ఇసుక వాహనాలకు కనిపించని ‘జీపీఎస్’
సీసీ కెమెరాల నిఘా కరువు
అడ్డూఅదుపు లేని అక్రమరవాణా
పట్టించుకోని అధికారులు
శ్రీకాకుళం : జిల్లాలోని రీచ్‌లనుంచి ఇసుక ఎక్కడకెక్కడకు వెళుతోందీ. ఏ వాహనం ఎలా తీరుగుతోందీ తెలుసుకునేందుకు రూపొం దించిన జీపీఎస్(గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ఎక్కడా అమలు కావడంలేదు. అక్రమ రవాణా అరికట్టేందుకు రీచ్‌ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు కాలేదు. నిర్వాహకుల అలక్ష్యానికి అధికారుల పర్యవేక్షణ లోపం తోడవడంతో అక్రమ వ్యాపారం మూడులారీలు.. ఆరు ట్రాక్టర్లుగా సాగిపోతోంది.
అమలు కాని ఆదేశాలు
జిల్లాలో 33చోట్ల ఇసుక రీచ్‌లకు జిల్లా యంత్రాంగం అనుమతిచ్చింది. ప్రస్తుతం 9చోట్ల తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయించినా, కోట్లాదిరూపాయలు ప్రభుత్వానికి జమ చేసినా ఆయా వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ లేకుండానే ఇసుక తరలిపోయింది. అధికారులు ఇటీవల మూడు రోజుల పాటు రీచ్‌ల్లో తవ్వకాలను నిలిపివేశారు. లారీలు, ట్రాక్టర్లకు జీపీఎస్ అమర్చాలని పేర్కొంటూ ప్రకటన విడుదల చేసినా అమలు కాలేదు. పొరుగున ఉన్న విజయనగరం జిల్లాలో జీపీఎస్ వ్యవస్థ శతశాతం అమలైనట్టు అక్కడి అధికారులు చెబుతున్నా, ఈ జిల్లాలో ఆ చర్యలు కానరావడంలేదు. డీఆర్‌డీఏ, మెప్మా విభాగాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఇసుక ర్యాంప్‌ల్లో మహిళా సంఘాల మాటున టీడీపీ కార్యకర్తలే బినామీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం ఇటీవల శ్రీకాకుళం పట్టణ నడిబొడ్డన ఏర్పాటైన హయాతినగరం ఇసుక రీచ్‌లో బయటపడింది. వైఎస్సార్‌సీపీ నేతలు పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించి ర్యాంప్ వద్ద ఆందోళన నిర్వహించడంతో బెంబేలెత్తిపోయిన అధికారులు ప్రస్తుతం ర్యాంప్ లావాదేవీలు నిలిపివేశారు.
అక్రమ వ్యాపారానికి అండ
జిల్లాలో జీపీఎస్ వ్యవస్థ అన్ని వాహనాలకూ గత జూన్ 17లోగా అమర్చాలని అధికారులు నిర్ణయించారు. రెండు నెలలవుతున్నా దానినెవరూ పట్టించుకోలేదు. రాత్రి పూట జరిగే అక్రమ లావేదేవీలకు, రీచ్‌పాయింట్ నుంచి ఏ వాహనం ఎక్కడకు చేరుతుందో తెలుసుకునేందుకు ఈ వ్యవస్థ అనివార్యం. కానీ అక్రమవ్యాపారులకు ఇబ్బంది కలగకూడదనే దీనిపై నిఘా పెట్టడానికి అధికారులు సాహసించడంలేదు. సీసీ కెమెరాలు కూడా మూడంటే మూడే రీచ్‌ల్లో ఏర్పాటు చేశారు. వాటి పనితీరు పసిగట్టేందుకు అధికారులకు సమయం లేదు. ఒక్కో వాహనానికి రూ.4600చెల్లిస్తే(సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రైవేట్ సంస్థలకు) ప్రత్యేక సిమ్‌కార్డు యాక్టివేషన్ ద్వారా, వాహనానికి స్టిక్కర్ అంటించడం ద్వారా జీపీఎస్ వ్యవస్థ అమల్లోకి తేవచ్చు. కానీ టీడీపీ బినామీలే నడిపిస్తున్న రీచ్‌ల్లో ఇంత సొమ్ము పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టిసారించాల్సి ఉంది.
ఎక్కడికి తరలిపోతోందో?
Published Wed, Aug 12 2015 3:03 AM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM
Advertisement
Advertisement