జిల్లాకు పాకిన స్వైన్‌ఫ్లూ | swine flu attracted to district | Sakshi
Sakshi News home page

జిల్లాకు పాకిన స్వైన్‌ఫ్లూ

Published Thu, Jan 29 2015 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM

జిల్లాకు పాకిన  స్వైన్‌ఫ్లూ

జిల్లాకు పాకిన స్వైన్‌ఫ్లూ

అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ
హెల్ప్‌లైన్ నంబరు ఏర్పాటు
రాష్ట్ర మంత్రి, కమిషనరు ఆరా

 
హైదరాబాద్‌ను వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ జిల్లాకు కూడా వ్యాపించింది. పుంగనూరులో ఓ వ్యక్తి స్వైన్‌ఫ్లూ బారినపడి బెంగళూరులోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా  తిరుపతిలోని 71 ఏళ్ల  వృద్ధురాలికి స్వైన్‌ఫ్లూ సోకిందని మంగళవారం నిర్ధారణ అయింది. రుయాలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు పరీక్షల నిమిత్తం బుధవారం శాంపిల్స్‌ను హైదరాబాద్‌కు పంపారు. మరో ముగ్గురు అనుమానంతో రుయాలో చేరారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్ర కమిషనరు అగర్వాల్ డీఎంఅండ్‌హెచ్‌వో కోటీశ్వరితో ఫోన్లో ఆరా తీశారు. మరోవైపు స్వైన్‌ఫ్లూ నుంచి ప్రజల్ని అప్రమత్తం చేయడానికి వైద్యారోగ్యశాఖ 24 గంటలూ పనిచేసే హెల్ప్‌లైన్ నంబర్‌ను బుధవారం ప్రారంభించింది. ఎలాంటి సమస్య ఉన్నా 9849902379 నంబరుకు ఫోన్ చేయాలని అధికారులు పేర్కొన్నారు.
 
చిత్తూరు (అర్బన్)/తిరుపతి కార్పొరేషన్: మొన్న పుంగనూరు వాసి, నిన్న తిరుపతికి చెందిన వృద్ధురాలికి స్వైన్ ఫ్లూ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. బుధవారం మరో వ్యక్తి లక్షణాలున్నట్టు తెలియడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు.
 
భద్రాచలం పర్యటనతోనేనా?

తిరుపతిలో స్వైన్‌ఫ్లూ బారిన పడ్డ వృద్ధురాలు రెండు వారాల క్రితం భద్రాచలం విహారయాత్రకు వెళ్లారు. ఆమెతో పాటు 40 మంది కూడా టూర్ ఏజెన్సీ ద్వారా వెళ్లిన వారిలో ఉన్నారు. ఆమెకు స్వైన్‌ఫ్లూ లక్షణాలు గుర్తించిన ఆమె కుమారుడు (ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకుడు) తన ఆస్పత్రిలోనే చికిత చేశాడు. మెరుగుపడకపోవడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు  తెలుసుకుంటున్నారు. అయితే టూర్‌కు వెళ్లిన 40మందిలో ఎవరికైనా స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నాయా? లేదా? అని తెలుసుకోడానికి చర్యలు ప్రారంభించారు. వృద్ధురాలి కుటుంబంలోని 17 మందికి కూడా వైద్య పరీక్షలు చేశారు. వీళ్లందరి ఆరోగ్య పరిస్థితిపై ఓ వైద్య బృందం ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది.
 
స్వైన్‌ఫ్లూ లక్షణాలు
 
శీతాకాలంలో మంచు ఎక్కువగా పడుతున్నప్పుడు హెచ్1,ఎన్1 అనే వైరస్ వల్ల స్వైన్ ఫ్లూ వ్యాపిస్తుంది. సాధారణంగా మామూలు ఫ్లూ (వైరస్) లాగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. జలుబు, దగ్గు, జ్వరం తలనొప్పి, భయంకరమైన ఒల్లు నొప్పులు పట్టి పీడిస్తాయి. ఆయాసం ఎక్కువగా ఉండి ఇబ్బందికరంగా మారుతుంది. ఈ లక్షణాలు ఉంటే స్వైన్ ఫ్లూగా అనుమానించాల్సి ఉంటుంది. వీరు తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందాలి. ఈ లక్షణాలు వుంటే ఆ వ్యక్తి గొంతు నుంచి స్వాబ్ కలెక్ట్ చేసి హైదరాబాద్‌లోని ఐపీఎం ఇన్‌స్టిట్యూట్‌కి పంపిస్తారు. అక్కడ ఆధునిక పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ  చేసి, స్వైన్ ఫ్లూ వైరస్‌ను గుర్తిస్తారు. సకాలంలో వైరస్‌ను గుర్తించకపోతే అది లివర్‌పై దాడిచేసి, శరీరంలోని మిగిలిన అవయవాలను చిన్నాభిన్నం చేస్తుంది.
 
చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్త


చిన్న పిల్లలూ, వృద్ధులకు వ్యాధి నిరోధిక శక్తి తక్కువగా ఉంటుంది. మంచు ఎక్కువగా కురుస్తూ, గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు స్వైన్ ఫ్లూ కారక వైరస్ వ్యాపిస్తుంది. మధుమేహం (షుగర్), హెచ్‌ఐవి సోకిన వారు ముందుజాగ్రత్తలు తీసుకుని ఈ వైరస్ బారినుంచి తప్పించుకోవచ్చు. ఏసీ బస్సులు, రైళ్లలో ప్రయాణం చేయవద్దని, సంతలు, జాతరలు, తిరునాళ్లు ఉన్న చోట్ల గుంపులు ఉన్న చో టికి వెళ్లకూడదు. ఏసీ సినిమా హాళ్లలోకి మాస్కులు లేకుండా వెళ్లకూడదని వైద్యులు చెబుతున్నారు.
 
నివారణ మార్గాలు

స్వైన్‌ఫ్లూ వ్యాధి అనుమానితులకు దూరంగా ఉండటం, ఫ్లూ ఉన్న వారు విధిగా ఎన్-95 మాస్కులు ధరించాలి. తుమ్మినా, దగ్గినా, ముక్కు చీదిన ప్రతిసారీ చేతులను సబ్బుతో శుభ్రపరుచుకోవాల్సి ఉంది. గుంపులుగా ఉన్న చోటకు వెళ్లకూడదు. వాతావరణంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ సమయం గడపాలి. సాధారణంగా 28 నుంచి 30 సెల్సియస్ డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలుంటే గాలిలోనే వైరస్ నశిస్తాయి.
 
భయపడాల్సిన పనిలేదు

 స్వైన్ ఫ్లూ వైరస్ సోకినంత మాత్రాన భయపడాల్సిన పనిలేదు. లక్షణాలను ముందుగానే పసిగట్టి వైద్యుల పర్యవేక్షణలో వైద్య సేవలు పొందితే వారంలోగా వ్యాధిని నయం చేసుకోవచ్చు. సాధారణ వైరస్‌లలో స్వైన్ ఫ్లూ వైరస్ కూడా ఒక్కటి మాత్రమే. కాకుంటే వ్యాధి నిరోధక శక్తి అతితక్కువగా ఉన్న వ్యక్తులకు మాత్రమే ఇది సోకుతుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. తిరుమల సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉండటం, చెట్లు అధిక సంఖ్యలో ఉండటం వల్ల ఈప్రాంతంలో స్వైన్‌ఫ్లూ వంటి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు అతి తక్కువ. అదేవిధంగా తిరుపతిలో అధిక ఉష్ణాగ్రత ఉండడం వల్ల కూడా వైరస్ వ్యాప్తి తక్కువే.
 - జి. రమేష్, ప్రొఫెసర్
 
అందుబాటులో వైద్య సేవలు

 తిరుపతి రుయా ఆసుపత్రిలో పది పడకల ప్రత్యేక వార్డు, నాలుగు బెడ్లు, వెంటి లేటర్లతో కూడిన ఒక ప్రత్యేక ఐసీయూ విభాగాన్ని సిద్దంగా ఉంచాం. స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఎవరైనా వస్తే వారికి వైద్య సేవలు అందించేందుకు అన్ని విధాలా ఏర్పాట్లు చేశాం. టామ్ ఫ్లూ మందు బిల్లలు 100, టెస్టింగ్ కిట్లు 50 చొప్పున సిద్ధంగా ఉన్నాయి. మాస్కుల కొరత ఉంది. జిల్లా వైద్యాధికారులకు సమాచారం అందించాం. ఎవరైనా పై లక్షణాలు కనిపిస్తే తక్షణమే రుయాలోని ఐడీహెచ్ విభాగం, స్వైన్ ఫ్లూ వార్డులో వైద్య సేవలు పొందాలి.
 - కయ్యల చంద్రయ్య, సివిల్‌సర్జన్,  
 ఆర్‌ఎంవో, రుయా ఆసుపత్రి తిరుపతి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement