=ఒకరిపై మరొకరు దాడి.
=పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు
=అర్ధరాత్రి ‘రావి’ పంచాయితీ
గుడివాడ అర్బన్, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీలో తమ్ముళ్ల మధ్య రోజు రోజుకు ఘర్షణలు పెరిగిపోయి కొట్లాడుకునేస్థాయికి చేరుతున్నాయి. చివరికి బాబు ఎదుటే పంచాయతీ పెట్టే స్థాయికి వచ్చాయి. వివరాల్లోకి వెళితే గుడివాడ తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్ష పదవి కోసం ఇద్దరు యువకులుపోటీపడుతున్నారు. వీరిద్దరిలో ఎవర్ని నియమించాలో తెలియక నియోజకవర్గపు ఇన్‌ఛార్జి రావి వెంకటేశ్వరరావు సతమతమవుతున్నారు . దీంతో ఆ ఇద్దరు యువకుల వర్గాల మధ్య నిత్యం ఘర్షణలు చోటు చేసుకుని పోలీస్‌స్టేషన్ వరకూ వెళ్తున్నాయి. కడియాల గణేష్, నానాజీ అనే ఇద్దరు తమ అనుచరవర్గంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఈ నేపథ్యంలో తుపాను దెబ్బకు పంటనష్టపోయిన రైతులను పరామర్శించేందకు చంద్రబాబు మంగళవారం గుడివాడ నియోజకవర్గానికి వస్తున్నారనే విషయం తెలుసుకున్న గణేష్, నానాజీ తమ తమ అనుచరులతో విద్యుత్ కార్యాలయం వద్దకు ర్యాలీగా వచ్చారు. బాబు కాన్వాయ్ వెంట గణేష్‌కు చెందిన 12మంది కుర్రాళ్లు, నానాజీకి చెందిన 18మంది కుర్రాళ్లు ర్యాలీగా వెళ్తున్నారు. నాగవరప్పాడు వంతెన వద్దకు రాగానే రోడ్డు గతుకులుగా ఉండటం వల్ల పక్కపక్కన వెళ్తున్న గణేష్ అనుచరుడు శంకర్, నానాజీ అనుచరుడు వల్లభనేని హరీనాథ్ వాహానాలు ఒకదానికొకటి రాసుకున్నాయి.
దీంతో అసహనానికి గురైన నానాజీతో సహా 6గురు శంకర్‌పై దాడి చేశారు. ఈ దాడిలో శంకర్‌కు కన్ను పక్కన, నుదిటిపై గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గణేష్ స్థానిక పాలిటెక్నిక్ కళాశాల వద్ద తన ద్విచక్రవాహానాన్ని బాబు కాన్వాయ్‌కు అడ్డం పెట్టారు. అప్పటికే సమయం మించిపోవడంతో బాబు కాన్వాయ్ ఆపకుండా పక్కన నుంచి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన గణేష్ జొన్నపాడులో రైతులతో మాట్లాడుతున్న చంద్రబాబు వద్దకు చేరుకుని ర్యాలీకి వస్తే నా అనుచరులను కొడతారా..? పార్టీలో రావి మాకు సరైన అవకాశం ఇవ్వట్లేదు మమ్మల్ని గుర్తించట్లేదు అధినాయకుడుగా మీరైనా న్యాయం చేయాలని బిగ్గరగా అరుస్తూ ఆందోళనకు దిగాడు.
ఈ గొడవను బాబు గమనించేలోపు అక్కడ ఉన్న నాయకులు జోక్యం చేసుకుని పార్టీ కార్యాలయంలో సమస్య పరిష్కరిస్తాం.. ఇక్కడ ఎటువంటి ఆందోళన చేయొద్దు అని బతిమిలాడుతుండగానే బాబు అక్కడ నుంచి నిష్ర్కమించారు. నాపై అన్యాయంగా దాడి చేశారంటూ గణేష్ అనుచరుడు శంకర్ నానాజీ అతని అనుచరులపై అర్ధరాత్రి సమయంలో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం రాత్రి ఒంటిగంట సమయంలో స్థానిక పార్టీ కార్యాలయంలో రావి సమక్షంలో గణేష్ అనుచరులపై జరిగిన దాడి విషయమై పంచాయితీ పెట్టారు. పరిస్థితులు చక్కదిద్దడం మీకు చేతకాకపోతే తప్పుకోండి అంటూ రావిపై రుసరుసలాడినట్లు తెలిసింది. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని రావి వారికి హామీ ఇచ్చారని సమాచారం.
బాబు సాక్షిగా తమ్ముళ్ల తన్నులాట!
Published Thu, Nov 28 2013 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM
Advertisement
Advertisement