సాక్షి, హైదరాబాద్ : సదావర్తి భూముల వ్యవహరంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా భూములు ఎవరివో తేల్చాలంటూ అత్యున్నత న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేయటంపై ఆర్కే హర్షం వ్యక్తం చేశారు. రెండు అంశాలను సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుని ఆదేశాలు జారీ చేసిందని ఆయన అన్నారు. కేవలం భూములను కాజేసేందుకు చంద్రబాబు సుప్రీం కోర్టుకు వెళ్లారని ఆర్కే చెప్పారు. చంద్రబాబు తన బినామీలతో సదావర్తి భూములను చేజిక్కించుకునేందుకు యత్నించాడని.. దమ్ముంటే సొంత డబ్బు కట్టాలని ఆర్కే ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బాబు బినామీలు ఇప్పటికే కట్టిన డబ్బు వడ్డీ అడుగుతున్నారని.. ప్రజా ఆస్తిని చివరకు వడ్డీల రూపంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం వసూలు చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. ఒకవేళ కోర్టు ఆదేశాల ప్రకారం వడ్డీ కట్టాల్సి వస్తే దానిని ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా చంద్రబాబు, లోకేశ్ ఆస్తుల నుంచి కట్టేలా చూడాలని కోర్టును కోరారు.
472 ఎకరాలను రాజా వాసిరెడ్డి పేద బ్రాహ్మణులకు ఇచ్చారని.. ఏపీ దేవాదాయ శాఖ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆర్కే అన్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చి దేవాదయ భూములు అమ్ముకూడదన్న జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో తమిళనాడు ప్రభుత్వానికి ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆర్కే అభిప్రాయపడ్డారు. తమిళనాడు పిటిషన్ ఆధారంగానే సదావర్తి భూములు ఎవరివో తేల్చాలంటూ హైకోర్టుకు సుప్రీం కోర్టు తాజాగా ఆదేశాలను జారీచేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment