
అమృతం..విషం
► అంగన్‌వాడీ కేంద్రాలకు విషతుల్యమైన పాలు
► అవి తాగి అస్వస్థతకు గురవుతున్న గర్భిణులు
మార్కాపురం: అన్న అమృతహస్తం పథకంలో భాగంగా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీలో అందిస్తున్న పాలు పాడైపోవటంతో తల్లులు ఆందోళన చెందుతున్నారు. మార్కాపురం రూరల్, యర్రగొండపాలెం, తర్లుపాడు, బేస్తవారిపేట, గిద్దలూరు ప్రాజెక్టుల పరిధిలో అన్న అమృతహస్తం పథకం అమలవుతోంది. ప్రతి రోజు 200 మిల్లీలీటర్ల పాలను అందజేస్తారు. 25 రోజులకు సరిపడేలా గర్భిణులు, బాలింతలకు మూడు కిలోల బియ్యం, అర కిలో కందిపప్పు, 450 గ్రాముల నూనె, 4 కోడిగుడ్లు ప్రతి రోజు 200 మిల్లీలీటర్ల పాలను అంగన్‌వాడీ కార్యకర్తలు అందజేస్తారు. వీటిలో పాలను టెట్రా ప్యాకెట్లలో నింపి కేంద్రాలకు సరఫరా చేస్తారు. ఈ పాలను వివిధ డెయిరీలు సరఫరా చేస్తున్నాయి. అయితే, ఇటీవల సరఫరా చేసిన పాల ప్యాకెట్లలో కొన్ని పాడైపోవటంతో తల్లులు వాటిని ఉపయోగించుకోలేకపోతున్నారు. కొన్ని ప్యాకెట్ల నుంచి దుర్వాసన వస్తోంది.
మార్కాపురం రూరల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో మార్కాపురం మండలంలో 71 కేంద్రాలు, దోర్నాలలో 77, పెద్దారవీడులో 77, తర్లుపాడు ప్రాజెక్టు పరిధిలోని కురిచేడులో 46, తర్లుపాడులో 51, దొనకొండలో 63, బేస్తవారిపేట ప్రాజెక్టు పరిధిలోని అర్ధవీడులో 60, బేస్తవారిపేటలో 82, కంభంలో 57 కేంద్రాలు, గిద్దలూరు ప్రాజెక్టు పరిధిలోని రాచర్లలో 48, గిద్దలూరులో 110, కొమరోలు 77, యర్రగొండపాలెం ప్రాజెక్టు పరిధిలోని పుల్లలచెరువులో 81, త్రిపురాంతకంలో 77, యర్రగొండపాలెంలో 90 కేంద్రాలు ఉన్నాయి. వీటిలో మార్కాపురం రూరల్ పరిధిలో సుమారు 2,600 మంది, తర్లుపాడు పరిధిలో 2,200, గిద్దలూరు పరిధిలో 2,700, బేస్తవారిపేట పరిధిలో 2 వేల మంది గర్భిణులు, బాలింతలు అన్న అమృతహస్తం పథకంలో ఉన్నారు. ఇటీవల పంపిణీ చేసిన పాలలో మార్కాపురం రూరల్ ప్రాజెక్టు పరిధిలో 120, తర్లుపాడు పరిధిలో 317, గిద్దలూరు పరిధిలో 612, బేస్తవారిపేట పరిధిలో 200, యర్రగొండపాలెం ప్రాజెక్టు పరిధిలో 423ప్యాకెట్లు పాడైపోయినట్లు శనివారం సాయంత్రానికి అధికారులు గుర్తించి తమ ఉన్నతాధికారులకు నివేదిక పం పారు.
టెట్రా ప్యాకెట్లు తయారై వచ్చేటప్పుడు వాటిపై ఒత్తిడి ఉన్నా, చిన్న రంధ్రం పడినా బ్యాక్టీరియా చేరి దుర్వాసన వస్తాయని ఐసీడీఎస్ అధికారులు అంటున్నా రు. కేంద్రాలకు సరఫరా చేసిన ప్యాకెట్లు సక్రమంగా నిల్వ చేయకపోయినా పాడైపోయే అవకాశం ఉంది. ఇలాంటి పాల ప్యాకెట్లు చూడకుండా తాగితే వాంతులు, విరేచనాలవుతాయి. ప్రధానంగా గర్భిణులు తీవ్ర అనారోగ్యానికి గుర య్యే అవకాశం ఉంది. తర్లుపాడు మండలం తాడివారిపల్లె అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చిన ప్యాకెట్లలో పాలు చెడిపోయాయి. వాటిని చూసుకోకుండా సిబ్బంది గర్భిణులకు ఇవ్వడంతో శుక్రవారం వారు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. ఈ పాలను మూడు నెలలుగా వివిధ డెయిరీల నుంచి అధికారులు సేకరించి అం గన్‌వాడీ కేంద్రాలకు పంపుతున్నారు. సరఫరా చేసే పాల ప్యాకెట్లను అధికారులు పరిశీలించకపోవటంతో నాణ్యత ప్రమాణాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పాడైపోయిన పాలు వాడవద్దని చెప్పాం – విశాలాక్షి, ప్రాజెక్టు డైరెక్టర్, ఐసీడీఎస్, ఒంగోలు
పాడైపోయిన పాలప్యాకెట్లు వాడవద్దని అంగన్‌వాడీ కార్యకర్తలకు, అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. సుమారు 1600 పాలప్యాకెట్లు పాడైపోయినట్లు గుర్తించాం. పాలప్యాకెట్లపై తీవ్రమైన ఒత్తిడి పడటంతో పాడైపోయినట్లు గుర్తించాం. శనివారం గిద్దలూరులో ఈ అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించాం. డెయిరీ అధికారులు హాజరై కార్యకర్తల సందేహాలు తీర్చారు. గత నెల రూ.1.16 లక్షల పాల ప్యాకెట్లను కేంద్రాలకు పంపిణీ చేశాం. అవి బాగానే ఉన్నాయి. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా చూస్తాం. ప్రతి రోజు పాల ప్యాకెట్ల పంపిణీపై నిశితంగా పరిశీలించాలని ఆదేశించాం.