సాక్షి,నెల్లూరు: తెలంగాణా నోట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో సింహపురి ప్రజలు ఒక్కసారి గా భగ్గుమన్నారు. జూలై 30న సీడబ్ల్యూసీ చేసిన తీర్మానం మేరకే రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిందన్న వార్తలను టీవీల్లో చూసిన జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఆగ్రహావేశాలతో వీధుల్లోకి వచ్చారు. జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు. కాంగ్రెస్ అధిష్టానంపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజనకు కారణమైన తెలుగుదేశం పార్టీపై మరింత ఆగ్రహం చెందారు. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రత్యక్ష ఆందోళనకు దిగాయి. నెల్లూరురూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు స్థానిక ఆర్టీసీ బస్టాండువద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు తాటి వెంకటేశ్వర్లు, నరసింహయ్యముదిరాజ్, మందా బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ సిటీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ నేతృత్వంలో స్థానిక గాంధీబొమ్మసెంటర్‌లో తొలుత దీపపు బెలూన్లను వదిలి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు టైర్లను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముక్కాల ద్వారకానాధ్, లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, రూప్‌కుమార్‌యాదవ్, సంక్రాంతి కల్యాణ్, బార్ల వెంకటేశ్వర్లు, ముప్పసాని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కావలిలో పార్టీ శ్రేణులు వీధుల్లోకి వచ్చిన సోనియా దిష్టిబొమ్మను దగ్దం చేశారు.
ఉదయగిరిలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు సీమాంధ్ర మంత్రుల చిత్రపటాలను దగ్దం చేశారు. దుత్తలూరులో పార్టీ శ్రేణులు సోనియా దిష్టిబొమ్మను దగ్దం చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో వైఎస్సార్‌సీపీ శ్రేణులతోపాటు సమైక్యవాదులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి సోనియా దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. నగరంలోని వేదాయపాళెం రైల్వే స్టేషన్, కల్లూరుపల్లి సిగ్నల్‌పాయింట్ నడుమ రాత్రి గూడ్స్ రైళ్లను ఆందోళనకారులు అడ్డుకున్నారు. చెన్నై వైపు వెళ్తున్న రైలుకు గుర్తు తెలియని వ్యక్తులు ఎర్రజెండా చూపించి రైలును నిలిపివేశారు. చెన్నై నుంచి వస్తున్న మరో గూడ్స్ రైలును ఆందోళనకారులు నిలిపివేశారు. రైళ్లు నిలిచిన విషయం ఆలస్యంగా తెలుసుకున్న రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సిగ్నల్ ఇచ్చి రాకపోకలను పునరుద్దరించారు. ఎర్రజెండా ఊపి రైళ్లను నిలిపిన ఆందోళన కారులు మాత్రం రైల్వేపోలీసులు, అధికారులు వచ్చి అడ్డుకున్నారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో సమైక్యవాదులు హోరెత్తించారు.
నిరసన దీక్షలు ఆపి ఉద్యమంలో పాల్గొనండి
- శ్రేణులకు వైఎస్సార్‌సీపీ అధిష్టానం పిలుపు
రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో తక్షణం బుధవారం నుంచి జరుగుతున్న ఆమరణ నిరాహారదీక్షలను విరమించుకొని శుక్రవారం జరగబోయే 72గంటల బంద్‌లో పాల్గొనాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం సూచించడంతో రెండు రోజులుగా నిరాహారదీక్షల్లో ఉన్న పార్టీ సమన్వయకర్తలు గురువారం అర్థరాత్రి 11 గంటల ప్రాం తంలో ఆమరణ నిరాహారదీక్షలను విరమించారు. అయితే నిరాహారదీక్షల స్థానంలో పార్టీ కార్యకర్తలు రిలేనిరాహారదీక్షలు కొనసాగిస్తారని పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీ గురువారం రాత్రికి సాక్షికి తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సమైక్యాంధ్రకోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్న నేపథ్యంలో 72గంటల బంద్‌ను విజయవంతం చేయడంకోసం సమన్వయకర్తలతోపాటు పార్టీ శ్రేణులు కృషి చేస్తాయని ఆయన తెలిపారు.
అధిష్టానం పిలుపుతో నెల్లూరు రూరల్ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సిటీ నియోజకవర్గ సమన్వయకర్త అనిల్‌కుమార్‌యాదవ్ దీక్షను విరమించారు. కోటంరెడ్డికి పార్టీ కన్వీనర్ మేరిగ మురళీధర్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అలాగే పార్టీ సమన్వయకర్త సీఈసీ సభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డితోపాటు అన్ని నియోజకవర్గాలకు చెందిన ముఖ్యనేతలు దీక్షను విరమించారు.
టీ-నోట్ ఆమోదంపై ఆగ్రహ జ్వాలలు
Published Fri, Oct 4 2013 4:17 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement