మూగ రోదన! | Removal of outsourcing staff | Sakshi
Sakshi News home page

మూగ రోదన!

Published Sun, Aug 24 2014 2:11 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

మూగ రోదన! - Sakshi

మూగ రోదన!

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా పశుసంవర్థక శాఖను సిబ్బంది కొరత పట్టిపీడిస్తోంది. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం ముందుకు రాకపోగా అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించడంతో ఈ శాఖలో కార్యకలాపాలు కుంటుపడుతున్నాయి. దీనికి తోడు టీడీపీ నేతల అనుచరులను నియమిం చేందుకే ఏళ్ల తరబడి పని చేస్తున్న తమను ప్రభుత్వం తొలగించిందని బాధిత ఉద్యోగు లు ఆరోపిస్తున్నారు. జిల్లా పరిధిలో పశుసంవర్థక శాఖలో ఒక జేడీతోపాటు డీడీ ఒకరు, శ్రీకాకుళం, టెక్కలి డివిజన్ల పరిధిలో 16 మంది ఏడీలు (పాలన/వైద్యం), 60 మంది వెటర్నరీ అసిస్టెంట్లు, 300 మంది పారా వెట ర్నరీ అధికారులు పని చేస్తున్నారు.
 
 వీరితో పాటు జిల్లా వ్యాప్తంగా 54 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. జూలై 31తో గడువు ముగిసిపోగా వచ్చే డిసెంబర్ వరకు అన్ని విభాగాల్లో అవుట్ సోర్సింగ్ సిబ్బంది పదవీ కాలం పొడిగించినా పశుసంవర్థక శాఖలో మాత్రం అది అమలు కాలేదు. జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకే పశుసంవర్థక శాఖ సిబ్బందికి రెన్యూవల్ చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ వారిని నియమించుకునేందుకు మంత్రి ఈ చర్యకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఇదే విషయమై పలుమార్లు కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేసి వినతి పత్రాలు అందిం చినా అధికారులు స్పందించలేదని ఆవేదన చెందుతున్నారు.
 
 పాలనా సమస్యలు
 పశుసంవర్థక శాఖలో ఇప్పుడు కొత్తగా మరో సమస్య ఏర్పడింది. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సిబ్బందితో పాటు పాలనాపరమైన సిబ్బంది, పశువులకు వైద్యం చేసే సిబ్బంది ఉంటేనే ఆ శాఖకు వైభవం. అయితే జిల్లాలో సరిపడా సాంకేతిక సిబ్బంది ఉన్నా, ఇతర విభాగాల సిబ్బంది లేకపోవడం ఇబ్బందిగా మారింది. జూనియర్ అధికారుల భర్తీ కూడా ఇప్పట్లో జరిగేలా లేదని అధికారులే చెబుతున్నారు. నాలుగో తరగతి ఉద్యోగుల్ని సకాలంలో నియమించకపోతే పశువైద్యానికి తిప్పలు తప్పవని కూడా చెబుతున్నారు. కనీస సౌకర్యాల కల్పన కూడా గగనంగా మారింది. చాలాచోట్ల సిబ్బందికి రవాణా భత్యం చెల్లించకపోవడంతో స్థానిక వైద్యులే వారి జీతాల నుంచి చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అదే విధంగా వైద్యశాలల కంప్యూటరీకరణలో భాగంగా కంప్యూటర్లు కేటాయించినా,  ఆపరేటర్లను నియమించకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు.   
 
 జేడీల సమీక్షలో చెప్పినా..
 పశుసంవర్థకశాఖ ఇబ్బందులపై ఇటీవల రాష్ట్రస్థాయిలో జాయింట్ డెరైక్టర్ల సమీక్ష నిర్వహించారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఆయా జిల్లాల జేడీలు పూసగుచ్చినట్టు నివేదికల రూపంలో ప్రభుత్వానికి నివేదించారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. పశువైద్యశాలల్లో వెటర్నరీ అసిస్టెంట్లే కీలకం. అయితే ఈ పోస్టులు 50 శాతం వరకు ఖాళీ అయ్యాయి. వీటిని వెంటనే భర్తీ చేయాలని కోరినా ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఈ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది పరిస్థితీ అయోమయంగా మారింది. వీళ్లను క్రమబద్థీకరించాల్సి ఉన్నా సాకులు చూపి సర్కార్ తప్పించుకుంటోందని ఆయా విభాగాల సిబ్బందే వాపోతున్నారు.
 
 ‘గోపాలమిత్ర’లే ఆధారం
 కృత్రిమ గర్భోత్పత్తి, ప్రాథమిక చికిత్స కోసం పశువైద్యశాలలు లేనిచోట ప్రభుత్వం ‘గోపాలమిత్ర’ను ప్రవేశపెట్టింది. అధికారులు, సిబ్బంది సలహా మేరకు అనుభవం ఉన్న ప్రైవేట్ సిబ్బందే పశువులకు వైద్యం చేయడం ఈ పథక ముఖ్య ఉద్దేశం. సదుపాయాలు లేని చోట్ల పశువులకు వైద్యం అందించి తద్వారా గౌరవ వేతనం పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పశు సంవర్థక శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడంతో చాలా ప్రాంతాల్లో  ‘గోపాలమిత్ర’లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది.  
 
 ఇవీ ఇబ్బందులు
   జేడీ పోస్టులో ఇతర జిల్లాలకు చెందిన, రిటైర్‌మెంట్‌కు దగ్గర్లో ఉన్న వారిని నియమించడంతో అభివృద్ధిపై దృష్టి సారించడం లేదు.
   జిల్లాలో 21 వెటర్నరీ లైవ్‌స్టాక్ ఆఫీసర్ల(వీఎల్‌ఎస్‌వో)కు గాను ఐదుగురే ఉన్నారు.
   41 జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ పోస్టులకు గాను 28 మందే ఉన్నారు.   
   64 లైవ్‌స్టాక్ ఆఫీసర్లకు గాను 61మందే ఉన్నారు.  
   57 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులుండగా ప్రస్తుతం 13మందే ఉన్నారు.
   ఉన్న ఒక్క ల్యాబ్ అసిస్టెంట్ పోస్టు కూడా ఖాళీగానే ఉంది.
   13 వీవీఏ పోస్టులకు గాను ఐదుగురే విధులు నిర్వహిస్తున్నారు.  
   రెండు ఎన్యూమరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.   
   164 అటెండర్ పోస్టులుండగా 113 మందే ఉన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement