సెలవు పెట్టిన పాపానికి గ్రామ పంచాయతీ కాంట్రాక్టు మహిళా కార్యదర్శులిద్దరిని రెండేళ్లుగా ఉద్యోగం లేకుండా గాల్లోపెట్టిన జిల్లా పంచాయతీ కార్యాలయ ఉద్యోగుల నిర్వాకాన్ని ఏపీ ట్రైబ్యునల్ ఎండగట్టిన ఉదంతమిది.
చిత్తూరు(టౌన్): సెలవు పెట్టిన పాపానికి గ్రామ పంచాయతీ కాంట్రాక్టు మహిళా కార్యదర్శులిద్దరిని రెండేళ్లుగా ఉద్యోగం లేకుండా గాల్లోపెట్టిన జిల్లా పంచాయతీ కార్యాలయ ఉద్యోగుల నిర్వాకాన్ని ఏపీ ట్రైబ్యునల్ ఎండగట్టిన ఉదంతమిది. ఒకరు ప్రసవం కోసం, మరొకరు వివాహం కోసం పెట్టిన సెలవులను కాదని జిల్లా పంచాయతీ కార్యాలయ ఉద్యోగులు వారిని రెండేళ్లపాటు ఇబ్బంది పెట్టారు. దాంతో వారిలో ఒకరు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించి తిరిగీ ఉద్యోగం పొందారు. మరొకరు మాత్రం నేటికీ గాల్లోనే ఉంటూ జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
ప్రసవం కోసం సెలవుపెడితే...
చిత్తూరుకు చెందిన కవితా ప్రియదర్శిని 2006 లో గ్రామ పంచాయతీ కాంట్రాక్టు కార్యదర్శిగా నియమితులయ్యారు. 2012 వరకు పాలసముద్రం మండలంలో కార్యదర్శిగా పనిచేశారు. అయితే 2012 జనవరిలో ప్రసవం కోసం సెలవు పెట్టారు. తర్వాత విధుల్లో చేరేందుకు వెళ్లగా ఏవేవో సాకులుచెప్పి పెండింగ్‌లో ఉంచారు. కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం కనిపించకపోవడంతో గత నెలలో ఏపీ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా, ఆమెకు ఉద్యోగం కల్పించాలని ట్రైబ్యునల్ ఆదేశిం చింది. దాంతో డీపీవో అభిప్రాయం మేరకు కలెక్టర్ ఆమెకు పిచ్చాటూరు మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు.
వివాహం కోసం సెలవుపెట్టి...
సత్యవేడుకు చెందిన జోత్స్న అదే మండలంలో పంచాయతీ కాంట్రాక్టు కార్యదర్శిగా 2006లో చేరారు. 2012లో ఆమె వివాహం కోసం కొన్నిరోజుల పాటు సెలవు పెట్టారు. సెలవు పూర్తరుున తర్వాత విధుల్లో చేరేందుకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి వెళితే వీలుపడదంటూ తిప్పిపంపేశారు. అప్పటి నుంచి నేటి వరకు ఉద్యోగం లేకుండా డీపీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే కవితా ప్రియదర్శినికి ట్రైబ్యునల్ ఆదేశాలతో ఉద్యోగం వచ్చినట్లు తెలుసుకున్న ఆమె తనకూ ఉద్యోగం ఇప్పించాలంటూ కలెక్టర్.డీపీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీనిపై జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రావును సంప్రదించగా కార్యాలయానికి చెందిన ఉద్యోగుల దాష్టీ కంతో వారిద్దరికీ ఉద్యోగం పోయిందన్నారు. అయితే ఒకరు ట్రైబునల్ అదేశాలతో ఉద్యోగాన్ని తిరిగీ సాధించుకోగా, మరొకరు మాత్రం కలెక్టర్ కార్యాలయంతో పాటు తన కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు.