ఆర్థికపరమైన అవకతవకలపై తిరుగులేని అధికారాలు చలాయిస్తున్న నియంత్రణా సంస్థగా ‘సెబీ’కి పేరుంది. కానీ వివిధ ప్రభుత్వాల పాలనా కాలాల్లో అది మౌనం పాటించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలపై పారదర్శకతను నెలకొల్పడమే స్వతంత్ర రెగ్యులేటరీ కమిషన్ల ఏర్పాటు ఉద్దేశం.
అలాంటిది స్వయం నియంత్రణా సంస్థలే తమ విధులను సంతృప్తికరంగా నిర్వహించడం లేదనే అభిప్రాయం ఎందుకు ఏర్పడుతోంది? ఈ రెగ్యులేటరీ కమిషన్లను స్వతంత్రంగా కాకుండా ప్రభుత్వం తరపున పనిచేసేలా మార్చేశారు. ఎంపిక కమిటీలు సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన పదవీ విరమణ చేసిన పాలనాధికారులతో కూడి ఉంటున్నాయి. ఇలాంటి ఆచరణ చట్టబద్ధమైన స్వతంత్ర రెగ్యులేటరీల అసలు ఉద్దేశానికి వ్యతిరేకం.
ప్రపంచంలోనే అత్యున్నత అధికారం చలాయిస్తున్న నియంత్రణా సంస్థల్లో మన ‘సెబీ’ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఒకటి. ఆర్థిక పరమైన అవకతవకలపై శోధన, స్వాధీనం, దాడులు, అరెస్టులకు సంబంధించి తిరుగులేని అధికారాలను సెబీ కలిగి ఉంటోంది. అనుమానాస్పదమైన ట్రేడింగ్ కార్యకలాపాలను, రియల్ టైమ్ ప్రాతిపదికన షేర్ల విలువను తారు మారు చేయడాన్ని పసిగట్టడంలో సెబీకి విస్తృత మైన నిఘా వ్యవస్థ తోడుగా ఉంటోంది. అయిన ప్పటికీ విభిన్న రాజకీయ పాలనా కాలాల్లో ఈ రెగ్యులేటరీ సంస్థ మౌనం పాటిస్తూ వచ్చింది.
గత రెండు దశాబ్దాలుగా, సెబీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం పనిచేస్తూ వచ్చింది. ప్రత్యేకించి యూపీఏ (యునైటెడ్ ప్రోగ్రె సివ్ అలయెన్స్) రెండో పాలనా కాలంలో ఇది కొట్టొచ్చినట్లు కనబడుతుంది. లేదా నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ)లో కో– లొకేషన్ (కోలో) స్కామ్ విషయంలో కానీ, సత్యం కుంభకోణంలో కానీ సెబీ కార్యకలాపాలు ఎలాంటి పబ్లిక్ లేదా రాజకీయ తనిఖీ రాడార్‌లో లేకుండా కొనసాగుతూ వచ్చాయి.
ఇటీవలే ఇలాంటి ప్రశ్నలను పార్లమెంట్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ప్రతిభావంతంగా లేవనెత్తారు. గత రెండేళ్లలో స్టాక్ మార్కెట్లో కొన్ని కంపెనీల విలువ అమాంతంగా పెరిగిపోవడంపై ఆమె ప్రశ్నలు సంధించారు. కానీ సెబీ మాత్రం ఈ విషయంలో కనీస అధ్యయనం కూడా చేయనట్లు కనిపిస్తోంది.
దర్యాప్తు జరుగుతున్నప్పటికీ రూ. 20,000 కోట్ల విలువైన అత్యంత భారీ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓ)ని ఒక కంపెనీ ప్రతిపాదించడాన్ని సెబీ ఎలా అనుమతించిందంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సరిగ్గానే ప్రశ్నించారు (అయితే ఆ ప్రతిపాద నను తర్వాత ఉపసంహ రించుకున్నారు.) ఆర్థిక అవకతవకలపై అత్యంత క్రియాశీలకంగా ఉండే రెగ్యులేటరీ సంస్థ సెబీ తన విశ్వసనీయత ప్రశ్నార్థకమైన సమయంలో, తన గమనింపునకు వచ్చి నప్పుడు ఈ విషయమై పరిశీలిస్తానంటూ ముభావంగా స్పందించిందే తప్ప అంతకుమించిన విచారణ జరపలేదు. ఎందుకు విచారించలేదనే కీలక ప్రశ్నకు కూడా ఇప్పటికీ అది సమాధాన మివ్వడం లేదు.
చర్యలు తీసుకున్న దాఖలా లేదు
సెబీ నిద్రపోతోందంటూ సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో, భారతదేశంలో రెగ్యులేటరీ వ్యవస్థ ఎందుకు విఫలమవుతోందన్న అంశంపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వ నిర్ణయాలపై పారదర్శకతను నెలకొల్ప డమే స్వతంత్ర రెగ్యులేటరీ కమిషన్ల ఏర్పాటు ఉద్దేశం.
సరళీకరణ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నందున బొగ్గు, భూమి, విద్యుత్, టెలి కమ్యూనికేషన్లు, స్పెక్ట్రమ్, పెట్రోలయం, సహజ వాయువు, స్టాక్ మార్కెట్లు, పెన్షన్ నిధులు– వీటి నిర్వహణ, విమానాశ్రయాలు వగైరా ఎన్నో అంశాలు రెగ్యురేటరీ పరిశీలనా చట్రం పరిధిలోకి వచ్చాయి.
అయితే ట్రాయ్(టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) లాంటిది కేవలం సిఫార్సులు మాత్రమే చేయగలిగే అధికారం కలిగివుంటోంది. మరోవైపు విద్యుత్ కమిషన్లు తమ సేవల మార్కెట్లపై అధికారం చలాయించడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాయి. సెబీ, కాంపిటీషన్ కమి షన్ ఆఫ్ ఇండియా వంటి కొన్ని కేసులలో తప్పితే నిబంధనలు పాటించకపోవడంపై చర్యలు తీసు కునే శిక్షాత్మక అధికారాలు ఇప్పటికీ బలహీనంగానే ఉంటున్నాయి.
స్వయం నియంత్రణా సంస్థలు తమ విధు లను సంతృప్తికరంగా నిర్వహించడం లేదనే అభి ప్రాయం ఎందుకు ఏర్పడుతోంది? చాలావరకు ఈ రెగ్యులేటరీ సంస్థలే అక్రమాలకు పాల్పడుతున్నా యనే ఆరోపణలు ఉంటున్నాయి. నిబంధనలను అతిక్రమించే సభ్యులకు వ్యతిరేకంగా ఐసీఏఐ (ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) లేదా ఎమ్‌సీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) వంటి ప్రొఫెషనల్ సంస్థలు కఠిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు.
ఇక క్రీడా సంస్థల విషయానికి వస్తే అవి జీవితకాలం పదవుల్లో ఉండే వ్యక్తులతో కూడుకుని ఉంటు న్నాయి. పైగా వీటి ఆర్థిక సమగ్రతపై సందేహాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపున ప్రభుత్వం నియమించిన చట్టబద్ధమైన నియంత్రణాధికార సంస్థలు కూడా లోపరహితమైన స్థాయికి చేరలేక పోతున్నాయి.
విద్యుత్, టెలీ కమ్యూనికేషన్లు,కాంపిటీషన్, సెక్యూరిటీల విషయంలో సంబంధిత కమిషన్ల ఆదేశాలకు వ్యతిరేకంగా అప్పీల్స్ వంటివి అప్పీలేట్ ట్రిబ్యునల్స్‌కి వెళుతున్నాయి తప్ప నేరుగా హైకోర్టుల ముందుకు వెళ్లడం లేదు. దీని వల్ల జాప్యం జరగడమే కాకుండా కమిషన్ అసలు ఉద్దేశాన్ని పలుచన చేస్తున్నాయి.
డిప్యుటేషన్ మరో సమస్య
ప్రభుత్వ విభాగాలు ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అనేక ఉదంతాల్లో రెగ్యులేటరీ కమిషన్లను స్వతంత్రంగా కాకుండా ప్రభుత్వం తరపున పనిచేసేలా మార్చేశారు. రెగ్యు లేటరీ సంస్థల ఛైర్మన్, సభ్యుల ఎంపిక ప్రక్రియ దీనికి ఒక కారణం కావచ్చు. ఎంపిక కమిటీలు సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన పదవీ విరమణ చేసిన పాలనాధికారులతో కూడి ఉంటు న్నాయి. ఇలాంటి ఆచరణ చట్టబద్ధమైన స్వతంత్ర రెగ్యులేటరీల అసలు ఉద్దేశానికి వ్యతిరేకంగా ఉంటోంది. ఇలాంటి విభాగాల్లో నియమితులైన వారిని నాటుకుపోయిన ప్రభుత్వ విధేయ సంస్కృతి నుంచి బయటపడవేయలేరా?
చాలావరకు రెగ్యులేటరీ విభాగాల్లో పని చేస్తున్న సిబ్బంది ప్రభుత్వ ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్ పై వచ్చినవారు. వీరు రెగ్యులేషన్ లో తమకు కెరీర్ ఉందని భావించడం లేదు. అలా భావించే కొద్దిమందే ఈ విభాగాల సభ్యులుగానూ లేదా ఛైర్మన్లుగానూ ఎదుగుతున్నారు. ఈ తరహా రెగ్యులేటరీ విభాగాలు మరొక ప్రభుత్వ సంస్థలానే తరచుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి.
ఎందుకంటే ఈ విభాగాలలోని కీలక స్థానాలు పదవీ విరమణ చేసిన బ్యూరోక్రాట్లకు, ప్రభుత్వ అధికారులకు పదవీ విరమణ అనంతరం దక్కించుకునే హోదాలుగా మారిపోయాయి. దీని ఫలితంగా పెద్దగా స్వాతంత్య్రం లేకపోవడం, సంబంధిత రంగాల నియంత్రణాధికారుల్లో సాహసం లేక విజ్ఞానం లేకపోవడం జరుగుతోంది.
ప్రభుత్వ ప్రతిష్ఠ పైన మాత్రమే కాకుండా, భారత వృద్ధి గాథపై కూడా ఇది ప్రభావం చూపుతున్నందు వలన, దేశంలోని రెగ్యులేటరీ సంస్థల విశ్వస నీయతను పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్న మైంది.
నీలూ వ్యాస్
వ్యాసకర్త సీనియర్ టీవీ యాంకర్,కన్సల్టింగ్ ఎడిటర్
(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment