శ్రీకాకుళం పాతబస్టాండ్: పొమ్మనలేక పొగ పెట్టినట్లు.. రెవెన్యూ శాఖలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందిని జిల్లా అధికారులు మూకుమ్మడిగా బదిలీ చేశారు. వాస్తవానికి వీరికి బదిలీలు ఉండవు, ఎక్కడ నియమిస్తే అక్కడే విధులు నిర్వర్తిస్తారు. సంబంధిత కాంట్రాక్టర్ వారికి జీతాలు చెల్లిస్తారు. అయితే టీడీపీ ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. రెవెన్యూ శాఖలో 2004 నుంచి పనిచేస్తున్న డేటా ఎంట్రీ అపరేటర్లలో 53 మందిని దూరప్రాంతాలకు ఆకస్మికంగా బదిలీ చేసింది. దీని వెనుక జిల్లా మంత్రి, ఆయన ఓఎస్డీ, కొందరు అధికారుల కుట్ర ఉందని సదరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తమకు ఇచ్చేదే అరకొర జీతం..
అది కూడా పది నెలలుగా మంజూరు కాలేదు, అయినా నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు కార్యాలయాల్లో ఉంటూ కష్టపడుతున్న తమను బదిలీ చేయడం అన్యాయమని వారు వాపోతున్నారు. జీతాలు చెల్లించే విషయంలో చొరవ చూపని అధికారులు, ప్రజాప్రతినిధులు బదిలీల పుణ్యం కట్టుకున్నారని ఆవేదన్య వ్యక్తం చేస్తున్నారు. బదిలీ అయిన చోటుకు వెళ్లని వారిని ఆ సాకుతో తొలగించి తమకు అనుకూలమైన వారిని నియమించుకునేందుకు మంత్రి, ఆయన ఓఎస్డీ ఇప్పటికే జాబితాను సిద్ధం చేసుకున్నారని బాధిత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అందుకే నిబంధనలు లేకపోయినా దూరప్రాంతాలకు బదిలీ చేశారని అంటున్నారు. ఎప్పుడో వచ్చే అరకొర జీతాలతో దూరప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు ఎలా చేయగలమని ప్రశ్నిస్తున్నారు. మీరు చేరకపోతే.. కొత్తవారు వస్తారని ఇప్పటికే కొందరు తహశీల్దార్లు వ్యాఖ్యానించడాన్ని బట్టి అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించమని వారిపై ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాల తోపాటు కలెక్టరేట్‌లో మొత్తం 64 మంది అవుట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారు. కలెక్టరేట్‌లో పనిచేస్తున్న వారు మినహా మిగతా 53 మందిని బదిలీ చేశారు. ఈ బదిలీల తీరును కొందరు టీడీపీ నేతలే వ్యతిరేకిస్తున్నారని తెలిసింది.
అవుట్ సోర్సింగ్ సిబ్బందిపై బదిలీ వేటు
Published Thu, Dec 11 2014 3:23 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement