ఎంత తేడా.. మేం కళ్లు మూసుకోలేం | Supreme court shocked on sadavati lands issue | Sakshi
Sakshi News home page

ఎంత తేడా.. మేం కళ్లు మూసుకోలేం

Published Sat, Sep 23 2017 1:06 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

Supreme court shocked on sadavati lands issue - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రెండవసారి నిర్వహించిన వేలంలో సదావర్తి సత్రం భూముల ధర మూడింతలు పెరగడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, న్యాయ మూర్తులు జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ భూములను తొలిసారి వేలం వేసినప్పుడు తాము వేలం పాడి దక్కించుకున్నామని, తమకే అప్పగిం చాలని ఎం.సంజీవరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈనెల 12న ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ కళ్లు కప్పొద్దని, వేలం తిరిగి నిర్వహించాల్సిం దేనని ఆదేశిస్తూ కేసును 22వ తేదీకి వాయిదా వేసింది. తాజాగా శుక్రవారం ఈ కేసు విచారణకు రాగా.. వాది, ప్రతివాది ఇద్దరూ వేలంలో పాల్గొన్నారా? వేలంలో ధర ఎంత పలికింది? అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. దీనికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫు న్యాయవాది గుంటూరు ప్రభాకర్‌ స్పందిస్తూ వేలం వివరాలను ధర్మాసనానికి వివరించారు. వాది, ప్రతివాది ఇద్దరూ వేలంలో పాల్గొన్నారని, అత్యధికంగా రూ.60.30 కోట్ల ధర పలికిందని వివరించారు. దీంతో ధర్మాసనంలోని ముగ్గురు న్యాయమూర్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘చూడండి ఎంత తేడా ఉందో.. దయచేసి మీరు మొదటి వేలానికి, రెండో వేలానికి వ్యత్యాసం చూడండి. రూ.22 కోట్లు ఎక్కడ? రూ.60 కోట్లు ఎక్కడ? దాదాపు రూ.40 కోట్లు. అంటే మూడింతలు. ప్రజల ఆస్తులను, ట్రస్టు ఆస్తులను ఇలా తక్కువ ధరకు అమ్మేయడం సరికాదు. ఇలా జరిగితే మేం కళ్లు మూసుకోలేం..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మొదటి బిడ్డర్‌ సత్యనారాయణ బిల్డర్స్‌ నిర్ణీత గడువులోగా నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించలేదని, దీంతో రెండో బిడ్డర్‌ చదలవాడ లక్ష్మణ్‌ (రూ.60.25 కోట్లు)కు శనివారం వరకు డబ్బు చెల్లించేం దుకు అవకాశం ఉందని గుంటూరు ప్రభాకర్‌ వివరించారు. ఇదే సందర్భంలో తమిళనాడు ప్రభుత్వం తరపు న్యాయవాది తాము ఈ కేసులో మధ్యంతర దరఖాస్తు సమర్పించామని, ఈ భూములు తమ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. అందువల్ల వీటిపై హక్కులు తమకే చెందుతాయని ధర్మాసనానికి విన్నవించగా.. జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఈ విన్నపాన్ని తోసిపుచ్చారు. ‘‘ఏంటి ఇది? మేం ఈ కేసు విచారిస్తున్నది భూముల టైటిల్‌ ఎవరిదో నిర్ణయించడానికి కాదు..’’ అని చెబుతూ ఆ దరఖాస్తును విచారించేం దుకు నిరాకరించారు. పిటిషనర్‌ సంజీవరెడ్డి తరఫు న్యాయవాది రామకృష్ణ ప్రసాద్‌ స్పందిస్తూ.. ఈ వేలంపై తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, వాటికి సంబం ధించిన డాక్యుమెంట్ల సమర్పణకు కొంత గడువు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో విచారణను ధర్మాసనం అక్టోబర్‌ 6వ తేదీకి వాయిదా వేసింది. విచారణకు ప్రతివాది ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆయన తరఫు న్యాయవాదులు సుధాకర్‌రెడ్డి, అల్లంకి రమేశ్‌ హాజరయ్యారు.
 

వేలం వేసిన భూముల విలువ రూ.1,300 కోట్లు
సదావర్తి భూముల అమ్మకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల అధికారులు, అనధికారుల అవినీతి వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఎం.సంజీవరెడ్డి వర్సెస్‌ ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసులో తనను ఇంప్లీడ్‌ అయ్యేందుకు అనుమతించాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం ఆయన తరఫున న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సదావర్తి సత్రం లక్ష్యం, ఉద్దేశాన్ని కాపాడేందుకు ఆ భూములను పరిరక్షించాలని, లేదా ట్రస్టుకు ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. సదావర్తి భూములు మొత్తం రూ.5 వేల కోట్ల విలువైనవని వివరించారు. ఆక్రమించుకున్నవి, అన్యాక్రాంతమైనవి, తమిళనాడు ప్రభుత్వం కేటాయించినవి పోగా ఇప్పుడు వేలం వేసిన 83.11 ఎకరాల భూముల విలువ దాదాపు రూ.1,300 కోట్లు అని పేర్కొన్నారు. ఈ భూములను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కుయుక్తులతో కేవలం రూ.22 కోట్లకే అధికార పార్టీకి చెందిన వారికి కట్టబెట్టేందుకు వేలాన్ని ఎంపిక చేసిన బృందానికి పరిమితం చేసిందన్నారు. కోర్టు ఆదేశించిన నేపథ్యంలో రెండోసారి వేలం నిర్వహిస్తే తనకు సంబంధం లేకపోయినా మంత్రి ఆదినారాయణరెడ్డి వేలాన్ని నియంత్రించారని, ఈ వేలంలో పాల్గొంటే ఐటీ దాడులు తప్పవని ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేశ్‌ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారని ఆరోపించారు.

‘‘రూ.22 కోట్లు ఎక్కడ? రూ.60 కోట్లు ఎక్కడ? సదావర్తి భూముల వేలం ధర మూడింతలు పెరిగింది. ట్రస్టు ఆస్తులను అతి తక్కువ ధరకు అమ్మేయడం సరికాదు. ఇలా జరిగితే మేం కళ్లు మూసుకోలేం..’’
– జస్టిస్‌ దీపక్‌ మిశ్రా,భారత ప్రధాన న్యాయమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement