‘మృత్యు’తాపం | Sunstroke deaths | Sakshi
Sakshi News home page

‘మృత్యు’తాపం

Published Mon, May 25 2015 2:30 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM

Sunstroke deaths

నిప్పులు కక్కుతున్న ప్రచండ భానుడు
వడదెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం
మరో 17 మంది మృతి
మృతుల్లో ఎనిమిదేళ్ల బాలుడు

 
 జిల్లాలో సూర్య‘ప్రతాపం’ కొనసాగుతోంది. ప్రచండ భానుడు నిప్పులు కక్కుతుండడంతో జనం విలవిలలాడుతున్నారు. వడదెబ్బతో పిట్టల్లా రాలుతున్నారు. శని, ఆదివారాల్లో మరో 17 మంది చనిపోయారు. గాండ్లపెంట మండలంలో ఇద్దరు, గుత్తిలో ముగ్గురు, ధర్మవరం మండలంలో ఇద్దరు, గుంతకల్లు, అమడగూరు, ముదిగుబ్బ, యాడికి, ఉరవకొండ, హిందూపురం, కొత్తచెరువు, చిలమత్తూరు, రాయదుర్గం, రాప్తాడు మండలాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు.     -సాక్షి నెట్‌వర్క్
 
 గాండ్లపెంట మండలం బనాన్‌చెరువుపల్లికి చెందిన ముద్దిరెడ్డి కళావతమ్మ(47) శనివారం తన అన్న శివారెడ్డి పొలంలో పని చేసి సాయంత్రం ఇంటికొచ్చి సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే కదిరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ చనిపోయింది. ఇదే మండలం కటారుపల్లికి చెందిన మహమ్మద్ఫ్రీ(36) రెండు నెలల క్రితం విజయవాడకు వెళ్లాడు. అక్కడే రేషం దారం తీస్తూ జీవనం సాగించేవాడు.  శనివారం పనిలో ఉండగానే వడదెబ్బకు గురయ్యాడు. తోటి కార్మికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు.

  గుత్తి పట్టణంలోని దాసర కాలనీలో నివాసముంటున్న ఆర్‌బీ సుంకమ్మ(55) ఆదివారం కట్టెలు కొట్టడానికి కాలనీ పక్కనే ఉన్న తన పొలంలోకి వెళ్లింది. ఎండ తీవ్రత వల్ల స్పృహ తప్పి పడిపోయింది. అక్కడున్న వారు గమనించి  ఇంటికి తీసుకొచ్చారు. ఆస్పత్రికి తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగానే ఆమె మృతి చెందింది. ఇదే పట్టణంలోని కమాటం వీధిలో  నివాసముండే  అబూ సలేహ(40) ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా రిక్షా తోలాడు. ఈ క్రమంలో ఎండకు తాళలేక స్పృహ తప్పి పడిపోయాడు. 

ఆస్పత్రికి తరలించడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగానే మృతి చెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.  గుత్తి పట్టణంలోని సీపీఐ కాలనీకి చెందిన నక్కా వెంకటరమణ(56) పగలంతా ఎండలో తిరిగాడు. మధ్యాహ్నం అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు.  ఇంటికి తీసుకొచ్చాక రాత్రి ఎనిమిది గంటల సమయంలో మృతి చెందాడు.  

  గుంతకల్లు పట్టణంలోని బెంచికొట్టాలకు చెందిన ట్యాంకర్ డ్రైవర్ మహబూబ్‌బాషా, హసీనాల పెద్దకుమారుడు షెక్షావలి (8) స్థానిక శ్రీచైతన్య స్కూల్‌లో రెండవ తరగతి పూర్తిచేశాడు. వేసవి సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి శనివారం సాయంత్రం వరకు ఆడుకున్నాడు. సాయంత్రం ఉన్నట్టుండి స్పృహ కోల్పోయాడు. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. అక్కడి నుంచి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వడదెబ్బతో బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

  ఉరవకొండ మండలం రేణువూకులపల్లికి చెందిన తలారి వన్నూరప్ప (70) శనివారం సొంత పనిపై ఉరవకొండకు వెళ్లాడు. ఉదయుం నుంచి సాయుంత్రం వరకు ఎండలో తిరిగిరాత్రి ఇంటికొచ్చాడు. తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పాడు. ఆదివారం ఉదయం ఆస్పత్రికి తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయి.. ప్రాణాలొదిలాడు.

  మండల కేంద్రం యాడికిలోని ఆంజనేయస్వామి కాలనీకి చెందిన రామలక్ష్మమ్మ(38) శనివారం కట్టెల కోసం ఎండలో తిరిగింది. ఇంటికొచ్చి ఎక్కువ నీరసంగా ఉందని చెప్పింది. కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఒక ఆర్‌ఎంపీ డాక్టర్‌తో చికిత్స చేయించారు. అయినా ఆదివారం తెల్లవారుజామున ఆమె చనిపోయింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

  మండల కేంద్రం కొత్తచెరువులోని కెంపుల వీధికి చెందిన పండ్ల  వ్యాపారి రాజారాం(54)  చెన్నేకొత్తపల్లి మండలం ఓబుళంపల్లి సమీపంలో కర్భూజా తోటను తీసుకున్నాడు. ఆదివారం కాయలను  కోసి తరలిస్తుండగా ఎండ వేడిమికి స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే చికిత్స నిమిత్తం  కొత్తచెరువుకు తీసుకువస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు.

  రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి పంచాయతీలోని జన్మభూమి నగర్‌కు చెందిన ఏసయ్య (55) ఆదివారం మధ్యాహ్నం కాలనీకి నీటి ట్యాంకర్ రావడంతో ఎండ వేడిమిని కూడా పట్టించుకోకుండా వెళ్లాడు. మండే ఎండలోనే నీటిని తీసుకుని వెళుతూ అస్వస్థతకు గురయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతన్ని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఇతనికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.

  ముదిగుబ్బ మండలం మర్తాడు గ్రామానికి చెందిన వెంగముని(70) ఆదివారం వ్యక్తిగత పని నిమిత్తం ధర్మవరం పట్టణానికి వెళ్లాడు. పని ముగించుకుని ఆటోలో తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో ఎండ వేడిమికి తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు.  

  హిందూపురం మండలంలోని హనుమేపల్లికి చెందిన రైతుకూలీ రామాంజినప్ప(35) ఆదివారం మధ్యాహ్నం కూలి పనులు చేస్తూ  ఆస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అక్కడున్నవారు అతని ముఖంపై నీళ్లుపోసి సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే మృతిచెందాడు. ఇతను ఉదయం సరైన ఆహారం తీసుకోకుండానే మధ్యాహ్నం వరకు పనులు చేయడంతో ఆస్వస్థతకు గురై మృతిచెందినట్లు కూలీలు తెలిపారు. ఇతనికి భార్య, ఇద్దరు  పిల్లలున్నారు.

  -అమడగూరు మండలం కందుకూరిపల్లికి చెందిన కుంచపు వెంకటరమణ(65) ఆదివారం గేదెలను కాసేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం  ఇంటికి తిరిగి వచ్చాడు. నీరు తాగి మంచంపై పడుకున్నాడు. ఎంత సేపటికీ లేవదు. అప్పటికే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఇతనికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

  ధర్మవరంలోని దుర్గానగర్‌కు  చెందిన లారీడ్రైవర్ మణియార్ షాజహాన్ (45)  శనివారం మధ్యాహ్నం లారీలో ద్రాక్ష లోడు వేసుకుని ఒడిశాకు వెళ్లాడు. తిరుగు ప్రయాణమై వస్తుండగా మార్గమధ్యంలోనే లారీని ఆపి కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు.  ధర్మవరం మండలం గొట్లూ రు గ్రామానికి చెందిన దాసరి శివయ్య(32) అనే చేనేత కార్మికుడు ఆదివారం సాయంత్రం కదిరి సమీపంలోని ఎర్రదొడ్డి గంగమ్మకు మొక్కులు తీర్చడానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు. అప్పటికే మృతి చెందాడు.

  చిలమత్తూరు మండలం చిన్నన్నపల్లికి చెందిన  నారాయణమ్మ (52) ఆదివారం వడదెబ్బతో మృతి చెందింది. ఈమె కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతుండేది. ఆదివారం ఉదయం నుంచి బయట చిన్నచిన్న పనులు చేసింది. ఈ క్రమంలో ఎండవేడిమి తాళలేక అస్వస్థతకు గురై చనిపోయింది.

  రాయదుర్గం మండలం ఆయతపల్లికి చెందిన గంగప్ప(70) రైతు. ఆదివారం తోటలో పనిచేస్తుండగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వడదెబ్బకు గురై అక్కడిక్కడే మృతి చెందాడు.  
 
 నేడు ‘మీ కోసం’ రద్దు
 అనంతపురం అర్బన్ :జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో సోమవారం నిర్వహించనున్న మీ కోసం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.  ప్రజలు సాధ్యమైనంత వరకూ ఎండలో తిరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement