
ఆగని ఆత్మహత్యలు
* ఏడుగురు రైతుల బలవన్మరణం..
* గుండెపోటుతో మరో ఇద్దరు మృతి
సాక్షి, నెట్‌వర్క్: కళ్లు తెరిచినా.. కళ్లు మూసినా.. ఒకటే బాధ.. అప్పులు.. అప్పులు.. అన్నదాతలను అప్పుల బాధ వెంటాడుతూనే ఉంది. అటు ప్రభుత్వం, ఇటు విపక్షాలు, మరోవైపు అధికారులు ఎంత భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా.. వారి వేదన మాత్రం ఆగడం లేదు. ఉద్వేగంతో చివరకు ఉసురు తీసుకుంటున్నారు. అప్పుల బాధతో వేర్వేరు చోట్ల ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకోగా, మరో ఇద్దరు రైతులు గుండెపోటుతో మృతి చెందారు.
రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం చీమల్‌దరి అనుబంధ బాల్‌రెడ్డిగూడేనికి చెందిన చిన్న రామయ్య(50), ధారూరు మండలం తరిగొప్పుల గ్రామానికి చెందిన శివాజీరావు(32), నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన గడ్డం భోజన్న (47), మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం దాసర్ దొడ్డి గ్రామానికి చెందిన పెద్ద బాలకిష్టప్ప(60), బాలానగర్ మండలంలోని తిర్మలాపూర్‌లో కావలి కొండయ్య (45), పెబ్బేరు మండలంలోని పరిధిలోని కంచిరావుపల్లి గ్రామానికి చెందిన అక్కి రాములు గౌడ్(38) బలవన్మరణాలకు పాల్పడ్డారు.
గుండెపోటుతో ఇద్దరు రైతుల మృతి
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పనికర గ్రామానికి చెందిన చొప్పరి సంపత్(38), నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన రైతు ద్యావాల మైసయ్య(44).. పంటలు ఎండిపోవడం, అప్పులబాధ పెరిగిపోవడంతో తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందారు.
నాడు భర్త.. నేడు భార్య
కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన కౌలురైతు నల్వాల లక్ష్మి(35) భర్త గంగరాజం వ్యవసాయం చేస్తూ.. అప్పులబాధతో గతంలో ఆత్మహత్య చేసుకున్నాడు. వీరికి సుప్రియ(15), పవన్‌కల్యాణ్(13) సంతానం. భర్త మరణించిన తర్వాత లక్ష్మి రెండెకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తోంది. ఈ క్రమంలో రూ.2 లక్షల దాకా అప్పులయ్యూయి. మనస్తాపం చెందిన లక్ష్మి గురువారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుంది.