
ఆర్‌ఐ సాయి ప్రియాంక , తహసీల్దారు షేక్ బషీర్
కొడవలూరు: కొడవలూరు మండల తహసీల్దార్ షేక్ బషీర్, ఆర్‌ఐ మాతవోలు సాయి ప్రియాంకను సస్పెండ్ చేస్తూ మంగళవారం కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. విచారణలో అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కొడవలూరు మండలంలోని కమ్మపాళెం మజరా సంజీవనగర్‌కు చెందిన బెల్లంకొండ రమేష్ కుటుంబానికి గ్రామంలో 20 ఎకరాల చుక్కల భూమి ఉంది. కుటుంబ అవసరాల కోసం అప్పులు పాలైన రమేష్ ఆ భూమిని అమ్మాలని నిర్ణయించుకున్నారు. అయితే చుక్కల భూమి కావడంతో ఆ భూమి ధర పలకలేదు. ఈ క్రమంలో భూమికి సంబంధించి రికార్డుల్లో చుక్కలను తొలగింపజేసుకుని మంచి ధరకు అమ్ముకోవాలని భావించిన రమేష్ స్థానిక తహసీల్దార్ బషీర్‌ను కలసి ధర కుదుర్చుకున్నారు. రూ.లక్ష లంచంగా ఇస్తే చుక్కలు తొలగించి భూమికి క్లియరెన్స్ ఇవ్వడం ఆ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా బాధితుడు రమేష్ రూ.లక్ష నగదు చెల్లించారు. అయితే పని పూర్తి చేయకుండానే మరో లక్ష డిమాండ్ చేసినట్లు బాధితుడు తెలిపారు.
అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న రమేష్ మరో రూ.లక్ష చెల్లించుకోవడం తనవల్ల కాదని భావించి గత నెల 25న స్థానిక మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సమక్షంలో తహసీల్దార్‌ను నిలదీశారు. తన భూమికి చుక్కలు తీసి ఇవ్వలేకుంటే రూ.లక్ష తిరిగి ఇచ్చేయాలని మరో రూ.లక్ష తెచ్చివ్విడం నావల్ల కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు తిరిగి ఇవ్వకపోతే కార్యాలయం ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం సాక్షిలో ‘చుక్కలు తీయకుంటే డబ్బు ఇచ్చేయ్’ శీర్షికన వార్త ప్రచురితమైంది. ఈ వార్త ప్రచురితమైన సాక్షి పత్రికను వెంటబెట్టుకుని మరుసటిరోజున రమేష్ వారి కుటుంబ సభ్యులతో కలసి కలెక్టర్‌కు జరిగిన విషయాన్ని వివరించారు. తాను ఇచ్చిన లక్షలో ఆర్‌ఐ, తహసీల్దార్లు రూ.50 వేల వంతున తన సమక్షంలోనే తీసుకున్నారని పని పూర్తి చేయకపోగా మరో రూ.లక్ష అడుగుతున్నారన్న విషయాన్ని కలెక్టర్‌కు వివరించారు. వారి ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ ఏజేసీ కమలకుమారీని విచారణకు ఆదేశించారు. ఆమె కార్యాలయానికి వచ్చి సిబ్బందిని విచారించి కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా కలెక్టర్ ముత్యాలరాజు తహసీల్దార్, ఆర్‌ఐని సస్పెండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment