♦ రైళ్లలో పెరుగుతున్న చోరీలు
♦ విఫలమవుతున్న భద్రత బలగాలు
బిట్రగుంట : విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నిఘా వ్యవస్థ నిస్తేజంగా మారింది. జీఆర్పీ, ఆర్పీఎఫ్ విభాగాల్లో సిబ్బంది కొరత, ఫీల్డ్ ఇంటెలిజన్స్, ఇన్‌ఫార్మర్ల వ్యవస్థలకు ప్రాధాన్యం తగ్గిపోవడంతో రైళ్లలో దొంగలు విజృంభిస్తున్నారు. తాజాగా సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ఐపీఎస్ అధికారిపై జరిగిన దాడితో పాటు డివిజన్ పరిధిలో గడిచిన రెండు నెలల కాలంలో జరిగిన చోరీ ఘటనలే ఇందుకు నిదర్శనం. మత్తు మందు ఇచ్చి దోచుకునే ఉత్తరాది ముఠాలతో పాటు ఒంగోలు, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు చెందిన లోకల్ గ్యాంగ్‌లు రైళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు అధికారుల వద్ద సమాచారం ఉన్నా నేరాల నియంత్రణకు, దొంగల ఆటకట్టించేందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు. సిబ్బంది కొరత, స్పష్టమైన సమాచారం ఇచ్చే ఇన్‌ఫార్మర్లు లేకపోవడం, ఇతర కేసుల్లో మాదిరి సాంకేతిక పరిజ్ఞానం అక్కరకు రాకపోవడం వంటి సమస్యలతో నిఘా వ్యవస్థ విఫలమవుతోంది. దీంతో రైలు ప్రయాణమంటేనే ప్రయాణికులు హడలిపోయే పరిస్థితి నెలకొంది.
వరుస చోరీలతో ఆందోళన
సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో మనుబోలు వద్ద పట్టపగలే వికలాంగుల బోగీలో ఉన్న మహిళా ఐపీఎస్ అధికారిపై దాడి చేసి నగలు, నగదు దోచుకుపోయిన తాజా ఘటన ఆందోళనకు గురిచేస్తోంది. జూలైలో చెన్నై వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైల్లో మత్తుమందిచ్చి ప్రయాణికులను దోచుకున్న విషయం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. గత నెల్లో కేరళ ఎక్స్‌ప్రెస్‌లో మత్తుమందిచ్చి ఢిల్లీకి చెందిన దంపతుల వద్ద భారీగా నగలు, నగదును చోరీ చేశారు. చోరీలకు పాల్పడింది ఉత్తరాదికి చెందిన ముఠాలేనని అధికారులు అనుమానిస్తున్నారు.
గత గురువారం ఖమ్మం జిల్లా డోర్నకల్ సమీపంలో నాందేద్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైల్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించి ఏడుగురు మహిళల మెడల్లోని నగలను దోచుకువెళ్లారు. నిత్యం ఎక్కడో చోట రైళ్లలో చోరీలు జరుగుతూనే ఉన్నాయి. గడిచిన రెండు నెలల కాలంలో డివిజన్ పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో 200కు పైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గడిచిన మూడేళ్ల గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే రూ.మూడు కోట్లకు పైగా ప్రయాణికుల సొత్తు దొంగలపాలైంది.
అడుగడుగునా భద్రత లోపం..
ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలో అడుగడుగునా భద్రత లోపం స్పష్టంగా కనిపిస్తోంది. రిజర్వేషన్ బోగీల్లోకి సాధారణ ప్రయాణికులను అనుమతించడం, స్లీపర్ కాస్ల్‌లతో పాటు థర్డ్ ఏసీ కోచ్‌లలోకీ ఇతరులను అనుమతించేస్తున్నారు. ప్రయాణికుల్లా ఎక్కుతున్న దొంగల ముఠాలు వేకువ సమయాల్లో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా లగేజీలతో దిగిపోతున్నారు. ఉదాహరణకు సింహపురి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ నుంచి గూడూరు వెళ్లే సమయంలో చీరాల, ఒంగోలు స్టేషన్లలో సాధారణ ప్రయాణికులంతా స్లీపర్, థర్డ్ ఏసీ కోచ్‌లలోకి ఎక్కేస్తుంటారు. వీరితో పాటు రిజర్వేషన్ కోచ్‌లలో ఎక్కే దొంగల ముఠాలు హస్తలాఘవం చూపించి మధ్యలో దిగిపోతుంటారు. అధికారులు నిఘా వ్యవస్థను పటిష్టం చేయకుంటే ప్రయాణికులకు భద్రత కరువయ్యే పరిస్థితి తప్పదు.
నిఘా నిస్తేజం
Published Mon, Sep 14 2015 3:15 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM
Advertisement
Advertisement