సదావర్తి భూముల వేలం ఆపండి..
సుప్రీంకోర్టులో తమిళనాడు ఇంప్లీడ్ పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ: సదావర్తి భూముల వేలం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆ భూములతో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధం లేనందున వేలం ఆపాలని, ఈ కేసులో తమ వాదనలు వినాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ (మధ్యంతర దరఖాస్తు) దాఖలు చేసింది. సదావర్తి సత్రం భూములు ఎవరూ క్లెయిం చేయని ఆస్తులని, అందువల్ల అవి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవని పేర్కొంది. ఇందుకు సంబంధించి సదావర్తి సత్రం మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉందని, వీటికి పట్టా కూడా లేదని పిటిషన్‌లో వివరించింది.
అందువల్ల సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న సంజీవరెడ్డి వర్సెస్ ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసులో తమను ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతించాలని కోరింది. ఈనెల 18న జరగనున్న వేలాన్ని నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. లేదంటే మద్రాసు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్‌పై వెలువడే తీర్పునకు లోబడి ఈ వేలం ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. కాగా, ఈ పిటిషన్‌ను ఈనెల 18న ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వద్ద ప్రస్తావించనున్నట్టు పిటిషనర్ తరఫు న్యాయవాది మీడియాకు తెలిపారు.
ఇదీ సంగతి..
సాక్షి, చెన్నై: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సదావర్తి సత్రానికి చెందిన 83 ఎకరాల భూములను వేలం వేస్తుండటంపై తమిళనాడుకు చెందిన కొందరు మద్రాసు హైకోర్టుకు వెళ్లారు. వీరి వాదన విన్న ధర్మాసనం.. ఈ భూములపై ఎవరికి హక్కు ఉందో నవంబర్ 30లోగా తేల్చాలని కాంచీపురం డీఆర్వోను ఆదేసిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా సమాచారం అందడంతో తమ వాదన వివరిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ నోట్ సిద్ధం చేస్తోంది.