మా కళ్లు కప్పొద్దు..!
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. సదావర్తికి చెందిన 83 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం వేలంలో నిబంధనలు పాటించకుండా అతి తక్కువ ధరకు తమకు కావాల్సిన వారికి కట్టబెట్టిందని, తద్వారా ఖజానాకు నష్టం చేకూర్చిందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్‌కే) హైకోర్టు లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పలు దఫాలుగా విచారణ జరిపిన హైకోర్టు.. వేలంలో సంజీవరెడ్డి, ఇతరులు కోట్ చేసిన రూ. 22 కోట్లకు అదనంగా మరో రూ. 5 కోట్లు చెల్లించాలని ఆర్‌కేను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆర్‌కే రూ. 27 కోట్లు డిపాజిట్ చేశారు.
ఆర్కే వ్యాజ్యాన్ని ఆధారంగా చేసుకుని భూములను చేజిక్కించుకోవాలని చూస్తున్నారని సంజీవ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ ఉద్దేశాన్ని పరీక్షించేందుకే డిపాజిట్ చేయాలని ఆదేశించామని, ఖజానాకు నష్టం వాటిల్లకూడ దన్నదే పిటిషనర్ ఉద్దేశమని హైకోర్టు స్పష్టం చేసింది. నెల రోజుల్లో వేలం ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశిస్తూ సెప్టెంబర్ 21కి విచారణ వాయిదా వేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను రద్దు చేయాలంటూ సంజీవరెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. వేలంలో కొన్న భూములకు తిరిగి వేలం నిర్వహించడం సబబు కాదని పిటిషనర్ తరపు న్యాయవాది వి.గిరి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా జస్టిస్ దీపక్ మిశ్రా స్పందిస్తూ ‘మీరు బిడ్ ఎంతకు వేశారు?’ అంటూ ప్రశ్నించారు.
‘నిబంధనలకు అనుగుణంగా వేలంలో పాల్గొన్నాం. వేలాన్ని తిరిగి చేపట్టాలని కోరడం సబబు కాదు..’ అని వి.గిరి పేర్కొన్నారు. దీనికి జస్టిస్ దీపక్ మిశ్రా ఆగ్రహం వ్యక్తంచేస్తూ... ‘మీరు మా కళ్లను ఎలా కప్పుతారు? మీరు వేలానికి సిద్ధమైతే సరి.. లేదంటే న్యాయస్థాన వేలం(కోర్టు ఆక్షన్)కు సిద్ధమవ్వాల్సి ఉంటుంది..’ అని వ్యాఖ్యానించారు. దీంతో వి.గిరి ప్రభుత్వం జరిపే వేలంలో పాల్గొంటామని పేర్కొన్నారు.
ప్రతివాది అయిన ఆర్కే కూడా వేలంలో పాల్గొనాలని, లేదంటే ఇదివరకే డిపాజిట్ చేసిన సొమ్ములో రూ. 10 కోట్లు వదులుకో వాల్సి వస్తుందని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే తాము ఈ–వేలంలో పాల్గొనేందుకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకే సమయం ఉందన్న అంశాన్ని ప్రతివాది తరపు న్యాయవాది సుధాకర్‌రెడ్డి ధర్మాసనం ముందు ప్రస్తావించగా గడువును 15వ తేదీ వరకు పెంచారు. అలాగే బహిరంగ వేలం 14వ తేదీన ఉండగా.. దానిని 18వ తేదీకి మార్చుతూ ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి విచారణను 22వ తేదీకి వాయిదా వేశారు.