కడప రూరల్ : భారతీయ జనతా పార్టీ సహకారాన్ని అభ్యర్థించి మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను తగులబెట్టడం విడ్డూరంగా ఉందని ఆ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. రాష్ట్రానికి టీడీపీ ఏం చేసిందని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వస్తున్న నిధుల కేటాయింపుపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. సోమవారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదినేని రామసుబ్బయ్య, రాష్ట్ర నాయకురాలు చేపూరి శారదమ్మలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై ఉన్న ఫలంగా టీడీపీ నేతలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను కాల్చడం విడ్డూరంగా ఉందన్నారు.
అందులోనూ మిత్రపక్షమైన ఆ పార్టీ ఇలా వ్యవహారించడం దారుణమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆజ్ఞ లేకుండానే ఇలా జరుగుతుందా.. అని ప్రశ్నించారు. చంద్రబాబు జోక్యం లేని పక్షంలో దిష్టిబొమ్మను దహనం చేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇందుకు చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికార పగ్గాలను చేపట్టాక రాష్ట్రాభివృద్ధి కోసం ఏం చేసిందని ప్రశ్నించారు.
కేంద్రం ఇప్పటికి రూ. 6701 కోట్ల నిధులను కేటాయించిందని, అందుకు సంబంధించిన ఖర్చుల వివరాలను నేటికీ తెలుపలేదన్నారు. పోలవరం పట్ల రాష్ట్రం నిర్లక్ష్యం వహిస్తే కేంద్రం నిధులను కేటాయించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాల వల్లనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు.నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతోందని, నిధులు వస్తున్నాయని, పలు పథకాలు అమలవుతున్నాయని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై తాము కూడా దిష్టి బొమ్మను దహనం చేయగలమని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేస్తున్న నిధుల కేటాయింపులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్ర విభజనకు సంబంధించి టీడీపీ రెండు నాల్కల ధోరణి ప్రదర్శించిందని, తమ పార్టీ ఎన్నడూ అలా నడుచుకోలేదన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు చలపతి, సుదర్శన్‌రెడ్డి, ప్రమీలారాణి పాల్గొన్నారు.
రాష్ట్రానికి టీడీపీ ఏం చేసింది?
Published Tue, Apr 28 2015 2:26 AM | Last Updated on Sun, Sep 3 2017 12:59 AM
Advertisement
Advertisement