బదిలీల జాతర!
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో తహశీల్దార్ల బదిలీలకు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల ముందు జిల్లాలో మూడేళ్లకుపైగా పని చేస్తున్న వారిని ఎన్నికల కోడ్ మేరకు విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు బదిలీ చేశారు. అలాగే ఆ జిల్లాల నుంచి పలువురు ఇక్కడికి వచ్చారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిపోవడంతో ఇతర జిల్లాలకు వెళ్లిన వారిని వెనక్కి పంపుతూ ప్రభుత్వం నాలుగు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. పాతవారు ఇక్కడికి రావడంతోపాటు కొద్ది నెలలుగా జిల్లాలో పనిచేస్తున్న 25 మంది తహశీల్దార్లు విశాఖ, విజయనగరం జిల్లాలకు వెళ్లిపోనుండటంతో ఆ మేరకు మార్పుచేర్పులు జరపాల్సి ఉంది. వాస్తవానికి ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తికావాలి.
కానీ రాష్ట్ర విభజన, రాజకీయ మార్పులు వంటి పరిణామాలతోపాటు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు తమకు కావలసిన వారికి, అనుకూలంగా ఉన్న వారికి తమ సొంత నియోజకవర్గాల్లోని మండలాల్లో పోస్టింగ్ ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులపై ఈ ర కమైన సిఫారసులు, ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. పదేళ్లుగా ఆధికారం లేక, ఆశించిన పనులు జరగక అసంతృప్తితో ఉన్న కొత్త పాలకులు.. ఇప్పుడు తమ మాట నెగ్గించుకునేందుకు, అధికారం చెలాయించేందుకు వీలుగా తహశీల్దార్ల పోస్టింగులపై దృష్టి సారించారు. కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాలేదు, ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఇంకా ప్రమాణ స్వీకారం చేయనేలేదు. అయినా ఇప్పటినుంచే ఒత్తిళ్లు తెస్తుండటంతో ఉన్నతాధికారులు విస్తుపోతున్నారు. జిల్లాలో ప్రధానంగా శ్రీకాకుళం, టెక్కలి, ఆమదాలవలస, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లోని తహశీల్దార్లకు పోస్టింగులకు సంబంధించి ఎక్కువగా ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలిసింది.
ఎన్నికల ముందు విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు వెళ్లిన 26 మంది తహశీల్దార్లు తిరిగి వచ్చారు. వీరంతా జిల్లావాసులే. ఇక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతున్న ఇతర జిల్లాల వారి స్థానాల్లో వీరిని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో 38 మండలాలతో పాటు, ఆర్డీవో కార్యాలయం ఏవోలు, కలెక్టరేట్‌లోని సూపరింటెండెంట్లుగా తహశీల్దార్ హోదా అధికారులే ఉంటారు. జిల్లాకు తిరిగి వచ్చిన 26 మందితో పాటు, మిగిలిన 12 మండలాల తహశీల్దార్లు, ఇతర విభాగాల్లో ఉన్న తహశీల్దార్లను బదిలీ చేయనున్నారు. ఇవన్నీ కొత్త ఎమ్మెల్యేల సూచనలు, సిఫారసుల మేరకే జరగనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో ఈ జాబితాలు తుదిరూపు సంతరించుకోవచ్చు. తహశీల్దార్లతోపాటు ఎన్‌పోర్స్‌మెంట్ డీటీలు, తహశీల్దార్ కార్యాలయ సూపరింటెండెంట్ల(డీటీ)కు కూడా స్థానచలనం కలగనుంది. డీటీలు పౌరసరఫరాలకు సంబంధించి డీలర్లపై వచ్చే ఫిర్యాదుల విచారణ, కేసుల నమోదు వంటివి చూస్తుంటారు. గ్రామస్థాయిలో ఇవే కీలకమైనందున అనుకూలమైన డీటీలనే నియమించుకోవాలని కొత్త ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.