నెల్లూరులో స్వైన్‌ఫ్లూ కేసు నమోదు
నెల్లూరు (అర్బన్): నెల్లూరు నగరంలో మరో స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది. డీఎంహెచ్‌ఓ కార్యాలయ అధికారుల వివరాల ప్రకారం... లక్ష్మీపురానికి చెందిన ఓ మహిళ (43) ఈనెల 19న తీవ్ర జలుబు, జ్వరంతో బాధపడుతూ నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులు స్వైన్‌ఫ్లూ అనుమానంతో పరీక్షలు చేయించారు. 22న పరీక్షల్లో ఆమెకు స్వైన్‌ఫ్లూ ఉందని నిర్ధారణ అయింది. అయితే ఆమె ఆసుపత్రిలో చేరలేదు. ఇంటి వద్దే ఉంటూ చికిత్స తీసుకుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగ్గానే ఉందని అధికారులు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే ఐదు కేసులు నమోదు కాగా ఇది ఆరో కేసు. ఇంటి వద్దే ఉంటున్న ఆమెను మంగళవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయ అధికారులు శ్యాంసన్‌బాబు, మురళీకృష్ణ, వరప్రసాద్, శివరామకృష్ణలు పరామర్శించారు. చుట్టుపక్కల వారికి ఫ్లూ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.