అప్పుల బాధతోనే సుధాకర్ ఆత్మహత్య | Sudhakar suicide debt pain | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతోనే సుధాకర్ ఆత్మహత్య

Published Fri, Sep 5 2014 1:20 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

Sudhakar suicide debt pain

నిర్ధారించిన తహశీల్దార్
 గుంతకల్లు టౌన్ :  ‘మండలంలోని వైటీ చెరువు గ్రామానికి చెందిన కె.సుధాకర్ వ్యవసాయంపైనే ఆధారపడి జీవించేవాడు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ అతని పేరుపై పట్టాదారు పాసుపుస్తకం లేదు. రూ.2.50 లక్షల అప్పులు ఉన్నట్లు మా విచారణలో తేలింది.
 
  ఈ వివరాలను కలెక్టర్‌కు ఫ్యాక్స్ ద్వారా నివేదించాం. రైతు కుటుంబానికి జిల్లా అధికారులు న్యాయం చేస్తార’ని గుంతకల్లు తహశీల్దార్ వసంతబాబు తెలిపారు. ‘సాయం పొందే అర్హత ఈ తల్లికి లేదా?’ అన్న శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా రెవెన్యూ అధికారులు స్పందించారు. కలెక్టర్, డీఆర్‌ఓ ఆదేశాల మేరకు గురువారం ఉదయాన్నే మండల తహశీల్దార్ వసంతబాబు, వీఆర్‌ఓలు వైటీ చెరువు గ్రామానికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సుధాకర్ ఆత్మహత్యకు గల కారణాలను భార్య రామాంజినమ్మను అడిగి తెలుసుకున్నారు.
 
 ఉమ్మడి కుటుంబం కావడంతో ఆస్తి పంపకాల్లో తన భర్త పేరిట ఒకటిన్నర ఎకరా పొలం వచ్చిందని, కానీ పట్టాదారు పాసుపుస్తకం చేయించుకోలేదని ఆమె వివరించింది. ఎనిమిది బోర్లు వేయించినా చుక్క నీరు పడలేదని, చేసిన అప్పులకు వడ్డీ కట్టలేక, పంటలు చేతికి రాక మనస్తాపానికి గురై పొలంలోనే పురుగు మందు తాగి మృతి చెందాడని తెలిపింది. తనకు ముగ్గురు కూతుళ్లు రమాదేవి, అంజలి, రూపా ఉన్నారని.. ప్రభుత్వం ఆదుకోకపోతే వీరి పోషణ భారమవుతుందని కన్నీరుమున్నీరైంది. ధైర్యంగా ఉండి పిల్లల్ని బాగా చదివించాలని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తహశీల్దార్ భ రోసా ఇచ్చారు. కనీసం రేషన్ కార్డు కూడా లేని ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవాలని మాజీ ఎంపీటీసీ బాలాంజనేయులు తహశీల్దార్‌ను కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement