‘బోరు’న కన్నీరు | Takes the lives of farmers in agricultural bores | Sakshi
Sakshi News home page

‘బోరు’న కన్నీరు

Published Sat, Nov 14 2015 12:23 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

Takes the lives of farmers in agricultural bores

రైతుల ఉసురు తీస్తున్న వ్యవసాయ బోర్లు
వెయ్యి అడుగుల లోతు తీసినా దక్కని చుక్కనీరు
మాచర్ల నియోజకవర్గంలో ఎండిపోయిన బోర్లు సంఖ్యే పదివేలు
అప్పులు పెరిగి బలవన్మరణాలకు పాల్పడుతున్న కర్షకులు

 
గుంటూరు: పల్నాడులోని రైతుల ఆత్మహత్యలకు వ్యవసాయ బోర్లు ఒక రకంగా కారణమవుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోతున్న పంటలను కాపాడుకు నేందుకు రైతులు లక్షల రూపాయల ఖర్చుతో బోర్లు వేస్తున్నారు. 600 నుంచి 1000 అడుగుల లోతు వరకు బోరు వేసినా నీరు               పడకపోవడంతో  సాగుకు, బోరు ఏర్పాటుకు  చేసిన అప్పులు తీర్చేమార్గం లేక  ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పల్నాడులోని నరసరావుపేట, గురజాల, వినుకొండ, మాచర్ల నియోజకవర్గాల్లో రైతులు కొత్తగా 3 వేల బోర్లను వేసుకుంటే 1200 బోర్ల నుంచి మాత్రమే నామమాత్రంగా నీరు వస్తోంది. మిగిలిన 1800 బోర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. తాజాగా రెంటచింతల మండలం మల్లవరం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు రూ. 2 లక్షలను ఖర్చుపెట్టి వేసిన రెండు బోర్లు విఫలం చెందటంతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

పల్నాడులోని నరసరావుపేట, గురజాల, మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లోని రైతులు పత్తి, మిరప, ఇతర వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు, సాగర్ కుడికాలువ నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఈ దశలో రైతులు వ్యవసాయ బోర్లు వేయడం ప్రారంభించారు. మాచర్ల, దుర్గి, వెల్దుర్తి, రెంటచింతల, బొల్లాపల్లి, కారంపూడి మండలాల్లో సగటు వర్షపాతం 50 శాతానికి పడిపోవడంతో భూగర్భ జలాలు అడు గంటాయి. ప్రస్తుతం 556 నుంచి 750 అడుగుల వరకు బోరు వెళితేనే నీరు అందు తోంది. గతంలో విద్యుత్ బోరు వేయాలంటే రూ.80 వేల నుంచి లక్ష రూపాయల వరకు  రైతుకు ఖర్చుఅయ్యేది. ప్రస్తుతం రూ.1.50 లక్షలు ఖర్చు చేస్తున్నా నీరు  అందుబాటులోకి రావడం లేదు. రెంటచింతల గ్రామంలో ఇద్దరు రైతులు వెయ్యి అడుగుల లోతు వరకు బోర్లు వేసినా నీరుపడలేదు.

మాచర్ల నియోజకవర్గంలో 22 వేల బోర్లలో 10వేల బోర్లు ఎండిపోయాయి. కొత్తగా 2, 500 బోర్లు వేయగా అందులో 40 శాతం విఫలమయ్యాయి. గురజాల, నరస రావుపేట, వినుకొండలలో గతంలో 25 వేల బోర్లు ఉండగా ఇందులో కూడా 8 వేల నుంచి 10 వేల వరకు పనిచేయటం లేదు. ప్రతీ బోరు ఏర్పాటుకు రైతు కనీసం రూ.1.50 లక్షలను ఖర్చు చేస్తున్నాడు. ఇప్పటికే సాగుకు చేసిన అప్పులకు ఈ బోర్ల ఖర్చు అదనంగా కలుస్తూ రైతును మరింతగా అప్పుల ఊబిలోకి నెడుతోంది.
 
అధికార యంత్రాంగం ప్రేక్షకపాత్ర
ప్రస్తుత పరిస్థితులపై వ్యవసాయ, భూగర్భ జలవనరుల శాఖలు రైతులకు అవగాహన కలిగించాలి. ఏ ప్రాంతంలో ఎంతలోతులో భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయో రైతులకు వివరించాలి. అధికారుల సూచనల మేరకు రైతులు బోర్లు వేసే ఏర్పాటు చేయాలి. వీటిని పట్టించుకోకపోవడంతో పంటను కాపాడుకునే య త్నంలో రైతు మరింత అప్పుల్లో కూరుకుపోతున్నాడు.
 
భూగర్భ జలాలు పడిపోయాయి ...

పల్నాడులో భూగర్భ జలాలు పూర్తిగా పడిపోయాయి. వర్షాభావ పరిస్థితులు, సాగర్ కుడికాలువకు నీరు విడుదల కాకపోవడంతో 550 నుంచి 750 అడుగుల లోతు వరకు నీరు పడటం లేదు. ఇంత ఖర్చుతో బోర్లు వేసినా పూర్తిస్థాయిలో నీరు అందని దుస్థితి నెలకొంది. వీటిపై పూర్తిగా అవగాహన ఏర్పాటు చేసుకున్న తరువాతనే రైతు బోరు వేయడానికి సిద్ధం కావాలి.
 - శంకర్, జియాలజిస్టు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement