వివాహిత అనుమానాస్పద మృతి | Suspicious death married woman | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Published Sun, Apr 3 2016 12:48 AM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM

Suspicious death  married woman

 కాకినాడ రూరల్ : అనుమానాస్పద పరిస్థితుల్లో ఓ వివాహిత మరణించింది. ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు అత్తింటివారు చెబుతుండగా, తమ కుమార్తెను హతమార్చి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పుట్టింటివారు ఆరోపించారు. మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ అమీనాబాద్‌కు చెందిన అన్నవరపు రమణ, రత్నం దంపతుల కుమారై వెంకటలక్ష్మి(24)ని, కాకినాడలోని ప్రతాప్‌నగర్ టీచర్స్‌కాలనీకి చెందిన పెయింటింగ్ వర్కర్ కాదులూరి శివకుమార్‌కు ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు.
 
 రూ.2 లక్షల కట్నం, బంగారు ఆభరణాలు, మరో రూ.40 వేలు ఆడపడుచు కట్నంగా ఇచ్చారు. కొంతకాలం వారి కాపురం బాగానే ఉంది. మరికొంత కట్నం తెమ్మని ఆడపడుచు, అత్తగారితో కలసి శివకుమార్ తన భార్యను వేధించాడు. ఈ విషయాలను వెంకటలక్ష్మి తన తల్లిదండ్రులకు చెప్పేది. ఈ క్రమంలో వారు ఇటీవల రూ.40 వేలు శివకుమార్‌కు ఇచ్చారు. కాగా శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో శివకుమార్ ఫోన్ చేసి, వెంకటలక్ష్మి బాత్రూంలో పడిపోయి చనిపోయిందని ఒకసారి, ఉరి వేసుకుని చనిపోయిందని మరోసారి ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు.
 
 వారు అక్కడకు చేరుకునే సరికి మృతదేహాన్ని ఇంటి బయట పడుకోబెట్టారు. మృతదేహంపై గాయాలు, పీక నొక్కినట్టు గుర్తులు ఉన్నాయి. సంఘటన స్థలాన్ని ఎస్సై తిరుపతి పరిశీలించారు. రమణ ఫిర్యాదు మేరకు ఇంద్రపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement