సాక్షి, కడప : కొత్త కలెక్టరేట్ పనులు అనుకున్న గడువులోపు పూర్తి కాలేదు. ఈ ఏడాది జనవరిలో అడుగు పెడదామని రంగం సిద్ధం చేసుకున్న అధికారులు మరికొంత కాలం వేచి ఉండాల్సిన పరిస్ధితి వచ్చింది. నూతన భవనాలను ప్రారంభించాలని ఊవ్విళ్లూరిన మంత్రుల కోరిక నెరవేరేటట్టులేదు.
పనులు పూర్తి కాకుండానే ప్రారంభించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చి శిలాఫలకంపై పేర్లు వేసుకోవాలని తాపత్రయ పడినా చివరకు వీరికి చుక్కెదురైంది. మార్చి నాటికి పనులు పూర్తి కావని అధికారులు తేల్చిచెప్పడంతో నిరాశే మిగిలింది. పూర్తికాని పనులు నూతన కలెక్టరేట్‌కు సంబంధించి సివిల్ పనులు దాదాపు పూర్తయ్యాయి. భవనాలకు రెండవ కోటింగ్ పెయింట్ మాత్రమే వేయాల్సి ఉంది.
కాంపౌండ్, ఇంటర్నల్ రోడ్డు పనులకు సంబంధించి టెండర్ల నిర్వహణలో జాప్యం జరిగింది. రోడ్డు పనులకు రూ. 2.2కోట్లు, ప్రహరీ పనులకు రూ.2.5 కోట్లతో టెండర్లు ఖరారు కావడంతో పనులు ఊపందుకొన్నాయి. మొత్తం 40 శాఖలు ఇందులో కొలువుతీరనున్నాయి. పనులు పూర్తయి అన్ని శాఖలు కొలువు తీరితే కార్యాలయ సముదాయాలు, మినీ సచివాలయాన్ని తలపించనున్నాయి. ప్రజల సౌకర్యార్థం అన్నిశాఖలు ఒకేచోట ఉండాలని అందుకు వీలుగా భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయం నెరవేరనుంది. రెండేళ్ల కిందటే ప్రారంభం కావలసి ఉన్నా నిధుల లేమితో పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది.
ఫర్నిచర్ కొనుగోలుకు టెండర్ల ఖరారు
కొత్త కలెక్టరేట్‌లో 40 శాఖల కార్యాలయాలు కొలువు తీరేందుకు వీలుగా అవసరమైన ఫర్నిచర్ కొనుగోలుకు సంబంధించి టెండర్లు ఖరారు చేశారు. రూ.10 కోట్ల రూపాయలతో టెండర్లు ఖరారయ్యాయి. ఇందులో ఎలక్ట్రికల్ పనులు ఉన్నాయి. కలెక్టర్, జేసీ, స్పెషల్ కలెక్టర్, డీఆర్వో వంటి ముఖ్య కార్యాలయాలకు, మీటింగ్ హాలుకు ఇంటిరియర్ డెకరేషన్ పనులు రూ.71 లక్షలతో జరుగుతున్నాయి. పచ్చదనం కోసం రూ.30 లక్షలు కేటాయించారు. మొత్తం మీద అన్ని పనులు పూర్తయితే ఈ ప్రాంతం కొత్త శోభ సంతరించుకోనుంది. ప్రజలకు అన్ని విధాల మేలు చేకూరనుంది.
మార్చి నాటికి పనులు పూర్తి
కొత్త కలెక్టరేట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మార్చి నాటికి దాదాపు అన్ని పనులు పూర్తవుతాయి. నిధుల సమస్య లేదు. ప్రస్తుతం రోడ్లు, ప్రహరీ పనులు సాగుతున్నాయి.
- మల్లేశ్వరరెడ్డి,
ఏపీహెచ్‌ఎంఐడీసీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు.
కుదరని ముహూర్తం
Published Thu, Feb 13 2014 1:44 AM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM
Advertisement
Advertisement