని చూస్తే ఖచ్చితంగా రాజకీయ ఒత్తిళ్లే అని ఉపాధ్యాయ వర్గాలు భావిస్తున్నాయి. బదిలీ కోసం వచ్చిన అర్జీల్లో ఒకరిని అక్కడి ప్రధానోపాధ్యాయురాలు రిలీవ్ చేయగా మిగతా వాటిపై ఏం చేయాలో తెలియక హెచ్‌ఎంలు సతమతమవుతున్నారు.
డీఈఓ ఉత్తర్వులు వచ్చిన మాట నిజమే..
పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయురాలిని డిప్యూటేషన్‌పై చీరాల పంపవల్సిందిగా డీఈఓ ఉత్తర్వులు వచ్చిన మాట నిజమే. ఈ సంవత్సరం సాధారణ బదిలీలు లేనందున రిలీవ్ అయిన వారి స్థానంలో మరొకరు వచ్చే అవకాశం లేదు. మధ్యంతర బదిలీలతో పాఠశాల అభివృద్ధి కుంటు పడుతుందని ఆ ఉపాధ్యాయురాలిని రిలీవ్ చేయలేదు. దీంట్లో రాజకీయ ఒత్తిళ్లు లేవు.దుడ్డు డేవిడ్, ప్రధానోపాధ్యాయుడు
డీఈఓ ఆదేశాల మేరకు రిలీవ్ చేశా..
పాఠశాల సైన్సు ఉపాధ్యాయురాలిని డిప్యూటేషన్‌పై పంపవలసిందిగా డీఈఓ ఉత్తర్వులు అందాయి. ఈ నేపథ్యంలో సోమవారం రిలీవ్ చేశాను. రాజకీయ వత్తిళ్ళు ఏమీ లేవు.
ఎమ్ నిర్మల,వలపర్ల ప్రధానోపాధ్యాయురాలు
Comments
Please login to add a commentAdd a comment