సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ (ఎస్వీబీసీ)లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిస్తామని, ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎస్వీబీసీ చైర్మన్, నటుడు పృథ్వీరాజ్ తెలిపారు. ఎస్వీబీసీ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా ఆయన ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. గతంలో రాఘవేందర్‌రావుతోపాటు పలువురు ఎస్వీబీసీ చైర్మన్లుగా ఉన్నారని, వారి హయాంలో ఏమైనా అక్రమాలు జరిగితే.. విచారణ తప్పదని పృథ్వీ స్పష్టం చేశారు. శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఆయన ప్రకటించారు. ఎస్వీబీసీ కోసం నిబద్ధతతో పనిచేస్తానని, రాఘవేందర్‌రావుతో ఈ విషయంలో తనకు ఎలాంటి పోటీలేదని తెలిపారు. ఎస్వీబీసీ చైర్మన్ అయ్యాక చిత్ర పరిశ్రమలో తనపై కక్షసాధింపులు మొదలయ్యాయని, సినిమాల కోసం తనకు ఇచ్చిన అడ్వాన్స్‌లు కొంతమంది వెనక్కి తీసుకున్నారని పృథ్వీరాజ్ వెల్లడించారు.
ఈ పదవి రావడం పూర్వజన్మ సుకృతం
ఎస్వీబీసీ చైర్మన్‌గా నియమితులవ్వడం తన పూర్వజన్మ సుకృతమని పృథ్వీరాజ్ ఆనందం వ్యక్తం చేశారు. శ్రీవారికి ఇలా సేవ చేసుకుంటానని తాను కలలో కూడా అనుకోలేదని పేర్కొన్నారు. జులై 28వ తేదీన ఎస్వీబీసీ చైర్మన్‌గా పదవీ స్వీకారా ప్రమాణం చేశానని తెలిపారు. తెలుగు చిత్రపరిశ్రమకు ఎప్పటికీ రుణ పడి ఉంటానని తెలిపారు. ఎస్వీబీసీ చానల్ ఆధ్యాత్మికతను కాపాడుతానని, చానెల్‌ను దేశంలో నంబర్ వన్ చానల్‌గా చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎస్వీబీసీ చానెల్‌ను నిబద్ధతతో నడిపిస్తానని తెలిపారు. ఈ పదవి తనకు అప్పగించినందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సినీ పరిశ్రమకు చెందిన పోసాని కృష్ణమురళి తనకు అన్నయ్య లాంటి వారని అన్నారు. పోసాని నిజాయితీ గల వ్యక్తి అని కొనియాడారు.
తిరుమలలో రాజకీయాలు మాట్లాడను!
ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలలో రాజకీయాలు మాట్లాడనని, అమరావతిలోనే రాజకీయాలు మాట్లాడుతానని ఈ సందర్భంగా పృథ్వీరాజ్ స్పష్టం చేశారు. ఎస్వీబీసీ చైర్మన్‌గా రాజకీయలకు అతీతంగా పనిచేస్తానని, భక్తుల మనోభావాలను కాపాడుతానని తెలిపారు. నటుడు శివాజీ చంద్రబాబుకు భజన చేశాడని, ఆయనకు మాట మీద నిలకడ లేదని పేర్కొన్నారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీ వైస్సార్‌సీపీ అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment