అమ్మను కాలేనని..
మనోవేదనతో వివాహిత ఆత్మహత్య
ఐదేళ్లుగా మొక్కని దేవుడు.. చేయని పూజలు లేవు.. బిడ్డల కోసం పరితపించింది. ఏడాది క్రితం గర్భం నిలిస్తే.. పొంగిపోయింది. కానీ ఐదునెలలకే అబార్షన్ కావడంతో కుంగిపోయింది. అప్పటి నుంచి తాను తల్లిని కాలేనని, గొడ్రాలుగానే ఉండిపోవాల్సి వస్తుందని తరచూ బాధపడేది. ఈ క్రమంలో.. జీవితంపై విరక్తి చెంది బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
చౌడేపల్లె: పిల్లలు పుట్టలేదని కలత చెంది వివాహిత బావిలోదూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చౌడేపల్లె మండలంలోని పుదిపట్ల పంచాయతీ మిట్టూరు గ్రామంలో సోమవారం వెలుగులోకివచ్చింది. మృతురా లి తండ్రి సుబ్రమణ్యం కథనం మేరకు గంగవరం మండలం పాతూరు గ్రామానికి చెందిన బి.సుబ్రమణ్యం కుమార్తె ఎం. సుమతి(30)ని చౌడేపల్లె మండలం మిట్టూరుకు చెందిన పాపన్న కుమారుడు లోకేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. వివాహమై ఐదేళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో సుమతి తీవ్రమనోవేదనకు గురైంది. ఈక్రమంలో ఏడాది క్రితం ఐదు నెల లు గర్భం నిలిచి ఆ తర్వాత అబార్షన్ అయ్యింది. గర్భసంచి చిన్నది కావడం వల్ల పిల్లలు పుట్టడం కష్టమని.. మందులు వాడమని డాక్టర్లు సలహా ఇచ్చారు. అయితే తనకు ఇకపై తనకు గర్భంరాదనే మనో వేదనతో తరచూ చనిపోతానని చెబుతుండేదని తండ్రి సుబ్రమణ్యం తెలిపారు.
ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద సుమతి కనిపించకుండా పోవడంతో చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయిందన్నారు. సోమవా రం గ్రామానికి సమీపంలో ఉన్న బావిలో సుమతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ మేరకు సమాచారం అందుకొన్న ఎస్‌ఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు కారణాలను తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతిరాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.