వీలైనంత ఎక్కువసార్లు నీరు తాగండి | Summer Heat Rises From Tomorrow in Telugu States | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి మూడు రోజులు వడగాడ్పులు

Published Thu, May 21 2020 9:39 AM | Last Updated on Thu, May 21 2020 2:35 PM

Summer Heat Rises From Tomorrow in Telugu States - Sakshi

సాక్షి, అమరావతి: రోహిణి కార్తెకు ఎండలు మండనున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ  (ఐఎండీ) బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. వడగాడ్పుల ముప్పు పొంచి ఉందని తెలిపింది. రాయలసీమతోపాటు కోస్తాంధ్రలోనూ ఎండలు భగ్గుమంటాయని చ్చరించింది. ఈ ఏడాది ఐఎండీ ఇలాంటి వడగాడ్పు హెచ్చరికలు జారీ చేయడం ఇదే ప్రథమం. (నేపాల్‌ది ఏకపక్ష చర్య.. అంగీకరించం: భారత్‌)

రెంటచింతల @47.2
రెంటచింతల (మాచర్ల): గుంటూరు జిల్లాలోని రెంటచింతల నిప్పుల కొలిమిని తలపిస్తూ ‘మంట’చింతలగా మారింది. ఇక్కడ మూడు రోజులుగా 45 నుంచి 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత ఏకంగా 47.2 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 30.8 డిగ్రీలుగా నమోదైంది. గతంలో ఇక్కడ అత్యధికంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన రికార్డు ఉంది. బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల 42–43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండీ అమరావతి డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు. గుంటూరు జిల్లా జంగమేశ్వరపురంలో 44, విజయవాడలో 43.5, మచిలీపట్నంలో 43.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పారు.

రోళ్లు పగిలే ఎండలు
ఈనెల 25వ తేదీ ఉదయం రోహిణి కార్తె ప్రవేశించనుంది. దీనికి ముందస్తు సంకేతంగా ఈనెల 22 నుంచి ఎండలు భగ్గుమనడంతోపాటు వడగాడ్పులు కూడా వీస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 
ఐఎండీ కూడా ఇవే హెచ్చరికలు జారీ చేసింది. శుక్ర, శని, ఆది వారాల్లో యానాంతోపాటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 
అక్కడక్కడా వడగాడ్పులు కూడా వీచే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ పేర్కొంది.

వైద్యుల సూచనలివీ..
రోహిణి కార్తె సమీపించినందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.  
వృద్ధులు, పిల్లలు మరింత అప్రమత్తంగా ఉండాలి. వేడివల్ల డీహైడ్రేషన్‌ బారినపడే ప్రమాదం ఎక్కువ.  
నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీరు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి.
వేడి నుంచి కొంత ఉపశమనం కోసం లేత రంగులో ఉండే వదులైన దుస్తులు ధరించాలి.
ఎండ వేళ వీలైనంత వరకూ బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తల, మొహంపై నేరుగా సూర్య కిరణాలు పడకుండా టోపీ లేదా తలపాగా ధరించాలి. లేదంటే గొడుగు వాడాలి.
శరీరంలో నీరు, లవణాలు చెమట వేడివల్ల ఎక్కువగా బయటకు వెళ్లే అవకాశం ఉన్నందున ఉప్పు కలిపిన మజ్జిగ ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది.
వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు గది వాతావరణం కొంత చల్లగా ఉండేలా కిటికీలకు వట్టివేళ్లు లాంటివి కట్టి.. నీరు చల్లడం లాంటి ఏర్పాట్లు చేసుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement