
టార్గెట్.. సైకిల్!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : జిల్లాలో బలోపేతం అయ్యేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యూహం రచిస్తోంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకునే బలోపేతం కావాలని భావిస్తోంది. ఇందుకోసం టీడీపీలో తాజాగా జరుగుతున్న వర్గపోరును తమకు అనుకూలంగా మార్చుకోవాలనిన్నారు. అయితే ఈ మొత్తం ప్రక్రియను మిత్ర బంధానికి విఘాతం కలగకుండా చాకచక్యంగా చేయాలనేది బీజేపీ జిల్లా నాయకత్వం ఆలోచనగా ఉంది. మొత్తం మీద అధికార టీడీపీని లక్ష్యంగా చేసుకుని బలోపేతం అయ్యేందుకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది.
పోరును పదునెక్కిద్దాం..!
అధికార టీడీపీలో రోజురోజుకీ వర్గపోరు తీవ్రం అవుతోంది. మొన్నటివరకు కేఈ-టీజీల మధ్య ఉన్న వర్గపోరు బెరైడ్డి రీ-ఎంట్రీ నేపథ్యంలో పార్టీ మొత్తం రెండు వర్గాలుగా విడిపోయే దుస్థితి నెలకొంది. ఈ వర్గపోరును ఆసరాగా చేసుకుని బలోపేతం కావాలనేది బీజేపీ ఆలోచనగా ఉంది. వాస్తవానికి జెడ్పీ చైర్మన్ ఎపిసోడ్‌తోనే ఈ ఆలోచనకు బీజేపీ పునాదులు వేసుకుందన్న ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచి టీడీపీలో చేరి జెడ్పీ చైర్మన్‌గా ఉన్న రాజశేఖర్‌పై వచ్చిన నకిలీ మద్యం కేసు నేపథ్యంలో ఆయన్ను తొలగించి తాము ఆ పీఠాన్ని అధిష్టించేందుకు టీడీపీలోని కొందరు నేతలు ప్రయత్నించారు.
ఈ వర్గపోరును బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు అప్పట్లోనే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే జెడ్పీ చైర్మన్ రాజశేఖర్‌ను అరెస్టు చేయాలంటూ ఏకంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించింది. తద్వారా కేసు ఎదుర్కొంటున్నప్పటికీ జెడ్పీ చైర్మన్‌ను తొలగించేందుకు ససేమిరా అన్న టీడీపీ అధిష్టానాన్ని ధర్నాతో లక్ష్యంగా చేసుకోవడంతో పాటు ఆ పార్టీలోని అసంతృప్తులకు కూడా వల వేసేందుకు ఉపయోగపడుతుందని భావించింది. తద్వారా స్వామి కార్యంతో పాటు స్వకార్యాన్ని పూర్తి చేసుకోవచ్చునేది బీజేపీ నేతల అభిప్రాయం.
తాజాగా బెరైడ్డి రాజశేఖరరెడ్డి రీ-ఎంట్రీతో ఆ పార్టీలో లుకలుకలు మళ్లీ మొదలయ్యాయి. బెరైడ్డి రాకను ఒక వర్గం వ్యతిరేకిస్తుండగా.. మరో వర్గం స్వాగతిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం కాస్తా చినికిచినికి గాలివానలాగా మారినట్లు ఆ పార్టీలో బహిరంగ విమర్శలకు దారితీసింది. ఇప్పుడు కూడా తాజా వర్గపోరును నిశితంగా గమనిస్తూ.. ఈ పోరు తీవ్రతరం అయ్యే కొద్దీ అసంతృప్త నేతలను తమవైపు లాక్కోవాలనేది బీజేపీ పార్టీ భావిస్తోంది.
నామినేటెడ్ పోస్టుల భర్తీపై నజర్..
వాస్తవానికి నియోజకవర్గ ఇంచార్జీలు ప్రతిపాదించిన వ్యక్తులకే నామినేటెడ్ పోస్టులను ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది. అయితే, ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో పార్టీలోకి వచ్చి తాజా మాజీ కాంగ్రెస్ నేతలకు చుక్కెదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ద్వారా ఆ పార్టీ నాయకత్వంలో చెలరేగే అసంతృప్తిని కూడా తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
అయితే, ఈ తతంగం చాలా నెమ్మదిగా జరిగే కార్యక్రమమని... తాము తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నామన్న భావన బయటికి రాకుండా చూసుకోవాల్సి ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. ‘కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో తెలుగుదేశం పార్టీ మాకు కూటమిగా ఉంది. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఆ పార్టీతో కలిసి అధికారాన్ని కలిసి పంచుకున్నాయి. అయితే, ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
అంతేకాకుండా రాయలసీమకు టీడీపీ అన్యాయం చేస్తుందన్న భావన కూడా ప్రజల్లో బలపడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీని టార్గెట్ చేసుకుని బలపడాలన్న మా ప్రణాళికను జాగ్రత్తగా అమలు చేయాలనేది మా భావనగా ఉంది’ అని బీజేపీ సీనియర్ నేత ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. మొత్తం మీద బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీలో కలవరం సృష్టిస్తున్నాయి.