న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అందిస్తున్న సేవలపై కేంద్రం పన్ను (సర్వీస్ ట్యాక్స్) విధించడంపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. అంతేకాదు.. ఈలోగా టీటీడీ పాలకమండలిపై ఎలాంటి బలవంతపు చర్యలకూ దిగరాదని న్యాయమూర్తులు ఎ.కె.పట్నాయక్, ఎఫ్‌ఎంఐ కలీఫుల్లాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ రెవెన్యూ విభాగానికి నోటీసు జారీ చేసింది. దీనిపై రెండువారాల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. టీటీడీ సేవలపై సర్వీస్ ట్యాక్స్ విధించడానికి సంబంధించిన ఆర్థిక చట్టంలోని కొన్ని నిబంధనల రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ పాలకమండలి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం బెంచ్ విచారించింది. టీటీడీ తరఫున సీనియర్ న్యాయవాది కె.పరాశరన్, శ్రీధర్ పోతరాజులు వాదించారు.
తిరుమలకు వచ్చే యూత్రికులకు తామందించే సేవలపై పన్ను విధించేందుకు వీలు కల్పిస్తున్న, రాజ్యాంగంలోని 14వ అధికరణానికి విరుద్ధమైనదిగా పేర్కొనబడుతున్న ఆర్ధిక చట్టం 1994లోని నిబంధనలను రద్దు చేయూలని వారు అభ్యర్థించారు. ఈ నిబంధనలు చెల్లనివి, చట్టవిరుద్ధమైనవే కాకుండా రాజ్యాంగ విరుద్ధమైనవని వారు పేర్కొన్నారు. 25, 26, 27 అధికరణాలు హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేవి అని కోర్టు దృష్టికి తెచ్చారు. అధికరణం 26.. మతపరమైన వ్యవహారాల నిర్వహణకు తగిన స్వేచ్ఛను అనుమతిస్తోందని, అధికరణం 27.. ఏదైనా ప్రత్యేకమైన మతాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా పన్నుల చెల్లింపులో స్వేచ్ఛను ప్రసాదిస్తోందని టీటీడీ వాదించింది.