స్వైన్‌ఫ్లూకు మరొకరి బలి | Swine flu victim of someone else's | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూకు మరొకరి బలి

Published Sun, Jan 25 2015 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

స్వైన్‌ఫ్లూకు మరొకరి బలి

స్వైన్‌ఫ్లూకు మరొకరి బలి

  • గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నల్లగొండ జిల్లావాసి మృతి
  • ఆదిలాబాద్‌లో ఒకే కుటుంబంలో ఆరుగురికి వైరస్ లక్షణాలు వరంగల్‌లో బయటపడ్డ రెండో కేసు!
  • సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మహమ్మారి విజృంభిస్తోంది. చాపకింద నీరులా చేరి రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్‌బారినపడి 21 మంది మృత్యువాతపడగా తాజాగా మరొకరు స్వైన్‌ఫ్లూ కారణంగా మరణించారు. కొన్ని రోజులుగా స్వైన్‌ఫ్లూ లక్షణాలతో నల్లగొండ జిల్లా మోతేమండలం ఎదురాపురం గ్రామానికి చెందిన ఎం. శ్రీనివాస్ (40) శనివారం సాయంత్రం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.  

    హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సూర్యాపేటకు చెందిన నర్మద అనే మహిళకు పుట్టిన 20 రోజుల పసిపాపకు స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా తేలింది. ఉస్మానియాలో ఇప్పటికే నాలుగు పాజిటివ్ కేసులు ఉండగా, మరో 19 మందిని స్వైన్‌ఫ్లూ అనుమానంపై చేర్చుకున్నారు. నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో ప్రస్తుతం ముగ్గురు పాజిటివ్ బాధితులకు చికిత్స అందిస్తుండగా, మరో 61 మంది అనుమానితుల నుంచి నమూనాలు సేకరించారు.  

    తెలంగాణవ్యాప్తంగా ఇప్పటి వరకు 893 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా 299 మందికి హెచ్1ఎన్1 వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 21 మంది మృతిచెందారు. కాగా, ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలోని విద్యానగర్‌కు చెందిన ఒకే కుటుంబంలో ఆరుగురికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించాయి. ఇక వరంగల్‌లో రెండో స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసు శనివారం నమోదైంది. ఎంజీఎం ఆస్పత్రిలో జ్వరం, జలుబు, శ్వాసకోశ ఇబ్బందులకు చికిత్స పొందుతున్న తానోజా అనే రోగి నమూనాలను సేకరించి స్వైన్‌ఫ్లూ వ్యాధి నిర్ధారణ కోసం హైదరాబాద్ పంపారు.

    నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెంలో ఓ బాలిక (3) స్వైన్‌ఫ్లూ వ్యాధి బారిన పడినట్టు సమాచారం.  పరీక్షించిన వైద్యులు.. బాలికకు స్వైన్‌ఫ్ల్లూ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు అనుమానించడంతో భయపడిన బాలిక తల్లిదండ్రులు ఈ నెల 21 సొంతూరుకు వెళ్లిపోయారు. దీంతో గాంధీ ఆస్పత్రి వైద్యులు నల్లగొండ జిల్లా వైద్యాధికారి ఆమోస్‌కు ఫోన్ ద్వారా విషయం తెలిపారు. ఆయన సూచన మేరకు ఆమెను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

    స్వైన్‌ఫ్లూపై సురేష్‌చందా సమీక్ష

    హైదరాబాద్: స్వైన్‌ఫ్లూపై శనివారం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా అధికారులతో సమీక్ష చేశారు. అనంతరం ఆయన గాంధీ ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. కాగా, స్వైన్‌ప్లూపై సమాచారం తెలుసుకోవడం, ఇవ్వడం కోసం 104 నంబర్‌ను అమల్లోకి తెచ్చి రెండు రోజులైనా ఆ కేంద్రం సరిగ్గా స్పందించడం లేదు. ‘సాక్షి’ ప్రతినిధి ఆ నంబర్‌కు ఫోన్ చేసి స్వైన్‌ప్లూపై సమాచారం కోరగా... ఎవరూ స్పందించలేదు. పది నిమిషాలు లైన్‌లో ఉంచి, తర్వాత ఫోన్ కట్ చేశారు.
     
    299 మందికి స్వైన్ ఫ్లూ!
    నిమ్స్ డెరైక్టర్ నరేంద్రనాథ్ వెల్లడి

    రాష్ట్రవ్యాప్తంగా 893 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా... 299 మందిలో స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నట్లుగా నిర్ధారణ అయిందని నిమ్స్ డెరైక్టర్ నరేంద్రనాథ్ శనివారం తెలిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు స్వైన్‌ఫ్లూ బారిన పడి మరణించిన వారి సంఖ్య 12 మంది అని చెప్పారు. శుక్ర, శనివారాల్లో మరో 100మందికి సంబంధించిన శాంపిల్స్‌ను పరీక్షల కోసం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)కు పంపామని చెప్పారు. స్వైన్‌ఫ్లూ వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. వైరస్ సోకిన వారికి అత్యవసర సేవలు అందించేందుకు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రుల్లో 150 పడకలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. 20 వేల స్వైన్‌ఫ్లూ ట్రీట్‌మెంట్ ట్యాబ్లెట్లను అన్ని జిల్లాల్లోని ఆసుపత్రులకు పంపిణీ చేశామని నరేంద్రనాథ్ తెలిపారు. సాధారణ వ్యాక్సిన్లు స్వైన్‌ఫ్లూ వైరస్‌కు పనిచేయవని... ఖర్చు భరించి స్వైన్‌ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వారు వైద్య నిపుణుల సలహా తీసుకోవాలని సూచించారు.
     
    స్వైన్‌ఫ్లూను హోమియోతో అరికట్టవచ్చు
    సచివాలయ వైద్యాధికారి విష్ణుమూర్తి

    స్వైన్‌ఫ్లూ వైరస్ సోకకుండా ముందస్తుగా హోమియో (ఆర్సెనిక్ ఆల్బ్ 30) మాత్రలు తీసుకోవడం మంచిదని సచివాలయ హోమియో డిస్పెన్సరీ వైద్యాధికారి విష్ణుమూర్తి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వైన్‌ఫ్లూను అరికట్టగలిగే శక్తి హోమియో మాత్రలకు ఉందని పలు జాతీయ పరిశోధన సంస్థలు స్పష్టం చేశాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement