డిగ్రీ అందుకుంటున్న విద్యార్థిని
యూనివర్సిటీ క్యాంపస్ : మూడేళ్ల తర్వాత నిర్వహించిన ఎస్యీయూ స్నాతకోత్సవం సంప్రదాయ బద్ధంగా సాగింది. స్నాతకోత్సవానికి ఇస్రో చైర్మన్ శివన్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఎస్వీయూ వీసీ దామోదరం, రెక్టార్ జానకి రామయ్య, రిజిస్ట్రార్ అనురాధ, పాలక మండలి సభ్యులు, ఫ్యాకల్టీ డీన్ల సమక్షంలో ఈ స్నాతకోత్సవం వేడుకగా సాగింది. స్నాతకోత్సవానికి గవర్నర్ నరసింహన్ హజరు కాకపోవడంతో ఎస్వీయూ వీసీ దామోదరం చాన్సలర్ హోదాలో ఇస్రో చైర్మన్ కే.శివన్‌కు గౌరవ డాక్టరేట్ అందజేశారు. అనంతరం పీహెచ్‌డీ, ఎంఫిల్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఏ తదితర డిగ్రీలను ప్రదానం చేశారు. తరువాత వివిధ సబ్జెక్ట్‌లలో టాపర్‌లుగా నిలిచిన వారికి బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఇస్రో చైర్మన్ స్నాతకోపన్యాసంతో ఈ వేడుక ముగిసింది. ఈ కార్యక్రమం పూర్తి కాగానే డిగ్రీలు పొందిన విద్యార్థులు అనందంతో గడిపారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని సంబరాలు చేసుకున్నారు.
ఎస్వీయూతో ఎంతో అనుబంధం
ఎస్వీయూతో ఇస్రోకు ఎంతో అనుబంధం ఉందని ఇస్రో చైర్మన్ కే.శివన్ అన్నారు. ఎస్వీయూ నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించిన అనంతరం ఆయన స్నాతకోపన్యాసం చేశారు. ఎస్వీయూ ఎంతో పురోగతి సాధించడంతో పాటు విజ్ఞానాన్ని పంచుతుందన్నారు. దక్షిణ భారతదేశంలోనే ఎస్వీయూ విశిష్టస్థానం దక్కించుకుందన్నారు. ఎస్వీయూ గొప్ప వ్యక్తులను సమాజానికి అందించిందన్నారు. స్నాతకోత్సవంలో డిగ్రీలు పొందిన విద్యార్థుల కళ్లలో కాంతులు కనిపిస్తున్నాయన్నారు. డిగ్రీలు పొందిన వారు ఉన్నత లక్ష్యాలను చేరుకుని యూనివర్సిటీ ప్రతిష్ట పెంచడంతో పాటు దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలన్నారు.
నూతన ఆలోచనలు, సృజన్మాతకత కలిగిన వారికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. దేశ అభివృద్ధికి, వ్యక్తిగత, కుటుంబ అభివృద్ధికి అవసరమైన వేయి మార్గాలు విద్యార్థుల ఎదుట ఉన్నాయన్నారు. సరైన మార్గాన్ని ఎంచుకొని విజయం సాధించాలని పిలుపునిచ్చారు. సృజనాత్మకత, నూతన ఆలోచన ధోరణి విద్యార్థులను ఉన్నత స్థానానికి చేర్చుతుందన్నారు. దేశం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ ఇంకా పేదరికం, ఆకలి, ఆనారోగ్యం, నీటి కొరత, నిరుద్యోగం తదితర సమస్యలు ఉన్నాయన్నారు. ఈ సమస్యల పరిష్కారం దిశగా పరిశోధనలు సాగాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధి దిశగా ఎస్వీయూ
ఎస్వీయూనివర్సిటీ మూడేళ్లుగా ఎంతో పురోగతి సాధించిందని వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ దామోదరం చెప్పారు. ఎస్వీయూ నాక్‌లో ఏ ప్లస్ గ్రేడ్‌తో పాటు యూజీసీ కేటగిరి–1 అటానమస్ హోదా పొందిందన్నారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి ఎస్వీయూ మంచి ర్యాంకులు సాధించిందన్నారు. వర్సిటీలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు తీసుకొచ్చామన్నారు. కొత్త కోర్సులు, నూతన పరిశోధనలతో వర్సిటీని ముందుకు తీసుకెళున్నామన్నారు.
1,128 మందికి డిగ్రీలు
ఎస్వీయూలో శనివారం నిర్వహించిన 55వ స్నాతకోత్సవం సందర్భంగా 1,128 మందికి డిగ్రీలు ప్రదానం చేశారు. డిగ్రీలు పొందిన వారిలో 151 మంది పీహెచ్‌డీ, 1 ఎంఫిల్, 976 మంది పీజీ డిగ్రీలు పొందారు. వీరు కాకుండా ఇన్ అడ్వాన్స్ రూపంలో 21,094 మంది, ఇన్ ఆబ్సెన్సియా రూపంలో 4,109 మంది డిగ్రీలు పొందారు.
65 మందికి బంగారు పతకాలు
స్నాతకోత్సవంలో 65 మందికి బంగారు పతకాలు ప్రదానం చేశారు. పసిడి పతకాలు పొందిన వారిలో పూర్ణ చంద్రిక, ముకుందవల్లి, సునీత (గణితం), భాస్కర్, యామిని(రసాయన శాస్త్రం), లీలాకుమారి(బయోటెక్నాలజీ), సాయి వైష్ణవి(బాటనీ), శ్వేత, హేమలత(కంప్యూటర్ సైన్స్), చరణ్‌కుమార్ రెడ్డి(జాగ్రఫీ), వైష్ణవి, భారతి(హోంసైన్స్), నాగేంద్ర, సరిత, రాము, గురవమ్మ, (ఫిజిక్స్), రెడ్డమ్మ(సైకాలజీ), స్వప్న (స్టాటిస్టిక్స్), భార్గవి(జువాలజీ), మోహన్ కృష్ణ( ఎకనామిక్స్), అశోక పుత్ర(ఇంగ్లిషు), సుధాకర్(హిందీ), శివకేశవర్ధన్(ఫిలాసపీ), చిన్ని(పబ్లిక్ అడ్మినిస్ట్రేçషన్), సురేఖ(పొలిటికల్ సైన్స్), వీరమణి(సంస్కృతం),సురేష్(సోషియాలజీ), వెంకటేశు, సురేఖ(తెలుగు), వడివేలు(తమిళం), గుణశేఖర్, మైర్‌టేల్(కామర్స్), సౌజన్య(లా), రామరెడ్డి(బీఎల్‌ఐసీ), జెస్సీ ప్రశాంతి (సోషియాలజీ) ఉన్నారు. స్నాతకోత్సవంలో పాలకమండలి సభ్యులు గురుప్రసాద్, సిద్ధముని, హరి, ఫ్యాకల్టీ డీన్‌లు సవరయ్య, త్యాగరాజు, మల్లికార్జున, కుమారస్వామి, బాలాజీ ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment