
తిరుపతి సెంట్రల్/సాక్షి, హైదరాబాద్: శ్రీవేంకటేశ్వర భక్తి చానల్(ఎస్వీబీసీ) చైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. ఓ మహిళతో పృథ్వీరాజ్ అసభ్యంగా మాట్లాడినట్లు కొన్ని ప్రసార మాధ్యమాల్లో ఆడియో ప్రసారాలు రావడంతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెంటనే స్పందించి, ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. సదరు ఆడియో టేపుల్లోని వాయిస్ శాంపిల్‌ను టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
ఈ విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పరమ పవిత్రమైన తిరుమల తిరుపతిలో అనుచిత ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. శ్రీవారి క్షేత్రం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. పృథ్వీరాజ్‌ను రాజీనామా చేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్లు తెలిసింది.
తప్పు చేశానని తెలిస్తే చెప్పుతో కొట్టండి: పృథ్వీ
తనపై వచ్చిన ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదని ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన పృథ్వీ చెప్పారు. తప్పు చేశానని తెలిస్తే తన చెప్పుతో తనను కొట్టండని అన్నారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. మహిళా ఉద్యోగితో తాను అసభ్యంగా మాట్లాడినట్టుగా ప్రచారమవుతున్న ఆడియోలో వాయిస్ తనది కాదన్నారు. శ్రీవారిపై ఒట్టేసి చెపుతున్నానని, తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు.
రాజకీయాల్లో తన వాయిస్ లేకుండా చేయాలనే ఇంత పెద్ద కుట్రపన్నారని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలపై తానే విజిలెన్స్ విచారణ వేసుకున్నట్టు చెప్పారు. వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాలకు కట్టుబడి, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గౌరవించి తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజధాని రైతులను ఉద్దేశించి తాను పెయిడ్ ఆర్టిస్టులని అనలేదన్నారు. తన వ్యాఖ్యలు రైతుల మనస్సులను నొప్పించి ఉంటే క్షమాపణ చెçపుతున్నానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment